హైదరాబాద్‌లోని మాదాపూర్ ఓయో హోటల్లో యువతి అనుమానాస్పద మృతి కేసులో సంచలన నిజాలు వెలుగుచూశాయి. ప్రియుడు శ్రీనివాస రవితేజతో కలిసి వైజాగ్‌కు చెందిన యువతి షారన్ నిఖిత టోప్నో (23) నగరానికి వచ్చింది. వీరిద్దరూ మాదాపూర్ సిద్ధిఖీ నగర్ రోడ్డు నంబర్-5లోని ఓయో హోటల్ రూమ్ నం.303లో దిగారు.అయితే, అర్ధరాత్రి తన ప్రియురాలు అస్వస్థతకు గురైందని హోటల్ మేనేజర్‌కు ప్రియుడు సమాచారం ఇచ్చాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే యువతి మృతిచెందినట్టు వైద్యులు ప్రకటించారు.
ఆస్పత్రి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు అక్కడకు చేరుకున్న పోలీసులు యువతి మృతిపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో సంచలన విషయాలు వెలుగుచూశాయి.మాదాపూర్ ఓయో రూమ్‌లో బీర్, విస్కీ బాటిల్స్ పగిలినట్లు పోలీసులు గుర్తించారు. బెడ్‌తో పాటు రూమ్ గోడలపై రక్తపు మరకలు సైతం ఉన్నట్టు తేల్చారు. మృతురాలు షారన్ నిఖిత ముఖం, శరీరంపైనే కాకుండా, తల వెనుక కూడా తీవ్ర గాయాలు ఉన్నట్టు నిర్దారించారు.
మొన్న మధ్యాహ్నం 1:48 గంటలకు నిఖిత ఓయో హోటల్‌కు వెళ్లగా కొద్దిసేపటి తర్వాత శ్రీనివాస రవితేజ కూడా వెళ్లినట్టు గుర్తించారు.అర్ధరాత్రి యువతి స్పృహ కోల్పోయిందంటూ రవితేజ తన వద్దకు వచ్చాడని హోటల్ సూపర్‌వైజర్ పోలీసులకు వివరించినట్టు తెలిసింది.అంబులెన్స్‌లో తీసుకెళ్దామంటే వద్దు, బైక్ చాలని నిఖితను రవితేజ ఆసుపత్రికి తీసుకెళ్లాడని మేనేజర్ వెల్లడించాడు.
నిఖిత మృతి చెందిందని డాక్టర్లు చెప్పడంతో అక్కడి నుంచి రవితేజ పరారైనట్టు తెలిసింది. ఇద్దరి మధ్య మూడేళ్ల వయసు వ్యత్యాసం ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. అబ్బాయి కంటే అమ్మాయే పెద్దదని గుర్తించారు. వీరిమధ్య ప్రేమ వ్యవహారం నడుస్తోందని, పెళ్లి చేసుకోవాలని యువతి ఒత్తిడి చేయడం వల్లే రవితేజ ఆమెను హత్య చేసినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేయగా దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం పరారీలో ఉన్న రవితేజ కోసం గాలిస్తున్నట్టు తెలిపారు.











