స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

రేవంత్ రవ్వంత కంటే ఎక్కువే తగ్గుతున్నారు!?

రచన: Swechaanews Chairman••11 నిమిషాల పఠనం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి గుంపులోని మేస్త్రీలతో చర్చించి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో ప్రశ్నించే ప్రజాస్వామ్యం ఒక వైపు, అధిష్టానం సుతిమొత్తటి మందలింపులు, ప్రతిపక్షాల నిలదీతతో రేవంత్ రవ్వంతనైనా తగ్గాల్సి వస్తోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌లా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజల వద్ద కష్టమనే భావన కనిపిస్తోంది.

  • మైక్‌లో గాండ్రింపులు

  • ప్రజల ఆగ్రహంతో ప్రత్యామ్నాయాలు

  • పగలు తీర్చుకోకుండా సెటిల్మెంట్లతోనే అనేక లబ్ధి?

  • మెట్టు దిగడమే అన్నిటికీ మేలుగా పనులు?

  • చివరికి ప్రత్యర్ధులను సైతం పరోక్షంగా వాడుకుంటున్న తీరు ఏంటి?

  • కేసీఆర్‌లా తెగేదాకా లాగం.. ప్రజలే ఫైనల్ అని దిగొస్తున్న తీరుపై స్వేచ్ఛ న్యూస్ ప్రత్యేక కథనం ..

  1. 22ఏ పై కొనసాగుతున్న దిద్దుబాటు చర్యలు

  2. జూరాలలో రైతుల అందోళనతో కర్ణాటకకు మంత్రులు

  3. ఉద్యోగులకు 2 డీఏలు ఇస్తామని హామీ

  4. పాలిటెక్నిక్ విద్యార్ధుల ఆందోళనతో జీవో 97ని నిలిపివేసిన ప్రభుత్వం

  5. క్యూర్ పరిధిలో ప్రాపర్టీ ట్యాక్స్ పెంపుకు 10 శాతంతోనే బ్రేకులు

  6. జీవో 49 కొమురం భీం టైగర్ రిజర్వ్‌పై కన్జర్వేషన్ రిజర్వ్ ప్రకటన నిలిపివేత

  7. లగచర్ల - పొలేపల్లిలో ఫార్మా కాదు మల్టీపర్సస్ ఇండ్రస్టీగా మార్పు

  8. ధర్మపురి ఇథనాల్ ప్రతిపాదన నిరసనలతో ఉపసంహరణ

  9. నీట్ పీజీలో లోకల్ కోటాపై హైకోర్టు మొట్టికాయలతో వెనక్కి

  10. సోషల్ వెల్ఫేర్ గురుకులాల్లో పార్ట్‌టైమ్ టీచర్ల తొలగింపుపై పునరాలోచన

  11. ఆందోళనలతోనే పెండింగ్‌లో ఉన్న హెల్త్ కార్డ్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్‌పై నిధుల విడుదల

  12. హైడ్రా అత్యుత్సాహంతో ఇళ్లలో నివాసం ఉంటే ముట్టుకోమని భరోసా?

  13. ప్రైవేట్ కాలేజీల ఆర్టీఎఫ్ బకాయిల ఆందోళనతో రూ.600 కోట్ల విడుదలకు అంగీకారం

  14. ఆందోళనలతో గ్రూప్స్ వాయిదా వేసి ఆ తర్వాత నిర్వహణ

  15. సెంట్రల్ యూనివర్సీటి కంచె గచ్చిబౌలిలో 400 ఎకరాల వేలం అంశంలో గుణపాఠం

  16. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ 10 ఎకరాల భూమి ప్రతిపాదన రద్దు

  17. విద్యార్ధుల కేసులతో ఎకో పార్క్ దిశగా అడుగులు

  18. ఐటీ రంగం ఆగ్రహంతో ప్రభుత్వ కార్యాలన్నింటిని టీహబ్‌కు తరలించడం నిలిపివేత

  19. కోకాపేట్ శారదా పీఠం భూములు వాటర్ బోర్డుకు కేటాయించే విషయంలో మార్పులు

  20. జూబ్లీ బీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు అని ఆర్భాటం.. పర్యావరణ ఆందోళనలతో ఒకటికే పరిమితం

  21. ఉరధం దేవాలయం రోడ్డు విస్తరణలో కూల్చివేతలు వద్దని ఆదేశాలు

  22. దేవాలయ పూజారుల బదిలీ ప్రక్రియ — బ్రాహ్మణ సమాజం అభ్యంతరాలతో నిలిపివేత

  23. సంధ్యా థియేటర్ సంఘటన తర్వాత సినిమా టికెట్ పెంపు, స్పెషల్ షోల అనుమతులు వెనక్కి..

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్ఛ న్యూస్ చైర్మన్.

గాండ్రింపులు అన్నీ ప్రతిపక్షాల వద్దే!

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల ఆందోళనలతో వెనక్కి తగ్గుతున్నారు. ఒకటికి రెండు సార్లు ఆలోచించి గుంపులోని మేస్త్రీలతో చర్చించి పరిష్కార దిశగా అడుగులు వేస్తున్నారు. కాంగ్రెస్‌లో ప్రశ్నించే ప్రజాస్వామ్యం ఒక వైపు, అధిష్టానం సుతిమొత్తటి మందలింపులు, ప్రతిపక్షాల నిలదీతతో రేవంత్ రవ్వంతనైనా తగ్గాల్సి వస్తోంది. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌లా వ్యవహరిస్తే తెలంగాణ ప్రజల వద్ద కష్టమనే భావన కనిపిస్తోంది. అందుకే ప్రతిపక్ష నాయకులపైనే చర్యలు అంటూ కాలం నెట్టుకొస్తున్నారు. ప్రజలకు ఇబ్బందులు ఉండే వాటిని వెంటనే క్లోజ్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

లగచర్ల నుంచి 22ఏ వరకు..

2024లో ప్రభుత్వం కుదురుకోగానే ఫార్మా సిటీని లగచర్లకు మారుస్తామని భూ సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. దీనిపై సీఎం సొంత నియోజకవర్గంలోనే తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో మల్టీలెవల్ ఇండస్ట్రీ అంటూ భూ సేకరణ చేశారు. ఇలా సెంట్రల్ యూనివర్సటీ భూముల్లో, హైడ్రా అడ్డగోలు కూల్చివేతల క్రమంలో నిబంధనలు మార్చుకున్నారు. స్టూడెంట్స్ ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఇస్తామని హామీ ఇచ్చారు. రుణమాఫీపై కూడా పిల్లిమొగ్గలు వేసినా మళ్లీ కొంత వరకు సర్దుబాటు చేసుకున్నారు. యూరియా కొరత ఉన్నా, యాప్‌లు అంటూ నెట్టుకొచ్చారు.

భూ సేకరణలో టీడీఆర్ అంటూ డిమాండ్ పెంచే ప్రయత్నం చేశారు. గ్రూప్ వన్ అభ్యర్ధుల ఆందోళనలతో మళ్లీ నిర్వహించి ఎంతో కొంత తగ్గారు. ఇలా చెప్పుకుంటూ పోతే 20 విషయాల్లో వెనకడుగు వేశారు. ప్రైవేట్ భూ దోపిడీ కొనసాగినా, ప్రజలకు సంబంధించిన అంశాలపై కొద్ది నెలల్లోనే మేలుకున్నారు. ఎన్నో కేసులు పెట్టినా కోర్టుల ద్వారానే తేల్చుకుందాం అన్నట్లు ప్రత్యర్ధులపై పగ తీర్చుకోవడంలోనూ వెనక్కి తగ్గుతున్నారు. వాళ్లు చేసిన ఆర్థిక లావాదేవీలను వాడుకుంటూ ఆర్థికంగా బలపడుతున్నారు. అనేక కేసుల్లో ఎంతోమందిని అరెస్ట్ చేయాల్సి ఉండగా తప్పిస్తే ఎప్పుడైనా ఉపయోగపడుతారులే అని వదిలేయడం కూడా ఒక తగ్గుముఖమే? అందుకే కాళేశ్వరం ప్రాజెక్ట్‌లో సీబీఐకి ఇస్తూనే రూ.7వేల కోట్లకే పరిమితం చేశారు.

మేఘా కృష్ణారెడ్డితో దోస్తానం చేశారు. ఈ కార్ రేసింగ్‌లో క్విడ్ ప్రో కో జరిగిందని గ్రీన్ కో అనిల్ కుమార్‌తో ఆర్థిక లావాదేవీలు కొనసాగించారు. దీంతో ఆయన పేరు ఎఫ్‌ఐఆర్‌లో లేకుండా చేశారు. ఫోన్ ట్యాపింగ్‌తో అయ్యేది కాదు పోయేది కాదని అరెస్టులు లేకుండా ఇప్పటికీ అదనపు ఛార్జిషీట్ దాఖలు చేయనివ్వలేదు. అసెంబ్లీలో కౌషిక్ రెడ్డిని అసలే రానివ్వకుండా ఎథిక్స్ కమిటీకి పంపించి వేచి చూశారు. అసైన్డ్ భూములపై, ఆ ప్రభుత్వంలో జరిగిన భూ దోపిడీపై ఎక్కడ తగ్గాలో తగ్గి అక్కడ నుంచి ఆదాయ మార్గాలను సులువు చేసుకున్నారు. బీఆర్ఎస్ తమ కంపెనీలు అనుకుని మేలు చేసిన వాళ్లందరూ ఆయన చంకలోనే ఉండడంతో ఆర్థికంగా మరింత బలపడుతున్నారు.

కేసీఆర్‌లా తెగేదాక లాగడం లేదు?

గతంలో ఆర్టీసీ ఉద్యోగులు ధర్నా చేస్తే యూనియన్స్‌నే లేకుండా చేశారు? ధర్నా చౌక్ వద్ద మాట్లాడితే ఇందిరా పార్క్ వద్ద ధర్నాలే వద్దని కట్టడి చేశారు. సచివాలయం కూల్చొద్దని ఆందోళన చేసినా, ఎక్కువ ఖర్చులు పెట్టి అనుకున్న సమయంలో నిర్మించడం, ధరణిలో తప్పులు జరిగాయని ఆందోళనలు చేస్తే, వీఆర్వో వ్యవస్థనే తీసివేసి చేతులు దులుపుకున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంలో మేడిగడ్డ లొకేషన్‌పై అప్పటికే అనేక ఆరోపణలు ఉన్నాయి. తుమ్మడిహట్టి కాదని అన్నారం, సుందిళ్లగా మార్చి కరెంట్ బిల్లులు మోగించారు. ఎవరైనా తప్పులను ఎత్తిచూపితే అరెస్టులు చేసి చిత్రహింసలు పెట్టేందుకు అనుచరులు, పోలీసులను వాడుకున్నారు. ఇలాంటి తప్పులు ఇప్పుడు చేయరాదని రేవంత్ రెడ్డి తగ్గుతున్నారు.

తిట్టేవాడే మళ్లీ పొగుడుతాడని ధీమా

రేవంత్ రెడ్డి తనను తిట్టాలని అనుకునే రకం. తిడితేనే అన్నీ తెలుస్తాయనే భావన. అందుకే ఎంతమంది యూట్యూబ్‌లో తిట్టి పోసినా తొందరపడటం లేదు. అనుచరులు ఆగమాగం చేస్తామని ఉరుకులు పెట్టినా వద్దని వదిలేస్తున్నారు. దీంతో పాలకు పాలు, నీళ్లకు నీళ్లు అన్నట్లు అవకాశం వచ్చినప్పుడు కేసీఆర్‌ని కాదని తన వద్దకే వస్తారని ధీమాతో తిట్లే ఆశీర్వాదం అన్నట్లుగా సర్ధి చెప్పుకుంటున్నా వెనక్కి తగ్గుతున్న నైజంతో లాభమే జరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల ఫాంహౌజ్‌ల విషయంలో అప్పటి వరకు వ్యతిరేకంగా పని చేసిన యూట్యూబర్స్ వెంటనే కేసీఆర్ పైకి మళ్లీ దృష్టి మల్లించిన వారు ఉన్నారంటే దెబ్బను నీళ్ల పైనే వేయాలి. రాళ్లపై వేస్తే మనకే తగులుతాయనే ఉద్దేశం రేవంత్ రెడ్డిదిగా కనిపిస్తోంది.

#RevanthReddy#TelanganaGovt#PublicProtests#SwechaNews#RevanthVsKCR#TelanganaPolitics#GO22A#HydraTelangana
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి