భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం వెంగన్నపాలెం గ్రామంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. ఖమ్మం జిల్లాలోని ఒక ప్రైవేట్ కళాశాలలో బీఎస్సీ నర్సింగ్ ప్రథమ సంవత్సరం చదువుతున్న ఇంద్రవెల్లి హరిణి (18) అనే విద్యార్థిని స్వగ్రామంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. సెలవుల నేపథ్యంలో ఇటీవలే గ్రామానికి వచ్చిన సదరు యువతి, తన ఇంటి ఆవరణలోని బాత్రూమ్ వెనుక భాగంలో మృతదేహమై కనిపిచడం తీవ్ర కలకలం రేపింది.
మూడేళ్ల క్రితం తండ్రి సతీష్ మరణించడంతో, తల్లి రాజేశ్వరి రెక్కల కష్టం చేసి కూలి పనులు చేసుకుంటూ ఇద్దరు కుమార్తెలను చదివిస్తోంది. మంగళవారం తల్లి రాజేశ్వరి గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వచ్చేసరికి ఇంట్లో కూతురు కనిపించలేదు. ఆందోళనతో చుట్టుపక్కల వెతకగా, ఇంటి వెనుక బాత్రూమ్ సమీపంలో హరిణి నిర్జీవంగా పడి ఉంది. కాగా, పక్కింటి వ్యక్తే తమ కుమార్తెపై దారుణానికి పాల్పడి హత్య చేసి ఉంటాడని మృతురాలి తల్లి తీవ్ర ఆరోపణలు చేస్తోంది.
ఘటనా స్థలంలో హరిణి మృతదేహంపై తీవ్రమైన గాయాలు ఉండటం, దుస్తులు చెల్లాచెదురుగా పడి ఉండటంతో ఆమెపై అఘాయిత్యం జరిగి ఉండవచ్చని స్థానికులు, బంధువులు తీవ్ర అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు క్లూస్ టీమ్‌తో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని శాస్త్రీయ ఆధారాలను సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
బాధిత కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును వేగవంతం చేశారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాతే మృతికి గల పూర్తి కారణాలు తెలుస్తాయని, నిందితులెవరైనా సరే కఠినంగా శిక్షిస్తామని సీఐ తెలిపారు. ఈ ఘటనతో వెంగన్నపాలెం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.











