భాగ్యనగరంలో ఎంతో ప్రసిద్ధి చెందిన బాలాపూర్ గణేష్ లడ్డూ వేలం ఈసారి సరికొత్త రికార్డులను సృష్టించింది. తీవ్ర ఉత్కంఠ మధ్య సాగిన ఈ వేలంలో 'అర్బన్ రియాలిటీ గ్రూప్'కు చెందిన 35 ఏళ్ల వ్యాపారవేత్త సామా ప్రణీత్ రెడ్డి అత్యధికంగా రూ.39లక్షలు పలికి స్వామివారి ప్రసాదాన్ని దక్కించుకున్నారు. 1994లో కేవలం రూ.450తో ప్రారంభమైన ఈ వేలం ప్రస్థానం ఏటేటా పెరుగుతూ నేడు రూ.39లక్షలకు చేరుకోవడం విశేషం.
పాత రికార్డులన్నింటినీ తుడిచిపెట్టేస్తూ ఈ ఏడాది అత్యంత భారీ ధరకు లడ్డూ వేలం సాగడంతో బాలాపూర్ ప్రాంగణమంతా భక్తుల జయజయధ్వానాలతో ప్రతిధ్వనించింది. హైదరాబాద్‌లోని వనస్థలిపురానికి చెందిన ప్రణీత్‌రెడ్డి, ఇటీవల అమెరికా నుంచి తిరిగి వచ్చి 'అర్బన్ గ్రూప్స్' పేరుతో తన వ్యాపారాన్ని ప్రారంభించారు. చిన్న వయసులోనే ఆయన ఈ ప్రతిష్టాత్మక వార్షిక వేలం ద్వారా అందరూ ఆశించే బాలాపూర్ గణేష్ లడ్డూ ప్రసాదాన్ని సొంతం చేసుకున్నారు.

గతేడాది జరిగిన వేలంలో కర్మాన్‌ఘాట్‌కు చెందిన లింగాల దాశరథ్ గౌడ్ రూ.35లక్షలకు లడ్డూను దక్కించుకోగా, ఈసారి ఆ రికార్డు సైతం బద్దలైంది. బాలాపూర్ లడ్డూను సొంతం చేసుకోవడం వల్ల తమ కుటుంబానికి, వ్యాపారానికి ఎంతో శుభం జరుగుతుందని, స్వామివారి ఆశీస్సులు లభిస్తాయని విజేత సామా ప్రణీత్ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు.
ఏటా లడ్డూ వేలం ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామ అభివృద్ధి పనులకు, సామాజిక కార్యక్రమాలకు వినియోగిస్తున్నట్లు ఉత్సవ సమితి వెల్లడించింది. లడ్డూ వేలం ముగిసిన అనంతరం బాలాపూర్ గణనాథుడి శోభాయాత్ర ఉత్సాహంగా ప్రారంభమైంది. గ్రామంలోని ప్రధాన వీధుల గుండా బొడ్రాయి ప్రదక్షిణ పూర్తి చేసుకుని, బహుళ భద్రత నడుమ స్వామివారి విగ్రహం ట్యాంక్‌బండ్ వైపు పయనమైంది. వేలాన్ని వీక్షించేందుకు పరిసర ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలిరావడంతో పోలీసులు పటిష్టమైన బందోబస్తును నిర్వహించారు.












