రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్)రాష్ట్ర అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆగ్రహం వ్యక్తం చేశారు.ఆదిలాబాద్ రిమ్స్ ఘటన మీద బుధవారం ఆమె స్పందించారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఆదిలాబాద్ రిమ్స్‌లో కరెంట్ షార్ట్ సర్క్యూట్, ఏసీ పేలి ఐదుగురు చిన్నారులు మరణించారని కల్వకుంట్ల కవిత విమర్శించారు.
ఆదిలాబాద్ సురక్ష చిల్డ్రన్ హాస్పిటల్‍లో చికిత్స పొందుతున్న ‘రిమ్స్’ ఎస్ఎన్‍సీయూ అగ్ని ప్రమాద ప్రమాద బాధిత శిశువుల తల్లిదండ్రులను కవిత పరామర్శించారు. అనంతరం మీడియాతో టీఆర్ఎస్ చీఫ్ కవిత మాట్లాడుతూ.. ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకున్నానని సీఎం రేవంత్ చెప్పారని, ఆయన దత్తత తీసుకున్న జిల్లాలో 5 మంది పసి పిల్లలు చనిపోతే వచ్చి చూసేందుకు తీరక లేదా? అని ప్రశ్నించారు. ఫుట్ బాల్ ఆడేందుకు, విదేశాల్లో తిరిగేందుకు మాత్రమే సీఎంకు టైం ఉంటుందన్నారు. మైనార్టీ, ఆదివాసీ పిల్లలు చనిపోతే చూడటానికి టైం లేదా? అని నిలదీశారు.
ఈ ముఖ్యమంత్రికి నెల రోజుల సమయం ఇస్తున్నామని, ఆలోపు పెండింగ్ హెల్త్ బకాయిలు రిలీజ్ చేయాలని డిమాండ్ చేశారు. ఆదివాసీ గూడెలకు రోడ్లు వేయాలని, కేంద్ర ప్రభుత్వం నుంచి ఎన్ని నిధులు వచ్చాయో లెక్కలు అన్నీ బయటపెట్టాలన్నారు. తాము విధించిన గడువులోపు ఆసుపత్రికి నిధులు విడుదల కాకపోయినా, రోడ్లు బాగుచేయలేకపోతే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాను ఆదివాసీలందరితో కలిసి ఘెరావ్ చేస్తామని కవిత హెచ్చరించారు.
తాము ఆశామాషీగా వచ్చి చూసి వెళ్లే టూరిస్ట్ పార్టీ కాదని టీఆర్ఎస్ చీఫ్ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సగం మంది సిబ్బంది, డాక్టర్లు, శానిటేషన్ సిబ్బంది కూడా లేరన్నారు. కనీసం చీపుర్లు, ఫినాయిల్, దూది, మందులు కొనుగోలు చేయడానికి సైతం మెయింటెన్స్ విడుదల కాలేదని పేర్కొన్నారు. ఆరోగ్యశ్రీ బకాయిలు రూ.500 కోట్లు ఉన్నాయంటే ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని విమర్శించారు. ఏసీ పేలిన ఘటనలో ఇంత ఘోరం జరిగిందని, ఆసుపత్రిలో 150 ఏసీలు ఉంటే ఒక్క మెకానిక్ కూడా లేరని ఫైర్ అయ్యారు. ఈ ఘటనపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సీఎం వెంటనే రిమ్స్‌కు వచ్చి జరిగిన ప్రమాదంపై సంజాయిషీ ఇవ్వాలని కోరారు.












