తెలంగాణ

Hyderabad: క్యూర్‌ చట్టం పై కొత్త చర్చ.. స్థానిక సంస్థల అధికారాల సంగతేంటి?..

రచన: Venu8 నిమిషాల పఠనం

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే.. పలు వివాదాస్పదమైన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటుంది. అందులో 22 A అంశం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ మారింది. అలాగే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) చట్టం కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది.

రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుండి అభివృద్ధి మంత్రాన్ని జపిస్తూనే.. పలు వివాదాస్పదమైన నిర్ణయాలతో విమర్శలు ఎదుర్కొంటుంది. అందులో 22 A అంశం తెలంగాణలో బర్నింగ్ టాపిక్ మారింది. అలాగే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ (క్యూర్‌) చట్టం కూడా పలు ఆరోపణలు ఎదుర్కొంటుంది. మొత్తానికి హైదరాబాద్‌ నగర పాలనలో కొత్త అధ్యాయం మొదలైందని ప్రచారం జరుగుతూనే.. ఈ కొత్త వ్యవస్థతో పాటు ఒక కీలక చర్చ కూడా తెరపైకి వచ్చింది.

ఇక క్యూర్‌... అంటే కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ వ్యవస్థ. ఇది నగర పాలనను మరింత సమర్థవంతం చేస్తుందా? లేక స్థానిక సంస్థల అధికారాలను క్రమంగా కుదించే పరిస్థితి వస్తుందా? అన్నదే రాజకీయ, పరిపాలనా వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే హైదరాబాద్‌ కోర్‌ అర్బన్‌ రీజియన్‌ను ఒకే సమగ్ర వ్యవస్థగా అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కొత్త పాలనా విధానాన్ని తీసుకొచ్చినట్టు చెబుతుంది.

ఇందులో భాగంగా మూడు మున్సిపల్‌ కార్పొరేషన్లు, ఇతర పట్టణ సంస్థల మధ్య సమన్వయం, ప్రాంతీయ స్థాయిలో మౌలిక వసతుల ప్రణాళిక, సేవల నిర్వహణ వంటి అంశాలను ఒకే ఫ్రేమ్‌వర్క్‌లోకి తీసుకురావడం దీని ప్రధాన లక్ష్యంగా వివరిస్తుంది. అయితే క్యూర్‌ వ్యవస్థలో ముఖ్యమైన నిర్ణయాల కోసం ముఖ్యమంత్రి అధ్యక్షతన అపెక్స్‌ గవర్నెన్స్‌ కౌన్సిల్‌, దాని నిర్ణయాలను అమలు చేసేలా అధికారులతో కూడిన ఎగ్జిక్యూటివ్‌ కమిటీ ఉండనుంది.

ఈ కౌన్సిల్‌లో ఎన్నికైన స్థానిక ప్రజాప్రతినిధులకు తగిన స్థానం లేదన్నది ఇప్పటికే కొందరు నేతలు, నిపుణులు వ్యక్తం చేస్తున్న ప్రధాన అభ్యంతరం. ప్రస్తుతం మున్సిపల్‌ కార్పొరేషన్లలో స్టాండింగ్‌ కమిటీ, జనరల్‌ బాడీ వంటి వ్యవస్థల ద్వారా అనేక కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. భారీ ప్రాజెక్టులు, పెద్ద మొత్తాల ఆర్థిక వ్యవహారాల్లో మాత్రం ప్రభుత్వ అనుమతి లేదా సిఫారసు అవసరమవుతుంది. కానీ క్యూర్‌ వ్యవస్థలో ప్రాంతీయ ప్రాధాన్యతలకు సంబంధించిన నిర్ణయాలు అపెక్స్‌ స్థాయిలో తీసుకునే అవకాశం పెరుగుతుంది.

అంటే... స్థానిక నిర్ణయాధికారం ఎంత వరకు మేయర్‌, కార్పొరేషన్‌ పాలకవర్గం వద్ద ఉంటుంది? ఎంత వరకు ప్రాంతీయ పాలనా వ్యవస్థకు వెళ్తుంది? అన్నది ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. ఇక కార్పొరేషన్లు తమకు అప్పగించిన బాధ్యతలను సక్రమంగా నిర్వహించకపోతే ప్రభుత్వానికి నేరుగా జోక్యం చేసుకునే అధికారాలను కూడా చట్టంలో పొందుపరిచారు. ఒక సంస్థ విధులను అసంపూర్ణంగా, అసమర్థంగా లేదా అనుచితంగా నిర్వహిస్తోందని ప్రభుత్వం భావిస్తే... నిర్దిష్ట గడువులోగా వాటిని సక్రమంగా నిర్వహించేలా ఆదేశాలు జారీ చేయవచ్చు. అవసరమైన ఆర్థిక వనరులను కేటాయించాలని కూడా సూచించవచ్చు. అయితే అత్యవసరం కాని సందర్భాల్లో ముందుగా సంబంధిత కార్పొరేషన్‌కు వివరణ ఇచ్చుకునే అవకాశం కల్పించే నిబంధన కూడా ఇందులో ఉంది.

మరోవైపు ఆర్థిక వ్యవహారాల్లోనూ కొత్త విధానం కనిపిస్తోంది. ప్రభుత్వ ఆదేశాలను అమలు చేసేందుకు అవసరమైన నిధుల కోసం నిర్దిష్ట మొత్తాన్ని డిబెంచర్ల ద్వారా సమీకరించే అవకాశం కల్పించారు. ఇందుకోసం మున్సిపల్‌ పన్నుల ద్వారా వచ్చే ఆదాయాన్ని భద్రతగా ఉపయోగించే వెసులుబాటు కూడా ఉంది. అంటే ఇప్పటివరకు కార్పొరేషన్‌ ఆదాయం, ఆస్తుల ఆధారంగా రుణ సమీకరణ జరిగితే... కొత్త విధానంలో పన్నుల ఆదాయాన్ని కూడా రుణానికి భద్రతగా ఉపయోగించుకునే మార్గం ఏర్పడుతోంది.

ఇక ప్రభుత్వ జోక్యానికి సంబంధించి మరో కీలక అంశం ఉంది. చట్టానికి విరుద్ధంగా లేదా తమ అధికార పరిధిని మించి కార్పొరేషన్లు తీసుకున్న తీర్మానాలు, జారీ చేసిన ఉత్తర్వులు, మంజూరు చేసిన లైసెన్సులు, అనుమతులను ప్రభుత్వం రద్దు చేసే అవకాశం ఉంది. ప్రజా ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న చర్యలను నిలిపివేయడానికి కూడా అధికారాలు కల్పించారు.

అయితే... ఈ అధికారాలు పూర్తిగా అపరిమితం కావు. చట్టవిరుద్ధత లేదా అధికార పరిధి దాటిన అంశాలపై చర్య తీసుకునే ముందు సంబంధిత వ్యక్తి లేదా సంస్థకు వివరణ ఇచ్చుకునే అవకాశం ఇవ్వాలని నిబంధనలు చెబుతున్నాయి. ఇప్పటికే జరిగిన కార్పొరేషన్‌ ఎన్నికను మాత్రం ఈ అధికారాల ఆధారంగా ప్రభుత్వం రద్దు చేయలేదని చట్టంలో స్పష్టత ఇచ్చారు. ఇక్కడే 74వ రాజ్యాంగ సవరణ స్ఫూర్తి అంశం ప్రస్తావనకు వస్తోంది.

పట్టణ స్థానిక సంస్థలను ప్రజలకు దగ్గరగా పనిచేసే స్వయం పాలనా సంస్థలుగా బలోపేతం చేయడం 74వ సవరణలోని ప్రధాన ఉద్దేశాల్లో ఒకటి. అందుకే క్యూర్‌పై అసలు చర్చ కేవలం హైదరాబాద్‌ పరిపాలనా పునర్వ్యవస్థీకరణ గురించి మాత్రమే కాదు. మెట్రో స్థాయిలో సమగ్ర నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం... అదే సమయంలో స్థానిక ప్రజాప్రతినిధుల నిర్ణయాధికారాన్ని కాపాడాల్సిన రాజ్యాంగ స్ఫూర్తి... ఈ రెండింటి మధ్య సమతుల్యత ఎలా సాధిస్తారు? అన్నదే ఇప్పుడు కీలక అంశంగా మారింది.

ప్రభుత్వం చెబుతున్న సమగ్ర అభివృద్ధి లక్ష్యం ఒకవైపు ఉంటే... స్థానిక స్వపరిపాలనపై వ్యక్తమవుతున్న అభ్యంతరాలు మరోవైపు ఉన్నాయి. చివరికి క్యూర్‌ వ్యవస్థ హైదరాబాద్‌కు సమన్వయంతో కూడిన మెట్రో పాలనను అందిస్తుందా... లేక అధికార కేంద్రీకరణపై మరింత చర్చకు దారితీస్తుందా... అన్నది దాని అమలు విధానంపైనే ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి..

#Telangana#Hyderabad#CURE Act#Apex Governance Council#local bodies#congress
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి