స్వేచ్ఛ న్యూస్ ,గద్వాల :
గత వారం రోజులుగా జూరాల ఆయకట్టుకు సాగు నీటిని విడుదల చేయకపోవడంతో పంటలు ఎండుతున్నాయి.ఈ క్రమంలోనే రైతులు పెద్ద సంఖ్యలో ధర్నాలు, రాస్తారోకోలు, డ్యాం ముట్టడి కార్యక్రమాలు చేపట్టారు.దీంతో దిగొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం సాగు కోసం నీటి విడుదల చేసేందుకు అంగీకరించింది.ఈ మేరకు కర్ణాటక సర్కారుతో తెలంగాణ ప్రభుత్వం చర్చలు జరిపి 7 టీఎంసీల నీటి విడుదలకు ఆమోదం పొందింది.నెల రోజులపాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున కర్ణాటక ప్రభుత్వం నీటిని విడుదల చేయనుంది.
ఈ నేపథ్యంలో జూరాల నుంచి సాగునీటి విడుదల చేయాలని మంత్రి వాకిటి శ్రీహరి ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు.దీంతో ఇవాళ ఉదయం జూరాల కుడి,ఎడమ కాలువలకు అధికారులు నీటిని విడుదల చేశారు. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నందున వేసవిలో తాగునీటి అవసరాల దృష్ట్యా ఆయకట్టు కింద సాగు చేస్తున్న పంట పొలాలకు సాగునీరు విడుదలకు ఇబ్బందులు తలెత్తాయి. కర్ణాటక ప్రభుత్వంతో జరిగిన చర్చలు సఫలం కావడంతో రైతులు పెట్టుబడి నష్టపోకుండా ఉండేందుకు సాగునీటి విడుదలకు కాంగ్రెస్ ప్రభుత్వం అంగీకరించినట్టు తెలిసింది.
జూరాళకు జలకళ..
ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలతో ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టులోకి 2,687 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వచ్చి చేరుతోంది. దీంతో జూరాల కుడి కాలువలకు సాగునీటిని విడుదల చేశారు. నీటి విడుదలతో ఆయకట్టు పరిధిలోని రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. మరోవైపు జూరాల ప్రాజెక్టుకు సాగు, తాగునీటి అవసరాల కోసం నీటిని విడుదల చేయాలని కోరుతూ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు బెంగళూరులో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ను కలిశారు. జూరాల ఆయకట్టు రైతుల సాగునీటి సమస్యను ఆయన దృష్టికి తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా 30 రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల చొప్పున మొత్తం 7 టీఎంసీల నీటిని జూరాల ప్రాజెక్టుకు విడుదల చేస్తామని కర్ణాటక సీఎం డీకే శివకుమార్ హామీ ఇచ్చినట్లు ప్రజాప్రతినిధులు తెలిపారు. కర్ణాటక నుంచి నీరు అందితే జూరాల ఆయకట్టు పరిధిలోని పంటలకు మరింత సాగునీటి భరోసా లభించనుంది. ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ఇన్‌ఫ్లోతో పాటు కర్ణాటక నుంచి నీటి విడుదలకు హామీ లభించడంతో జూరాల ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురిస్తున్నాయి. సాగు, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని నీటి వినియోగం, విడుదలపై అధికారులు పర్యవేక్షణ కొనసాగిస్తున్నారు.












