తెలంగాణ

అబద్దాలు ప్రచారం చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు.. క్షుద్రపూజల ఆరోపణలపై కోర్టుకెక్కిన హరీశ్ రావు

రచన: NK9 నిమిషాల పఠనం

Harish Rao: తనపై వచ్చిన క్షుద్రపూజల ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హరీశ్ రావు కోర్టుకెక్కారు. తాను క్షుద్రపూజలు చేశానంటూ ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌ పై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశానని, కేసు కూడా ఫైల్ చేశానని హరీశ్ తెలిపారు. పరువు నష్టం దావా కేసు ఆధారాలతో సహా ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు.

* క్షుద్రపూజలు అంటూ తప్పుడు ప్రచారం చేస్తే కోర్టుకీడుస్తా

* దానం విషయంలో సుప్రీంకోర్టు తీర్పు రేవంత్ కు చెంపపెట్టు

* రాహుల్ గాంధీ మిగతా ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించు

* రాజ్యాంగంపై మీకున్న గౌరవం నిజమే అని నిరూపించు

* నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు వద్ద హరీశ్ రావు కామెంట్స్

Harish Rao: తనపై వచ్చిన క్షుద్రపూజల ఆరోపణలపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీశ్ రావు హరీశ్ రావు కోర్టుకెక్కారు. తాను క్షుద్రపూజలు చేశానంటూ ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్‌ పై నాంపల్లి కోర్టులో పరువు నష్టం దావా దాఖలు చేశానని, కేసు కూడా ఫైల్ చేశానని హరీశ్ తెలిపారు. పరువు నష్టం దావా కేసు ఆధారాలతో సహా ఫైల్ చేసినట్లు పేర్కొన్నారు. నాంపల్లి ప్రజా ప్రతినిధుల కోర్టు తన పిటిషన్ ను స్వీకరించిందని, వచ్చే బుధవారం తన స్టేట్ మెంట్ ను రికార్డ్ చేయనున్నట్లు హరీశ్ రావు వెల్లడించారు. తాను క్షుద్రపూజలు చేసినట్లు మహేష్ కుమార్ గౌడ్, అద్దంకి దయాకర్ అసత్య ప్రచారం చేస్తున్నారని హరీశ్ రావు ఆరోపించారు. వారిపై లీగల్ గా ముందుకెళ్తున్నామన్నారు.

ఇంతకన్నా దిగజారుడు రాజకీయాలుండవు

దేవుళ్ల దగ్గరకు వెళ్తే కూడా క్షుద్రపూజలు అంటూ పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు ఫైర్ అయ్యారు. ఇంతకంటే దిగజారుడు వ్యాఖ్యలు, రాజకీయాలు ఉండవని హరీశ్ రావు ధ్వజమెత్తారు. తమపై చిల్లర ఆరోపణలు చేస్తే, వాళ్లలా మేము స్థాయి దిగజారి మాట్లాడమన్నారు. వాళ్లు బురదలో ఉన్నారు, మాకు బురద అంటించే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. ప్రజల సమస్యల గురించి మాట్లాడితే కేసులు పెడుతున్నారని రేవంత్ సర్కార్ పై మండిపడ్డారు హరీశ్ రావు.

మూడేళ్లైనా డిప్యూటీ స్పీకర్ అపాయింట్‌మెంట్ లేదు

మ్యానిఫెస్టోలో చెప్పిన హామీలు ఏమయ్యాయని అడిగితే లేనిపోని నిందలు వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డైవర్షన్ పాలిటిక్స్ కు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు శాసనసభలో కూడా అనేక అబద్దాలు మాట్లాడారని చెప్పారు. మూడేళ్లైనా డిప్యూటీ స్పీకర్ ను కూడా అపాయింట్ చేయలేదన్నారు. ప్రివిలేజస్ కమిటీ చైర్మన్ గా డిప్యూటీ స్పీకర్ ఉంటారు, ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించి చర్యలు తీసుకుంటారని హరీశ్ రావు తెలిపారు. కానీ మూడేళ్లు అయినా అపాయింట్ మెంట్ జరక్కపోవడం దారుణం అన్నారు.

డైవర్షన్ డ్రామా తప్ప చేసిందేమీ లేదు

ఎన్నిసార్లు సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చినా స్పీకర్ పట్టించుకోవడం లేదని హరీశ్ రావు వాపోయారు. మూడేళ్ల నుంచి డైవర్షన్ డ్రామా తప్ప కాంగ్రెస్ పాలనలో చేసిందేమీ లేదని విమర్శించారు. ప్రతిపక్షాలను టార్గెట్ చేయడమే తప్ప, ప్రజల గురించి పట్టించుకోవడం లేదన్నారు. మాటలతో కాలం గడుపుతున్నారు, రాష్ట్రం తిరోగమనం దిశలో పయనిస్తోందన్నారు. నీళ్ల కష్టాలు, కరెంట్ కష్టాలు రాష్ట్రాన్ని చుట్టుముట్టినా ఈ ప్రభుత్వానికి పట్టింపులేదని హరీశ్ రావు మండిపడ్డారు.

దుష్ప్రచారం చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదు

ఎల్ నినో పేరు చెప్పి చేతులు ముడుచుకు కూర్చుంటున్నారు.. ప్రతిపక్షంగా మేం ప్రభుత్వాన్ని నిలదీస్తే సహించలేకపోతున్నారు అని దుయ్యబట్టారు. ఎవరెన్ని అన్నా, ఎన్ని కేసులు పెట్టినా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉందన్నారు. మాపై కాంగ్రెస్ నాయకులు చిల్లర కామెంట్స్ చేసినా మేం వాళ్లలా నోరు జారడం లేదన్నారు. క్షుద్రపూజలు అంటూ ఆరోపణలు చేసిన వారికి కోర్టు తగిన బుద్ది చెబుతుందని, తగిన చర్యలు తీసుకుంటుందని బలంగా నమ్ముతున్నానని హరీశ్ రావు తెలిపారు. గోబెల్స్ ప్రచారం చేస్తే ఎంతటి వారైనా వదిలేది లేదని, ఎంత దూరమైనా పోతామని, వారికి శిక్ష పడే వరకు వదిలిపెట్టమని హరీశ్ రావు హెచ్చరించారు.

సుప్రీం తీర్పు రేవంత్‌కు గుణపాఠం

దానం నాగేందర్ అనర్హతకు సంబంధించి సుప్రీంకోర్టు గట్టి తీర్పు ఇచ్చిందని హరీశ్ రావు వ్యాఖ్యానించారు. దానం విషయంలో న్యాయస్థానం ఇచ్చిన తీర్పు రేవంత్ కు చెంపపెట్టుగా అభివర్ణించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ రాజ్యాంగ విలువలను కాలరాస్తున్న రేవంత్ కు ఇది గట్టి గుణపాఠం అని హరీశ్ రావు అన్నారు. అధికారం చేతిలో ఉంది కదా అని ఇష్టమొచ్చినట్లు ప్రవర్తిస్తే కోర్టులు చూస్తూ ఊరుకోవు అని సీఎం రేవంత్ ను హరీశ్ రావు హెచ్చరించారు.

రాజీనామా చేయించి ప్రజల్లోకి రావాలి

అధికారాన్ని అడ్డు పెట్టుకుని రాజ్యాంగ విలువలను కాలరాస్తూ, ప్రతిపక్షాలను వేధిస్తుంటే న్యాయస్థానాలు గట్టి బుద్ది చెబుతున్నాయన్నారు. న్యాయవ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని మరింత పెంచేలా వస్తున్న తీర్పులను స్వాగతిస్తున్నామన్నారు హరీశ్ రావు. సీఎం రేవంత్ అరాచకాలు సుప్రీం తీర్పుతో బట్టబయలయ్యాయని అన్నారు. దానం నాగేందర్ ఒక్కరే కాదు పార్టీ మారిన మిగతా ఎమ్మెల్యేలతో కూడా రాజీనామా చేయించి ప్రజాక్షేత్రంలోకి రావాలని హరీశ్ రావు అన్నారు. చేతిలో రాజ్యాంగాన్ని పట్టుకొని దేశమంతా తిరిగే రాహుల్ గాంధీకి తెలంగాణలో జరుగుతున్న రాజ్యాంగ హననం కనిపించడం లేదా? అని ప్రశ్నించారు.

మిగతా వారికి ఇదే గతి

కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటే కనిపించడం లేదా? మీ మాటల్లో నిజాయితీ లేదా? అని రాహుల్ ని నిలదీశారు. పార్టీ ఫిరాయింపుల చట్టాన్ని కాంగ్రెస్ తెచ్చిందని చెప్పుకునే రాహుల్ గాంధీ.. మరెందుకు ఆ చట్టాన్ని తుంగలో తొక్కుతున్నారని హరీశ్ రావు ప్రశ్నించారు. రాజ్యాంగం మీద నిజంగా గౌరవం ఉంటే, వెంటనే తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించాలని రాహుల్ గాంధీని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ తప్పు చేసిందని, అసెంబ్లీ స్పీకర్ ఫిరాయింపుదారులను కాపాడే ప్రయత్నం చేశారని సుప్రీంతీర్పుతో బట్టబయలైందన్నారు. పార్టీ మారిన మిగతా శాసనసభ్యులకు కూడా ఇదే పరిస్థితి ఎదురవుతుందని హరీశ్ రావు వార్నింగ్ ఇచ్చారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అయినా మిగతా వారితో రాజీనామా చేయించాలని, ప్రజలే తీర్పు చెబుతారని హరీశ్ రావు అన్నారు.

#Harish Rao#Brs#Cm Revanth#Supreme Court#Danam Nagender#Telangana Politics#Swechaa News#Occult Rituals
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

ఫోటోలు

తర్వాత చదవండి