క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తనయుడు, యువ క్రికెటర్ అర్జున్ టెండూల్కర్ సెప్టెంబర్ 25న తన 27వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ ప్రత్యేక సందర్భాన్ని పురస్కరించుకుని ఆయన సోదరి సారా టెండూల్కర్ సోషల్ మీడియా వేదికగా తన తమ్ముడికి అత్యంత భావోద్వేగభరితమైన శుభాకాంక్షలు తెలియజేశారు. ఐపీఎల్ ఫ్రాంచైజీ లక్నో సూపర్ జెయింట్స్‌తో కలిసి ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఒక ప్రత్యేక వీడియో మాంటేజ్ ప్రస్తుతం నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది. చిన్ననాటి తీపి జ్ఞాపకాల నుంచి నేటి వరకు వారిద్దరి మధ్య ఉన్న అనుబంధాన్ని ప్రతిబింబించే చిత్రాలతో రూపొందించిన ఈ వీడియోకు సారా స్వయంగా తన వాయిస్ ఓవర్ ఇచ్చారు.
ఈ పోస్ట్‌లో సారా మాట్లాడుతూ.. ‘నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నన్ను విసిగిస్తున్న ఏకైక వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు. కానీ చిత్రంగా, నా జీవితంలో నాకు అత్యంత ఇష్టమైన వ్యక్తి కూడా నువ్వే! నీకు ఎంత వయసొచ్చినా, నువ్వెప్పుడూ నా బేబీ బ్రదర్‌వే. నిన్ను ఎప్పటికీ నేను కాపాడుకుంటూనే ఉంటాను" అని పేర్కొన్నారు. అంతేకాకుండా, అర్జున్ కనబరుస్తున్న కఠోర శ్రమ, క్రమశిక్షణ, అతని సద్గుణాలు చూస్తుంటే తనకు ఎంతో గర్వంగా ఉందని, అతడు ఎదిగిన తీరును చూడటం తనకు దక్కిన గొప్ప అదృష్టమని సారా తన ఆనందాన్ని పంచుకున్నారు.
అటు క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కూడా తన కుమారుడికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కుటుంబ సమేతంగా ఉన్న ఒక ఫొటోను పంచుకున్నారు. 'అర్జున్.. నువ్వివాళ ఒక బాధ్యతాయుతమైన వ్యక్తిగా ఎదిగిన తీరును చూడటం నా జీవితంలోనే అత్యంత గొప్ప ఆనందాల్లో ఒకటి' అంటూ సచిన్ భావోద్వేగానికి లోనయ్యారు. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుండగా, టెండూల్కర్ కుటుంబ సభ్యుల అనుబంధాన్ని చూసి అభిమానులు, క్రీడా ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తూ అర్జున్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ప్రస్తుతం అర్జున్ టెండూల్కర్ ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తుండగా, దేశవాళీ క్రికెట్‌లో గోవా జట్టు తరఫున ఆడుతున్నారు. ఆల్‌రౌండర్‌గా తన ఆటతీరును మరింత మెరుగుపరుచుకుంటూ కెరీర్‌లో ముందుకు సాగుతున్న అర్జున్‌కు ఈ పుట్టినరోజు సందర్భంగా క్రీడాలోకం నుంచి పెద్ద ఎత్తున శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.












