ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు బిగ్‌షాక్ తగిలింది. పార్టీ ఫిరాయింపులకు పాల్పడినందుకు ఆయన ఎమ్మెల్యే సభ్యత్వాన్ని తెలంగాణ హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.దీనిని సుప్రీంకోర్టులో ఆయన అప్పీల్ చేయగా..తాజాగా సుప్రీంకోర్టు సైతం హైకోర్టు నిర్ణయాన్ని సమర్థిస్తూ పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో ఖైరతాబాద్ నియోజకవర్గానికి త్వరలోనే ఉపఎన్నిక రావడం అనివార్యం అయ్యింది. సాధారణంగా ఏదైనా ఎమ్మెల్యే లేదా ఎంపీ సెగ్మెంటులో అభ్యర్థి మరణించినా లేదా రాజీనామా చేసినా ఆరు నెలలోపు ఉపఎన్నిక నిర్వహించాల్సి ఉంటుంది. ఈ మేరకు వచ్చే రెండు నెలల వ్యవధిలో కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్, షెడ్యూల్ విడుదల చేసి ఉపఎన్నిక నిర్వహించనున్నట్టు సమాచారం.
అనర్హత సబబే..
ఈ నెల 18న దానం నాగేందర్ శాసనసభ సభ్యత్వంపై హైకోర్టు అనర్హత వేటు వేస్తూ తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. రాష్ట్ర న్యాయస్థానం తీర్పును దానం నాగేందర్ సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ దానం పిటిషన్‌ను తోసిపుచ్చింది. సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై విచారణ చేపట్టగా.. దానం తరపున సీనియర్ అడ్వొకేట్ ముకుల్ రోహత్గీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తరపున న్యాయవాది మోహిత్ రావు, బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి తరపున సీనియర్ అడ్వొకేట్ మహేష్ జెఠ్మలానీ సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు.
అనర్హత వేటు ఎందుకంటే?
2023 రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ తరపున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన దానం నాగేందర్.. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. అనంతరం 2024 సికింద్రాబాద్ ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ బీ-ఫామ్‌పై పోటీ చేశారు. తమ పార్టీ గుర్తుపై గెలిచి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా కాంగ్రెస్‌లో చేరి ఎంపీగా పోటీ చేశాడంటూ బీఆర్ఎస్ పార్టీ స్పీకర్‌కు ఫిర్యాదు చేసి ఆయన మీద అనర్హత వేటు వేయాలని కోరింది. సుదీర్ఘంగా విచారణ జరిపిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్.. దానం నాగేందర్ పార్టీ మారలేదని పేర్కొంటూ ఆయనకు క్లీన్‌చిట్ ఇచ్చారు.
ఇదే విషయాన్ని బీఆర్ఎస్, బీజేపీ నేతలు హైకోర్టులో సవాల్ చేశారు. ఆ పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు సెప్టెంబర్ 18న దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేసింది. అయితే, హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించి, తనకు ఉపశమనం అందించాలని దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. సర్వోన్నత న్యాయస్థానం హైకోర్టు తీర్పునే సమర్థిస్తూ పిటిషన్‌ను తోసిపుచ్చింది. ఫలితంగా ఖైరతాబాద్ సెగ్మెంటుకు ఉపఎన్నిక ఖాయమైంది. కాగా, కాంగ్రెస్ పార్టీ దానం నాగేందర్‌కు టికెట్ ఇస్తుందా? ఆయన ఖైరతాబాద్ ఉపఎన్నిక బరిలో నిలబడతారా? అనేది ఉత్కంఠగా మారింది.
రాష్ట్రంలో జరిగిన ఉపఎన్నికలు.. గెలిచిన అభ్యర్థులు వీరే..
2016లో నారాయణ్‌ఖేడ్ ఎమ్మెల్యే కిష్టారెడ్డి (కాంగ్రెస్) మరణంతో జరిగిన ఉపఎన్నికలో మహారెడ్డి భూపాల్ రెడ్డి BRS (అప్పట్లో TRS) విజయం సాధించారు. అదే ఏడాది పాలేరు ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి (కాంగ్రెస్)మరణంతో జరిగిన బై ఎలక్షన్‌లో తుమ్మల నాగేశ్వరరావు BRS (అప్పట్లో TRS) నుంచి గెలుపొందారు.ఇక 2019లో హుజూర్‌నగర్ ఎమ్మెల్యేగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా (ఎంపీగా గెలిచినందున) ఆయన పదవికి రాజీనామా చేశారు. ఆనాడు జరిగిన ఉపఎన్నికల్లో శానంపూడి సైదిరెడ్డి BRS (TRS)నుంచి విజయం సాధించారు.
2020లో దుబ్బాక నియోజకవర్గ ఎమ్మెల్యే సోలిపేట రామలింగారెడ్డి (BRS) మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో రఘునందన్ రావు(BJP) నుంచి పోటి చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2021లో నాగార్జున సాగర్ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య (BRS) మరణంతో ఆయన తనయుడు నోముల భగత్ (BRS) నుంచి పోటి చేసి గెలుపొందాడు. 2021లో హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తన పదవికి, బీఆర్ఎస్‌కు రాజీనామా చేసి బీజేపీలో చేరిన విషయం తెలిసిందే. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికలో ఆయన బీజేపీ గుర్తుమీద మరల ఎమ్మెల్యేగా గెలుపొందారు.
2022లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి తన పదవి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి BJPలో చేరారు. ఆ తర్వాత వచ్చిన ఉపఎన్నికలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి (BRS)విజయం సాధించారు. 2024లో కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత (BRS) రోడ్డు ప్రమాదంలో మరణించగా.. వచ్చిన ఉపఎన్నికలో శ్రీ గణేష్ నారాయణన్ కాంగ్రెస్ (INC) నుంచి గెలుపొందాడు. గతేడాది జుబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ (BRS) మరణంతో జరిగిన బై పోల్‌లో నవీన్ యాదవ్ (INC) గెలుపొందిన విషయం తెలిసిందే.
కాగా, ఖైరతాబాద్ నియోజకవర్గానికి జరగబోయే ఉపఎన్నికను బీఆర్ఎస్,అధికార కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకోనున్నాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడితే ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరిగిందని జనాల్లోకి మెసేజ్ వెళ్తుంది.. ఫలితంగా రానున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆ పార్టీ ఎదురీత తప్పదని టాక్ వినిపిస్తోంది. మరోవైపు బీఆర్ఎస్ గెలిస్తే పార్టీకి మైలేజ్ పెరిగిందని, ఇదే విషయాన్ని ప్రచారం చేసి వచ్చే జనరల్ ఎలక్షన్స్‌లో అధికారమే లక్ష్యంగా కారు పార్టీ దూసుకుపోనున్నట్టు తెలుస్తోంది.












