సోషల్ మీడియాలో ప్రస్తుతం 1980ల నాటి ట్రెండ్ నడుస్తోందని, కానీ తెలంగాణలో కాంగ్రెస్ పాలన పుణ్యమా అని నాటి రోజుల్లోలాగా విద్యుత్ కోతలతో రైతాంగం అల్లాడిపోతోందని బీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ‘కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కరెంట్ ఉండదు’ అని తాము ఎన్నికల ముందే హెచ్చరించామని, ఈనాడు రాష్ట్రంలో అదే నిజమవుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిరోజూ పత్రికల్లో విద్యుత్ కోతలకు సంబంధించిన వార్తలు వస్తున్నాయని ఆరోపించారు.
రాష్ట్రంలోని సబ్‌స్టేషన్ల వద్దకు వెళ్లి పరిశీలిస్తే, రైతులకు రోజుకు 6 గంటలకు మించి ఉచిత విద్యుత్ అందించడం లేదని కేటీఆర్ విమర్శించారు. పొలాలకు సరిపడా నీరు అందక, కరెంట్ కోతల వల్ల పంటలు ఎండిపోతుండటంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. నాటి ఉమ్మడి రాష్ట్రంలో చివరి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి 'తెలంగాణ వస్తే కరెంట్ ఉండదు, చీకట్లు కమ్ముకుంటాయి' అని అన్న వ్యాఖ్యలను కేటీఆర్ ఈ సందర్భంగా గుర్తుచేశారు.
కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ వచ్చిన తర్వాత ఆ మాటలను తిప్పికొడుతూ, వ్యవసాయానికి 24 గంటల ఉచిత నాణ్యమైన విద్యుత్ అందించి చూపించామని కేటీఆర్ తెలిపారు. అయితే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సరిగ్గా కిరణ్ కుమార్ రెడ్డి చెప్పినట్లే రాష్ట్రంలో విద్యుత్ లేకుండా చేస్తూ తెలంగాణను మళ్లీ చీకట్లోకి నెడుతున్నారని మండిపడ్డారు.
రైతుల సంక్షేమాన్ని పక్కనపెట్టి విద్యుత్ సరఫరాలో నిర్లక్ష్యం వహిస్తే రైతాంగం ఊరుకోదని, తక్షణమే 24 గంటల ఉచిత విద్యుత్‌ను నిరంతరాయంగా పునరుద్ధరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో బీఆర్‌ఎస్ పక్షాన రైతుల కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరించారు.











