ప్రధాని నరేంద్ర మోడీ దేశ ప్రజలను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. పండిట్ ‘దీన్‌దయాళ్’ జయంతి సందర్భంగా ఢిల్లీలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ప్రధాని పాల్గొని ఆయన చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మాట్లాడుతూ.. దేశానికి స్వదేశీ భావజాలంతో కూడిన దృక్పథాన్ని అందించిన మహనీయుడు పండిట్ దీన్‌దయాళ్ ఉపాధ్యాయ అని పేర్కొన్నారు.
దీన్‌దయాళ్ 'చరైవేతి, చరైవేతి' (నిరంతరం ముందుకు సాగండి) అనే అభివృద్ధి మంత్రాన్ని బోధించడమే కాకుండా, తన జీవితాంతం ఆచరించి చూపించారని కొనియాడారు. ఆయన నిరంతర సాధకుడని ప్రశంసించారు. భారతదేశాన్ని పాశ్చాత్య లేదా విదేశీ దృక్పథంతో కాకుండా, స్వదేశీ మూలాలతో అర్థం చేసుకుని భారత రాజకీయాల్లో కొత్త ఒరవడిని సృష్టించారని.. అందుకే ఆయన అరుదైన నాయకుడు అని గుర్తుచేశారు. సేవా భావనను నిరంతర జీవన విధానంగా మార్చుకుని ప్రజాసేవలో ముందుకు సాగేందుకు తమకు దీన్‌దయాళ్ ఆలోచనలే నిరంతర స్ఫూర్తి అని మోడీ స్పష్టం చేశారు.
దీన్ దయాల్ ఉపాధ్యయ ప్రతిపాదించిన ‘ఏకాత్మ మానవతావాదం’ (ఇంటిగ్రల్ హ్యూమనిజం) బీజేపీ శ్రేణులకు, తమ ప్రభుత్వాలకు ఓ మార్గదర్శకమని ప్రధాని వెల్లడించారు. దీనిని సరళంగా నిర్వచిస్తూ.. ‘వ్యక్తి అభివృద్ధి చెందాలి కానీ సమాజానికి, దేశానికి దూరంగా ఒంటరిగా కాదు. సమాజం పురోగమించాలి, కానీ ప్రకృతిని నాశనం చేస్తూ కాదు. దేశం సమగ్రంగా అభివృద్ధి చెందాలి, ఆ ఫలాలు సొసైటీలోని చివరి వ్యక్తి (అంత్యోదయ) వరకు తప్పనిసరిగా చేరాలి’ అనే గొప్ప సిద్ధాంతాన్ని సూచించిన వ్యక్తి పండింట్ దీన్‌దయాళ్ అని ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ఈ అంత్యోదయ, ఏకాత్మ మానవతావాద స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పేదల అభ్యున్నతి, సంక్షేమం, పర్యావరణ సమతుల్యతే లక్ష్యంగా నిర్ణయాలు తీసుకుంటున్నదని, తద్వారా వికసిత్ భారత్ నిర్మాణంలో ముందుకు సాగుతోందని ప్రధాని స్పష్టంచేశారు. కాగా, దీన్‌దయాల్ పేరుమీదే కేంద్రప్రభుత్వం పేదలకు అంత్యోదయ కార్డులు అందించిన విషయం తెలిసిందే.












