క్రైమ్

బొల్లారం ఆయుధాల చోరీ కేసులో సంచలన నిజాలు.. మిలటరీలో చేరే ముందే పాత నేర చరిత్ర!

రచన: Mamatha puppala••4 నిమిషాల పఠనం

హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీకి గురైన సంచలనాత్మక కేసులో పోలీసులు మరొక బిగ్ ట్విస్ట్‌ను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయి మల్కాజ్‌గిరి పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ హవాల్దార్ మల్లేష్‌కు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది.

 హైదరాబాద్‌లోని బొల్లారం మద్రాసు రెజిమెంట్ నుంచి ఆయుధాలు చోరీకి గురైన సంచలనాత్మక కేసులో పోలీసులు మరొక బిగ్ ట్విస్ట్‌ను వెలుగులోకి తెచ్చారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా అరెస్టయి మల్కాజ్‌గిరి పోలీసుల కస్టడీలో ఉన్న మాజీ హవాల్దార్ మల్లేష్‌కు గతంలోనే నేరచరిత్ర ఉన్నట్లు విచారణలో వెల్లడైంది. 2005 నుంచి 2007 మధ్యకాలంలో నాగర్‌కర్నూల్ జిల్లాలోని అచ్చంపేట, అమ్రాబాద్ పోలీస్ స్టేషన్ల పరిధిలో అతనిపై పలు ఇళ్లల్లో దొంగతనాలకు (హౌజ్ బ్రేకింగ్) సంబంధించిన కేసులు నమోదైనట్లు పోలీసులు గుర్తించారు.

 అప్పట్లో నమోదైన కేసులు కోర్టులో వీగిపోవడంతో మల్లేష్ నిర్దోషిగా బయటపడ్డాడని, అయితే మిలటరీ ఉద్యోగంలో చేరే సమయంలో తన పాత నేరచరిత్ర వివరాలను అధికారులకు వెల్లడించాడా? లేదా అన్న అంశంపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఆర్మీ ఎంపిక సమయంలో అధికారులు అతని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్‌ను సరిగ్గా చేశారా? లేదా? అనే కోణంలో నాటి ఆర్మీకి సమర్పించిన పత్రాలను మళ్లీ పరిశీలించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ ఆయుధాల చోరీకి ఆదివారం రోజునే ఎంచుకోవడానికి పక్కా ప్రణాళిక ఉందనే విషయం కూడా విచారణలో తేలింది.

 ఆదివారం పూట ఆర్మీ యూనిట్‌లో ఉన్నతాధికారుల నిఘా తక్కువగా ఉంటుందని, అధికారుల రాకపోకలు ఉండవని మల్లేష్ ముందే అంచనా వేశాడు. అలాగే గార్డ్ డ్యూటీలో ఉండే మిలటరీ సిబ్బంది కూడా ఆ రోజు కొంత విశ్రాంతి మోడ్‌లో ఉంటారనే అవగాహనతోనే పక్కా వ్యూహం ప్రకారం దొంగతనానికి పాల్పడినట్లు తెలిసింది. ఆయుధాలు చోరీ చేసేందుకు ఎన్ని నెలలుగా పథకం పన్నాడు, ఇంటర్నెట్ ద్వారా సమాచారం సేకరించాడా లేక ఎవరిదైనా సహకారం తీసుకున్నాడా అన్న కోణాల్లో పోలీసులు కూపీ లాగుతున్నారు.

 ప్రస్తుతం కస్టడీలో ఉన్న మల్లేష్‌ను బొల్లారం పోలీసులతో పాటు మిలటరీ ఇంటెలిజెన్స్ (MI) అధికారులు ఉమ్మడిగా విచారిస్తున్నారు. వినాయక నిమజ్జనం ప్రక్రియ పూర్తయిన అనంతరం అతనిని మరింత లోతుగా ప్రశ్నించనున్నారు. మరోవైపు, మల్లేష్ తన మొబైల్ ఫోన్‌ నుంచి డిలీట్ చేసిన డేటా మరియు చాట్‌లకు సంబంధించి ఫోరెన్సిక్ సైన్స్ లాబొరేటరీ (FSL) నివేదిక రాగానే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు.

#BollaramWeaponsTheft#MadrasRegiment#MalleshWeaponsCase#HyderabadPolice#MilitaryIntelligence#MalkajgiriPolice#HyderabadNews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి