తెలంగాణ

TG : నిమజ్జనం స్పెషల్.. 24 గంటల పాటు ఆర్టీసీ బస్సు సేవలు

రచన: Kumar•••4 నిమిషాల పఠనం

హైదరాబాద్ మహానగరంలో నేడు గణనాథుల నిమజ్జనాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే వందలాది గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుండగా..మరికొన్ని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బేబి పాండ్స్ వద్దకు చేరుకుంటున్నాయి.

హైదరాబాద్ మహానగరంలో నేడు గణనాథుల నిమజ్జనాలు ఘనంగా జరగనున్నాయి. ఇప్పటికే వందలాది గణనాథులు ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటుండగా..మరికొన్ని ఎన్టీఆర్ మైదానంలో ఏర్పాటు చేసిన బేబి పాండ్స్ వద్దకు చేరుకుంటున్నాయి. ఖైరతాబాద్ బడా గణేశ్ శోభాయాత్ర ఇప్పటికే ప్రారంభం అవ్వగా.. మధ్యాహ్నం వరకు నిమజ్జనం పూర్తికానుంది. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాలు జరిగేలా పోలీసులు అన్ని రకాల చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలోనే ట్యాంక్ బండ్ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. అయితే, గణేశ్ నిమజ్జనానికి తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి హుస్సేన్‌సాగర్‌ సమీప ప్రాంతాలకు, అక్కడి నుంచి గమ్యస్థానాలకు చేరుకునేందుకు 24 గంటల పాటు నిరంతరాయంగా సుమారు 700 ప్రత్యేక బస్సులను నడపనుంది. శోభాయాత్ర రద్దీ, ట్రాఫిక్ మళ్లింపులు, పర్యవేక్షణ కోసం 44 కీలక ప్రాంతాల్లో ఆర్టీసీ అధికారులు, కంట్రోలర్లను రంగంలోకి దించింది.

ప్రయాణికుల రద్దీ,అవసరాన్ని బట్టి బస్సుల రవాణా పెంపును ఎప్పటికప్పుడు సమీక్షించేందుకు జోనల్ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు. ఖైరతాబాద్, లక్డీకపూల్, కోఠి, బషీర్‌బాగ్, ఇందిరా పార్క్, ఆకాశవాణి (AIR) ప్రాంతాల్లో ప్రత్యేక ఆర్టీసీ క్యాంపులను ఏర్పాటుచేసింది. రద్దీ మార్గంలో బస్సులు మొరాయిస్తే తక్షణమే మరమ్మతులు చేపట్టేందుకు పోలీస్ స్టేషన్లు, వ్యూహాత్మక కూడళ్ల వద్ద 113 మంది అదనపు డ్రైవర్లు, 87 మంది మెకానిక్‌లను సైతం సిద్ధంగా ఉంచారు.

అత్యవసర పరిస్థితుల్లో సాయం అందించేందుకు ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్, ఇందిరా పార్క్, వీవీ విగ్రహం వద్ద ప్రత్యేక ఆర్టీసీ రిలీఫ్ వాహనాలను మోహరించారు. ట్రాఫిక్ పోలీసుల మార్గదర్శకాలకు అనుగుణంగా సిటీ బస్సులతో పాటు ఏపీఎస్ఆర్టీసీ, కేఎస్ఆర్టీసీ వంటి అంతర్రాష్ట్ర బస్సుల రూట్లను ప్రత్యామ్నాయ మార్గాల్లోకి మళ్లించారు. శనివారం మధ్యాహ్నం వరకు నిమజ్జన ప్రక్రియ కొనసాగే అవకాశమున్నట్టు సమాచారం.దీంతో సాధారణ ప్రయాణికులకు రవాణా పరంగా ఎలాంటి ఇబ్బందులు రాకుండా టీజీఎస్ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది.

#RTC buses#24 hours#today#ganesh imersion#hyderabad#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి