పొట్టి ఫార్మాట్ టీ20 క్రికెట్‌లో భారత జట్టు సరికొత్త మైలురాయిని చేరుకుంటూ చారిత్రక రికార్డు సృష్టించింది. అంతర్జాతీయ టీ20 క్రికెట్ చరిత్రలోనే 200 విజయాలు సాధించిన ప్రపంచంలోనే మొదటి జట్టుగా టీమిండియా నిలిచింది. జపాన్‌తో జరిగిన మ్యాచ్‌లో 2 పరుగుల తేడాతో తీవ్ర ఉత్కంఠ నడుమ విజయం సాధించడం ద్వారా భారత్ ఈ అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. ప్రపంచంలో ఏ ఇతర అంతర్జాతీయ లేదా ఫ్రాంచైజీ జట్టు సాధించని రికార్డును భారత్ నమోదు చేసి తన ఆధిపత్యాన్ని చాటుకుంది.
2006లో టీ20 క్రికెట్‌లో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటివరకు భారత్ మొత్తం 291 మ్యాచ్‌లు ఆడింది. అందులో ఏకంగా 200 విజయాలను సాధించగా, 81 మ్యాచ్‌ల్లో ఓటమి చవిచూసింది, ఒక మ్యాచ్ టైగా ముగియగా, 9 మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు. ఈ జాబితాలో పాకిస్థాన్ 176 విజయాలతో రెండో స్థానంలో నిలవగా, ఇంగ్లాండ్ కౌంటీ జట్టు సోమర్‌సెట్ 174 విజయాలతో మూడో స్థానంలో ఉంది. ఐపీఎల్ విషయానికి వస్తే ముంబయి ఇండియన్స్ 166, చెన్నై సూపర్ కింగ్స్ 163 విజయాలతో నిలిచాయి.
చారిత్రక మైలురాయిని అందించిన ఈ మ్యాచ్‌లో భారత్‌కు జపాన్ గట్టి పోటీ ఇచ్చింది. వర్షం కారణంగా మ్యాచ్‌ను చెరో ఐదు ఓవర్లకు కుదించగా, మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 5 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 32 పరుగులు మాత్రమే చేసింది. శ్రేయాస్ అయ్యర్ 16 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలవగా, జపాన్ బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో భారత బ్యాటర్లను కట్టడి చేశారు.
అనంతరం 33 పరుగుల స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన జపాన్‌ను భారత స్పిన్నర్లు వాషింగ్టన్ సుందర్ (2/13), అక్షర్ పటేల్ సమర్థవంతంగా కట్టడి చేశారు. ఆఖరి ఓవర్‌లో జపాన్ విజయానికి 8 పరుగులు అవసరం కాగా, అక్షర్ పటేల్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేసి కేవలం 5 పరుగులు మాత్రమే ఇచ్చాడు. దీంతో జపాన్ 5 ఓవర్లలో 30/3 పరుగులకే పరిమితమై, భారత్ 2 పరుగుల తేడాతో విజయం సాధించి టీ20లలో 200వ విజయాన్ని నమోదు చేసింది.










