రాష్ట్రవ్యాప్తంగా గణనాథుల నిమజ్జనాలు, శోభాయాత్రాలు ఘనంగా కొనసాగుతున్నాయి.యువతీయువకులు, పెద్దలు శోభాయాత్రలో స్టెప్పులు వేస్తూ ‘వెళ్లిరావయ్యా..గణేశా’ అంటూ గంగమ్మ ఒడికి సాగనంపుతున్నారు.ఎక్కడ చూసినా డీజే సౌండ్స్, డప్పుచప్పుళ్ల నడమ గణనాథులు గంగమ్మ ఒడికి చేరేందుకు వెళ్తున్నారు. చెరువులు, కుంటల్లో నిమజ్జనాలకు అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.తెలంగాణ వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా నిమజ్జనాలకు పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.
అయితే, రాష్ట్రంలోని ప్రధాన పట్టణాల్లో శోభాయాత్రల కారణంగా భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడుతోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే అంబులెన్స్ గణనాథుడి శోభాయాత్రలో చిక్కుకోవడంతో సకాలంలో వైద్యం అందక రెండేండ్ల బాలుడు మృతి చెందాడు. ఈ ఘటన ఖమ్మం జిల్లా బోనకల్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకివెళితే.. ఖమ్మం జిల్లా బోనకల్ ఎస్టీ కాలనీలో వైభవ్ నాయక్ అనే రెండేండ్ల బాలుడు నాలుగు రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. దీంతో బాలుడిని తల్లిదండ్రులు భూక్యా సైదులు, విజయలక్ష్మి ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి ఆసుపత్రిలో చేర్పించారు.అక్కడ వైద్యులు చేతులు ఎత్తేయడంతో ఖమ్మంలోని పాత బస్టాండ్ సమీపంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు.
అక్కడ వైద్యులు లేకపోవడంతో మరో ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు తల్లిదండ్రులు అంబులెన్సులో బయలుదేరారు.ఈ క్రమంలోనే గణేష్ శోభాయాత్రలో అంబులెన్స్ చిక్కుకున్నది.కొడుకును ఎలాగైనా కాపాడుకోవాలని తండ్రి తన భుజాలపై కొడుకును ఆసుపత్రికి మోసుకెళ్లాడు. ఆసుపత్రిలో బాలుడికి పరీక్షలు నిర్వహించిన వైద్యులు అప్పటికే మరణించినట్టు నిర్ధారించారు.
ఈ విషయం చెప్పడంతో బాలుడి తల్లిదండ్రులు తీవ్రవిషాదంలో మునిగిపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. సమయానికి ఆసుపత్రికి తీసుకెళ్తే తమ బిడ్డ బతికేవాడని తల్లిదండ్రులు వాపోయారు. కాగా, గణేశ్ శోభాయాత్రల కారణంగా ట్రాఫిక్ జామ్ ఉన్నందున ప్రత్యామ్నాయ రవాణా మార్గాలను ఎంచుకోవాలని పోలీసులు కోరుతున్నారు. అయినప్పటికీ అంబులెన్సుకు దారి ఇవ్వకపోవడం ఏంటని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.












