తెలంగాణ

TG : కుంభకర్ణ ప్రభుత్వాన్ని ముల్లుగర్రతో తట్టిలేపిన రైతులకు ధన్యవాదాలు : కేటీఆర్

రచన: Kumar4 నిమిషాల పఠనం

జూరాల నుంచి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడంతో కొన్నిరోజులుగా అన్నదాతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏకంగా జూరాల ప్రాజెక్టు ఎంట్రీ గేటు బద్దలు గొట్టి మరీ రైతులే నీటిని విడుదల చేసుకున్నారు.

జూరాల నుంచి ఆయకట్టుకు నీళ్లు ఇవ్వకపోవడంతో కొన్నిరోజులుగా అన్నదాతలు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. అధికారులు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఏకంగా జూరాల ప్రాజెక్టు ఎంట్రీ గేటు బద్దలు గొట్టి మరీ రైతులే నీటిని విడుదల చేసుకున్నారు. అనంతరం ప్రభుత్వం పోలీసు పహారాతో రైతులను మరోసారి ప్రాజెక్టు వద్దకు రాకుండా అడ్డుకున్నది. అయితే, గత రెండ్రోజులుగా అన్నదాతల కోసం అటు బీఆర్ఎస్,ఇటు బీజేపీ పార్టీల నేతలు ఆయకట్టుకు నీళ్లు ఇవ్వాలని ఆందోళనలు నిర్వహించారు. తాజాగా సర్కార్ ఆయకట్టుకోసం జూరాల కుడి, ఎడమ కాలువ నుంచి నీటిని విడుదల చేసింది.

ఈ క్రమంలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా ఆసక్తికరపోస్టు పెట్టారు. ‘పోరాడితే పోయేదేమీ లేదు.. బానిస సంకెళ్లు తప్ప!’ అంటూ రాసుకొచ్చారు. హక్కుల సాధన కోసం రోడ్డెక్కిన అన్నదాతల పోరాట పటిమను మాజీమంత్రి కొనియాడారు.ప్రాజెక్టు నుంచి నీరు అందక పొలాలు పూర్తిగా ఎండిపోతున్న విపత్కర పరిస్థితుల్లో రైతులు చేసిన సాహసోపేతమైన పోరాటం అత్యంత స్ఫూర్తిదాయకమన్నారు.

రైతుల కష్టాలను పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఈ 'కుంభకర్ణ ప్రభుత్వాన్ని' ముల్లుగర్రతో తట్టి నిద్రలేపి, నీటిని విడుదల చేసేలా పరుగులు పెట్టించిన అన్నదాతలకు ఆయన హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. రైతుల పోరాటంలో అండగా నిలిచి, నిర్బంధాలను ఎదుర్కొంటూ క్షేత్రస్థాయిలో కలిసి నడిచిన బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలందరికీ ఈ సందర్భంగా కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తెలంగాణ ప్రజల కనీస అవసరాలను తీర్చేలా ఈ ప్రభుత్వాన్ని పరుగులు పెట్టించడమే రానున్న రెండేళ్ల పాటు తమ కర్తవ్యమన్నారు.ప్రజా సమస్యలపై నిరంతరం ప్రశ్నించడం, పోరాడడం, తెలంగాణ హక్కుల సాధన కోసం అవసరమైతే ఎవరితోనైనా రాజీలేని కొట్లాట చేయడమే బీఆర్ఎస్ పార్టీ ముందున్న ప్రధాన లక్ష్యమన్నారు.రైతులతో కలిసి ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం వల్లే ఎట్టకేలకు రేవంత్ సర్కార్ దిగొచ్చి కాలువల ద్వారా నీటిని విడుదల చేయాల్సి వచ్చిందని వెల్లడించారు.

#KTR#farmers#jurala water#release#congress#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి