వ్యాపారం

ఆన్‌లైన్ డిస్కౌంట్ల మాయాజాలానికి చెక్.. ఈ-కామర్స్ సైట్లకు కొత్త రూల్స్!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) సవరణ నిబంధనలు- 2026’ ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి.

దేశంలో నానాటికీ పెరుగుతున్న ఆన్‌లైన్ షాపింగ్ మోసాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ‘వినియోగదారుల రక్షణ (ఈ-కామర్స్) సవరణ నిబంధనలు- 2026’ ను విడుదల చేసింది. ఈ కొత్త నిబంధనలు 2027 జనవరి 1వ తేదీ నుంచి దేశవ్యాప్తంగా అమలులోకి రానున్నాయి. పండుగల వేళ భారీ డిస్కౌంట్లు, బంపర్ ఆఫర్ల పేరిట నకిలీ తగ్గింపులతో కస్టమర్లను బురిడీ కొట్టించే ఈ-కామర్స్ సంస్థల మాయాజాలానికి చెక్ పెట్టడమే కాకుండా, డిజిటల్ మార్కెట్‌ను మరింత పారదర్శకంగా మార్చడమే ఈ కొత్త విధానం యొక్క ముఖ్య ఉద్దేశం.

 నూతన నిబంధనల ప్రకారం ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్‌లు ఇకపై విక్రయాలకు ముందు కృత్రిమంగా ధరలను పెంచి, ఆ తర్వాత భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నట్లు నటించడానికి వీలుండదు. ఏదైనా వస్తువుపై తగ్గింపు ధరను ప్రకటించే ముందు, సదరు ఉత్పత్తికి సంబంధించి గడిచిన 30రోజుల అసలు ధరల వివరాలను వినియోగదారులకు స్పష్టంగా కనిపించేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. దీనివల్ల అసలైన డిస్కౌంట్ ఎంతో కస్టమర్లు సులభంగా గ్రహించగలుగుతారు.

 అంతేకాకుండా 'డార్క్ ప్యాటర్న్స్' (మోసపూరిత డిజిటల్ ట్రిక్స్) నివారణకు వార్షిక ఆడిట్లు నిర్వహించడంతో పాటు, వినియోగదారుల అనుమతి లేకుండా వారి వ్యక్తిగత డేటాను ఇతర అవసరాలకు వాడటంపై కఠిన నిషేధం విధించారు. గత 2025 గణాంకాల ప్రకారం జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కు వచ్చిన 17.71లక్షల ఫిర్యాదులలో, దాదాపు 29 శాతం (5.11 లక్షలు) ఫిర్యాదులు ఒక్క ఈ-కామర్స్ రంగానికి చెందినవే కావడం గమనార్హం. ఈ సమస్యల వేగవంతమైన పరిష్కారం కోసం అన్ని ఆన్‌లైన్ షాపింగ్ సైట్లను NCH వ్యవస్థతో అనుసంధానించడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేసింది.

 అదేవిధంగా అత్యవసరం లేని సేవలకు అదనంగా వసూలు చేసే ‘బండిల్ ఫీజుల’పై నిషేధం విధించడంతో పాటు, ఉత్పత్తుల గడువు తేదీలు (Expiry Dates), వారంటీ, రిఫండ్ విధానాలు, దిగుమతి చేసుకున్న వస్తువుల మూల దేశం (Country of Origin) వివరాలను స్పష్టంగా నమోదు చేయాలని ఆదేశించింది. ఈ నూతన సంస్కరణలు ఆన్‌లైన్ షాపింగ్ చేసే కోట్లాది మంది వినియోగదారుల హక్కులను కాపాడటంతో పాటు డిజిటల్ కొనుగోళ్లపై నమ్మకాన్ని మరింత పెంచుతాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇ-కామర్స్ సంస్థల నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ విపణిలో విప్లవాత్మక మార్పులకు బాటలు వేయనుంది.

 

#OnlineShoppingRules#ECommerceRules2027#ConsumerProtection#FakeDiscounts#NCHComplaints#DigitalShopping#IndiaBusinessNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి