KTR: ఖైరతాబాద్ ఎమ్మెల్యేగా దానం నాగేందర్ పై అనర్హత వేటు వేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించడాన్ని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్వాగతించారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. దీనిపై ఎక్స్ వేదికగా స్పందించారు కేటీఆర్. సుప్రీంకోర్టు తీర్పు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెంపపెట్టుగా అభివర్ణించారు. పార్టీ ఫిరాయింపుల ద్వారా ప్రజలు ఇచ్చిన తీర్పును దొంగిలించి, స్పీకర్ వ్యవస్థను అడ్డం పెట్టుకుని ఫిరాయింపుదారులను కాపాడాలనుకున్నారని కేటీఆర్ మండిపడ్డారు.
సుప్రీంకోర్టు తీర్పుతో ఫిరాయింపుల రాజకీయాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలిందన్నారు. మూడేళ్ల కాంగ్రెస్ పాలనలో విఫలమైన హామీలకు, పాలనా వైఫల్యాలకు, చేసిన నమ్మకద్రోహానికి ఖైరతాబాద్ ప్రజలు ఉప ఎన్నికల రూపంలో తగిన తీర్పు చెబుతారని కేటీఆర్ అన్నారు. దానం నాగేందర్ పై అనర్హతతో ఒక వికెట్ పడిందన్న కేటీఆర్.. త్వరలో మరిన్ని వికెట్లు పడతాయని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి దానం నాగేందర్ గెలిచారు. 2024లో అధికార కాంగ్రెస్‌లో చేరారు. అదే ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో సికింద్రాబాద్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. దీనిపై బీఆర్‌ఎస్, బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించారు. ఒక పార్టీ గుర్తుపై ఎమ్మెల్యేగా గెలిచి మరో పార్టీ తరఫున పోటీ చేయడం రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఉల్లంఘన కిందకే వస్తుందని.. దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ దాఖలు చేశారు.
ఈ వ్యవహారంపై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు సెప్టెంబర్ 18న సంచలన తీర్పు ఇచ్చింది. దానం నాగేందర్ ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించింది. లోక్ సభ ఎంపీగా పోటీ చేసిన రోజు నుంచే అనర్హత అమల్లోకి వస్తుందని.. ఖైరతాబాద్ నియోజకవర్గం ఖాళీ అయినట్లు పేర్కొంది. ఆ తీర్పును దానం సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు ఉత్తర్వులపై స్టే ఇవ్వాలని కోరగా.. సుప్రీంకోర్టు అందుకు నో చెప్పింది.
హైకోర్టు తీర్పును సమర్థించింది. దీంతో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యంగా మారింది. కాగా, పార్టీ ఫిరాయింపుల వ్యవహారంపై అసెంబ్లీ స్పీకర్ కార్యాలయం నుంచి సుప్రీంకోర్టు గడప వరకు అలుపెరగకుండా తాము సాగించిన సుదీర్ఘ న్యాయపోరాటం ఫలితంగానే ఈ తీర్పు వెలువడిందని గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి.









