సాహితి ఇన్‌ఫ్రా మనీలాండరింగ్ కేసులో శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరెకపూడి గాంధీకి బిగ్ షాక్ తగిలింది. తాజాగా ఆయనకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సమన్లు పంపింది.సెప్టెంబర్ 27న విచారణకు హాజరు కావాలంటూ గురువారం పంపిన నోటీసుల్లో ఈడీ పేర్కొంది. ప్రీ లాంచ్ పేరుతో కస్టమర్లను మోసం చేసిన సాహితి ఇన్‌ఫ్రాటెక్ వెంచర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్‌పై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగా ఈడీ మనీలాండరింగ్ కేసు ఫైల్ చేసిన విషయం తెలిసిందే.
ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ బ్యాంక్ ఖాతాల ద్వారా సాహితి ఇన్‌ఫ్రా నుంచి రూ.2.1 కోట్లు మళ్లించినట్టు ఆరోపణల రావడంతో దీనిపై ఈడీ విచారణ చేస్తున్నది. లావాదేవీల స్వభావం, ఉద్దేశంపై దర్యాప్తు చేపట్టింది.నిధుల వినియోగానికి సరైన వ్యాపార కారణాలు ఉన్నాయా? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తునట్టు తెలిసింది. మనీలాండరింగ్ నెట్‌వర్క్‌తో సంబంధం ఉన్న ఆస్తులపైనా ఈడీ దృష్టి సారించింది.
ఫ్లాట్లు, విల్లాలు నిర్మిస్తామని డబ్బులు వసూలు చేసిన సాహితి ఇన్ ఫ్రా కస్టమర్లను మోసం చేసిందనే ఆరోపణలు ఉన్నాయి.ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదంటూ కొనుగోలుదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ల ఆధారంగానే తాజాగా ఈడీ దర్యాప్తు జరుపుతోంది.సాహితి ఇన్‌ఫ్రా ప్రాజెక్టుల్లో తొలుత రూ.248 కోట్ల మోసం జరిగినట్లు ఆరోపణలు రాగా.. తదుపరి దర్యాప్తులో మోసం విలువ సుమారు రూ.842 కోట్లుగా ఈడీ అంచనా వేసింది.
ప్రీ-లాంచ్ ఆఫర్ల పేరుతో కొనుగోలుదారుల నుంచి భారీగా నిధుల సేకరించి వాటిని సొంత, కుటుంబ సభ్యుల ఖాతాలకు మళ్లించినట్లు ఆరోపణలున్నాయి. సంస్థ ఎండీ బి.లక్ష్మీనారాయణ, మాజీ డైరెక్టర్ సందు పూర్ణచంద్రరావుపైనా అభియోగాలుఉన్నాయి. 2018-2020 మధ్య రూ.50 కోట్లు నగదు రూపంలో తీసుకున్నారని ఈడీ పేర్కొన్నట్టు సమాచారం.

దాదాపు రూ.126 కోట్ల నిధుల దుర్వినియోగం జరిగినట్లు ఈడీ ఆరోపిస్తున్నది. ఆ సొమ్ముతో బినామీ పేర్లతో ఆస్తులు కొనుగోలు చేసినట్లు దర్యాప్తులో అధికారులు గుర్తించారు.ఇప్పటివరకు సాహితి ఇన్ ఫ్రాకు చెందిన 56 బ్యాంక్ ఖాతాలను ఈడీ ఫ్రీజ్ చేసింది.గతంలో రూ.161 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసింది. మరో విడతలో రూ.12.6 కోట్ల విలువైన ఆస్తులు అటాచ్ చేసిన విషయం తెలిసిందే.. అయితే, సంస్థ ప్రకటనల్లో కనిపించిన నటుడు జగపతిబాబును సైతం ఈడీ సాక్షిగా విచారించింది. హైదరాబాద్‌లోని ఎంఎస్జే కోర్టులో ప్రాసిక్యూషన్ ఫిర్యాదులు దాఖలు చేయగా.. సంస్థ ఎండీ లక్ష్మీనారాయణను 2024 సెప్టెంబర్‌లో ఈడీ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.












