BRS: తెలంగాణ రాజకీయాల్లో పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై తాము సాగించిన న్యాయపోరాటం చారిత్రాత్మక విజయాన్ని అందుకుందని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి. కారు గుర్తుపై గెలిచి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు పడటంతో పాటు, ఆయన సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ కూడా వీగిపోయింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టు గడప వరకు గులాబీ దళం అలుపెరగకుండా సాగించిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని ఆ పార్టీ వర్గాలు సంబరాలు చేసుకుంటున్నాయి.
ఫిరాయింపుల నిరోధక చట్టం కింద వేటు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థిగా విజయం సాధించిన దానం నాగేందర్, 2024 మార్చిలో అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు. అంతేకాకుండా సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేశారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందకే వస్తుందని పేర్కొంటూ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఆయనపై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.
దానం నాగేందర్ కేసు టైమ్‌లైన్..
దానం నాగేందర్ అధికారికంగా మార్చి 15, 2024న కాంగ్రెస్ పార్టీలో చేరారు. రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడిన దానంపై అనర్హత వేటు వేయాలని కోరుతూ మార్చి 18, 2024న బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్‌కు పిటిషన్ సమర్పించారు. ఈ పరిణామాల మధ్యలోనే సికింద్రాబాద్ లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా మార్చి 21, 2024న దానం నాగేందర్ పేరును హస్తం పార్టీ అగ్రనాయకులు ప్రకటించారు. ఇదే సమయంలో బీఆర్‌ఎస్ పార్టీ వాళ్లు స్పీకర్ ఎదుట సమగ్ర పిటిషన్‌ను మార్చి 30, 2024న దాఖలు చేశారు. అనంతరం ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి దానంపై స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదంటూ ఏప్రిల్ 10, 2024న హైకోర్టును ఆశ్రయించారు.
దానంపై స్పీకర్ చర్యలు తీసుకోకపోవడాన్ని సవాలు చేస్తూ మరోసారి జూలై 9, 2024న హైకోర్టుకు బీఆర్‌ఎస్ వెళ్లింది. అనర్హత పిటిషన్లను స్వీకరించి, తీసుకున్న చర్యలను 4 వారాల్లో హైకోర్టు రిజిస్ట్రార్‌కు తెలపాలని స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సెప్టెంబర్ 9, 2024న ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను డివిజన్ బెంచ్ ఎదుట దానం నాగేందర్ సెప్టెంబర్ 30, 2024న సవాల్ చేశారు. సింగిల్ జడ్జి బెంచ్ ఆదేశాలను డివిజన్ బెంచ్ రద్దు చేయడంతో నవంబర్ 22, 2024న బీఆర్‌ఎస్ నేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్‌ను జనవరి 2025న బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసింది. హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేసి, అనర్హత పిటిషన్ల విచారణను 3 నెలల్లోగా పూర్తి చేయాలని స్పీకర్‌ను జూలై 31, 2025న సుప్రీంకోర్టు ఆదేశించింది.
నిర్దేశిత గడువులోగా చర్యలు తీసుకోనందుకు బీఆర్‌ఎస్ అక్టోబర్ 31, 2025న స్పీకర్‌పై కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. ఇదే సమయంలో దానం నాగేందర్‌కు స్పీకర్ మరోసారి వివరణ కోరుతూ నవంబర్ 20, 2025 న నోటీసులు జారీ చేశారు. ట్రిబ్యునల్ ఛైర్మన్ హోదాలో జనవరి 30, 2026న దానంపై దాఖలైన పిటిషన్లను స్పీకర్ విచారించారు. ఈ విచారణకు స్వయంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి హాజరై వాదనలు వినిపించారు. దానం నాగేందర్ సభ్యత్వంపై స్పష్టమైన ఆధారాలు లేవంటూ మార్చి 11, 2026న అనర్హత పిటిషన్‌ను స్పీకర్ కొట్టివేశారు. స్పీకర్ ఇచ్చిన వివాదాస్పద నిర్ణయాన్ని సవాలు చేస్తూ మార్చి 23, 2026న హైకోర్టులో బీఆర్‌ఎస్ తరఫున రిట్ పిటిషన్ల దాఖలు చేశారు. స్పీకర్ నిర్ణయాన్ని రద్దు చేస్తూ, దానం నాగేందర్‌ను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటిస్తూ హైకోర్టు సెప్టెంబర్ 18, 2026న సంచలన తీర్పును వెలువరిస్తూ.. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించింది. హైకోర్టు ఉత్తర్వులను సవాలు చేస్తూ దానం నాగేందర్ వేసిన పిటిషన్‌ను సెప్టెంబర్ 24, 2026న ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టివేసింది.
సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. 'మళ్లీ ఎన్నికలకు వెళ్లండి'
హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకునేందుకు ఎలాంటి కారణాలు లేవని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు.. ఒక పార్టీ నుంచి ఎమ్మెల్యేగా ఉంటూ మరో పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేయడమంటే ప్రాథమిక సభ్యత్వాన్ని వదులుకోవడమేనని తేల్చి చెప్పింది. "అనర్హత వేటు పడింది కాబట్టి ప్రజాక్షేత్రంలో తేల్చుకోవడానికి మళ్లీ ఎన్నికలకు వెళ్లాల్సిందే" అని స్పష్టం చేసింది. దీంతో ఖైరతాబాద్ ఉప ఎన్నిక ఖరారైనట్లయింది. రాజ్యాంగ నైతికతను కాపాడేందుకు తమ పార్టీ మొదటినుంచీ పట్టువీడకుండా చేసిన ఈ పోరాటం మొత్తంగా న్యాయపరంగా విజయవంతంగా ముగిసిందని గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.










