Vinod Kumar: రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ను సవరించాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పార్టీలు మార్చే ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకునేందుకు నిర్ణీత గడువు విధించాలని ఆయన అన్నారు. 10వ షెడ్యూల్ లో నిర్ణీత గడువు లేనందున చట్టంలోని లొసుగులను ప్రజా ప్రతినిధులు వాడుకుంటున్నారని ఆయన వ్యాఖ్యానించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ విషయంలో రెండున్నరేళ్లు సమయం వృధా అయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
గురువారం తెలంగాణ భవన్ లో మీడియాతో మాట్లాడిన వినోద్ కుమార్.. 10 షెడ్యూల్ లో ఉన్న లొసుగులను అడ్డం పెట్టుకొని ప్రజాప్రతినిధులు ఆ చట్టాన్ని దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై అసెంబ్లీ స్పీకర్ వెంటనే చర్యలు తీసుకోవాల్సి ఉన్నప్పటికీ.. పదవ షెడ్యూల్ లో చర్యలపై నిర్ణీత గడువు విధించకపోవడం వల్ల ఇష్టారీతిన అసెంబ్లీ స్పీకర్స్ సమయం తీసుకుంటున్నారని వినోద్ కుమార్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పై అనర్హత విషయంలో అసెంబ్లీ స్పీకర్ చాలా సమయం తీసుకున్నారని, ఈ అంశంపై దాదాపు రెండున్నర సంవత్సరాల కాలం వృథా అయ్యిందని వినోద్ కుమార్ తెలిపారు. 10వ షెడ్యూల్ లో నిర్ణీత గడువు కాలం ఉండి ఉంటే ఇంత సమయం పట్టేది కాదని, చర్యలు తక్షణం జరిగిపోయేవని వినోద్ కుమార్ అభిప్రాయపడ్డారు.
హైకోర్టు తీర్పుపై దేశంలోనే సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు వెళ్లే అధికారం ఎవరికైనా ఉంటుందని, ఈ విషయాన్ని తప్పు పట్టలేమని.. కానీ అసెంబ్లీ స్పీకర్ రెండున్నర సంవత్సరాలు పాటు ఎమ్మెల్యేపై చర్యలు తీసుకోకుండా కాలయాపన చేసిన విధానాన్ని మాత్రం తప్పు పట్టక తప్పడం లేదని వినోద్ కుమార్ అన్నారు.








