పాలమూరు జిల్లాలోని అమరచింత, ఆత్మకూరు తదితర మండలాల ఆయకట్టు రైతుల సుదీర్ఘ పోరాటం ఎట్టకేలకు ఫలించింది. జూరాల ప్రాజెక్టు కింద సాగునీరు అందక పంటలు ఎండిపోతున్నాయని రైతులు ఆందోళన బాట పట్టడంతో స్పందించిన నీటిపారుదల శాఖ అధికారులు, ఎడమ కాలువకు నీటిని విడుదల చేశారు. సాగునీటి కోసం రైతులు బీఆర్‌ఎస్ మద్దతుతో నిర్వహించిన విస్తృత ఆందోళనల ప్రతిఫలంగానే ప్రభుత్వం దిగివచ్చి నీటిని వదిలిందని స్థానిక రైతాంగం హర్షం వ్యక్తం చేస్తోంది.
మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రాంమోహన్ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు జూరాల వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టి ప్రాజెక్టు సీఈతో చర్చలు జరిపారు. ఎండిపోతున్న ఆయకట్టు పంటలను కాపాడటానికి తక్షణమే నీటిని విడుదల చేయాలని, లేనిపక్షంలో ఆందోళన తీవ్రతరం చేస్తామని స్పష్టం చేయడంతో ఉన్నతాధికారులతో సంప్రదించిన అధికారులు నీటి విడుదలకు హామీ ఇచ్చి చర్యలు చేపట్టారు. అంతకుముందు పోలీసులు బీఆర్‌ఎస్ నేతలను అడ్డుకోవడానికి, హౌజ్ అరెస్టులు చేయడానికి ప్రయత్నించినప్పటికీ రైతులు వెనక్కి తగ్గకపోవడంతో ప్రభుత్వం దిగిరాక తప్పలేదు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సాగునీటి నిర్వహణలో తీవ్ర అలసత్వం వహిస్తోందని, నిరసనలతో ఒత్తిడి తెస్తే తప్ప మొద్దునిద్ర వీడటం లేదని రైతు నాయకులు ఆరోపించారు. తీవ్రమైన కరువు పరిస్థితుల నడుమ, గొంతుకెండుతున్న పంట పొలాలకు ఎడమ కాలువ నీరు ఊరటనిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ విజయంతో పాలమూరు ఆయకట్టు ప్రాంత రైతుల్లో ఉత్సాహం నెలకొంది. రానున్న రోజుల్లో కూడా పంటలు పూర్తయ్యే వరకు కాలువలకు క్రమం తప్పకుండా సాగునీరు విడుదల చేయాలని, రైతులను ఇబ్బందులకు గురిచేసే చర్యలను ప్రభుత్వం మానుకోవాలని ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎండిపోతున్న ఆయకట్టు పంటలను కాపాడేందుకు సీఎం రేవంత్ రెడ్డి నేరుగా కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టు కింద నెలకొన్న సాగునీటి తీవ్ర ఎద్దడిని వివరించారు. నారాయణపూర్, ఆల్మట్టి జలాశయాల నుంచి విడతల వారీగా దాదాపు 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని ఆయన విజ్ఞప్తి చేశారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యేల బృందం బెంగళూరుకు వెళ్లి అక్కడి ప్రభుత్వ ప్రతినిధులకు మంగళవారం వినతిపత్రం సమర్పించారు. ఈ మేరకు కర్ణాటక ప్రభుత్వం సానుకూలంగా స్పందించగా నేడు(బుధవారం) ఉదయం నీటిని విడుదల చేసింది.











