రాష్ట్రవ్యాప్తంగా గణపతి నిమజ్జన ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి.అయితే, కొన్ని చోట్ల చెదురుమొదురు ఘటనలు మినహా ప్రశాంతంగా గణనాథులు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నారు. లా అండ్ ఆర్డర్ సమస్య రాకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు చర్యలు చేపట్టారు. నెంబర్ల వారీగా జిల్లాల్లో గణపయ్యలు నిమజ్జనం కోసం బారులు తీరాయి. అయితే, యువత నిమజ్జన వేడుకల్లో ఆటపాటలతో సందడి చేస్తున్నారు.
ఊరూరా డీజే సౌండ్స్, బ్యాండ్స్ సప్పుళ్లు మోత మోగుతున్నాయి.ఈ క్రమంలోనే డీజే సౌండ్స్ ధాటికి మరో యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. డ్యాన్స్ చేస్తున్న క్రమంలోనే గుండెపోటు వచ్చినట్టు సమాచారం. తోటి వారు అతనికి కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. ఈ ఘటన జగిత్యాల పట్టణంలో చోటుచేసుకోగా ఆలస్యంగా వెలుగుచూసింది.
వివరాల్లోకివెళితే.. జగిత్యాల పట్టణంలోని తులసి నగర్‌లో గణనాథుడి నిమజ్జనం సందర్భంగా ప్యాడ్ బ్యాండ్ సౌండ్స్‌కు డ్యాన్స్ చేస్తూ గుండెపోటుతో తోపారపు జయంత్ (24)మృతిచెందాడు. ఇంటి ముందు మిత్రులతో కలిసి డ్యాన్స్ చేస్తుండగా ఒక్కసారిగా జయంత్ కుప్పకూలిపోయాడు.అక్కడే ఉన్న స్నేహితులు, పోలీస్ సిబ్బంది వెంటనే స్పందించారు.ఘటనా స్థలంలోనే యువకుడికి సీపీఆర్ చేశారు. 108 అంబులెన్స్ స్పందించకపోవడంతో పోలీస్ వాహనంలో ఆసుపత్రికి తరలించారు.
యువకుడిని పరిశీలించిన వైద్యులు మృతి చెందినట్లు నిర్దారించారు. డీజే సౌండ్స్ ధాటికి గుండెపోటు వచ్చినట్టు పేర్కొన్నారు. కాగా, వినాయక చవితి ప్రారంభం నుంచి డీజే సౌండ్స్‌కు ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది.వారిలో ఎక్కువగా 25 నుంచి 40లోపు వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. మిడిల్ ఏజ్ వ్యక్తులు అత్యధికంగా గుండెపోటుకు గురవుతున్నారని నిపుణులు సైతం ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరణాలకు కారణం అవుతున్న డీజేలను నిషేధించాలని, అనుమతులు ఇవ్వకూడదని డిమాండ్లు వినిపిస్తున్నాయి.












