తెలంగాణ

Hyderabad: దానం రాజకీయ ప్రస్థానానికి మరో కీలక మలుపు.. ఖైరతాబాద్ ఉపఎన్నిక!!..

రచన: Venu9 నిమిషాల పఠనం

రాజకీయం అంటే పూలబాట కాదని కొందరి నేతల జీవితాలు నిరూపిస్తాయి. అందుకే రక్తం చిందించకుండా ఆడే ఆధునిక కురుక్షేత్రం రాజకీయం అంటారు పెద్దలు.

రాజకీయం అంటే పూలబాట కాదని కొందరి నేతల జీవితాలు నిరూపిస్తాయి. అందుకే రక్తం చిందించకుండా ఆడే ఆధునిక కురుక్షేత్రం రాజకీయం అంటారు పెద్దలు. ఇక్కడ పదవుల వెనుక పదునైన వ్యూహాలు ఉంటాయి. ఒక్క తప్పటడుగు పడితే అడ్రస్ లేకుండాపోయే చక్రవ్యూహం కూడా!.. అందుకే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు ఉండరు, శాశ్వత మిత్రులు ఉండరు.

ఉండేది ఒక్కటే అధికారం!.. దీనికోసమే ఎన్నో కుతంత్రాలు, విమర్శలు, మొత్తానికి ఇదొక మనుషులతో ఆడే చదరంగం. ప్రస్తుతం బీఆర్ఎస్-కాంగ్రెస్ మధ్య ఇలాంటి పొలిటికల్ గేమ్ మొదలైందనే చర్చలు జోరందుకున్నాయి. ఎన్నో ఆశలతో దానం నాగేందర్ పదవి పొందితే.. ఆ పదవికి గండం తెచ్చింది బీఆర్ఎస్.. దీంతో ఖైరతాబాద్ ఉపఎన్నిక అనివార్యమైంది. అయితే ఈ ఎన్నిక దానం నాగేందర్ రాజకీయ జీవితంలో మరో కీలక మలుపుగా మారబోతోందా? అనే ఆసక్తి రాష్ట్ర రాజకీయాల్లో నెలకొంది.

ఎందుకంటే దానం రాజకీయ చరిత్రను చూస్తే.. ఈ పోరు ఆయనకు అంత ఈజీగా కనిపించడం లేదు. ఖైరతాబాద్ రాజకీయాలు కేవలం ప్రస్తుత పార్టీల బలాబలాలతో మాత్రమే నిర్ణయమయ్యే నియోజకవర్గం కాదు. ఇక్కడ పాత రాజకీయ అనుబంధాలు, బస్తీల్లో వ్యక్తిగత పరిచయాలు, ముఖ్యంగా పీజేఆర్ కుటుంబానికి ఉన్న ప్రభావం కూడా కీలకంగా మారే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.

మరోవైపు దానం నాగేందర్ రాజకీయ ప్రస్థానం కూడా ఓటమితోనే మొదలైంది. పీజేఆర్ అనుచరుడిగా రాజకీయాల్లోకి వచ్చిన దానంకు 1989లో ఆసిఫ్‌నగర్ నుంచి కాంగ్రెస్ టికెట్ దక్కింది. అప్పట్లో ఆ నియోజకవర్గంలో ఎంఐఎం బలంగా ఉండేది. 1983, 1985లో ఎంఐఎం గెలిచిన నేపథ్యంలో కాంగ్రెస్‌కే గెలుపుపై పూర్తి నమ్మకం లేని పరిస్థితుల్లో దానం బరిలోకి దిగారు. ఫలితంగా ఆయన ఓడిపోయారు.

అయితే ఆ ఓటమి తర్వాత దానం వెనక్కి తగ్గలేదు. 1994, 1999లో గెలిచి తన రాజకీయ బలాన్ని నిరూపించుకున్నారు. 2004లో ఆసిఫ్‌నగర్ టికెట్ దక్కకపోవడంతో సికింద్రాబాద్ ఎంపీ టికెట్ కూడా వద్దని, టీడీపీ బీఫారంతో ఆసిఫ్‌నగర్ నుంచి పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి కాంగ్రెస్ తరఫున ఉపఎన్నికకు వెళ్లినా.. ఎంఐఎం చేతిలో ఓడిపోయారు. ఆ ఎన్నికలో పీజేఆర్ వర్గం, ముఖేశ్‌గౌడ్ వర్గం, టీడీపీ కలిసి దానంకు వ్యతిరేకంగా పనిచేశాయనే ఆరోపణలున్నాయి.

ఇక 2009 నియోజకవర్గాల పునర్విభజనతో ఆసిఫ్‌నగర్ రద్దై.. ఖైరతాబాద్, జూబ్లీహిల్స్, కుత్బుల్లాపూర్, కూకట్‌పల్లి, శేరిలింగంపల్లి వంటి నియోజకవర్గాలు ఏర్పడ్డాయి. అదే సమయంలో దానం ఖైరతాబాద్ నుంచి, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి జూబ్లీహిల్స్ నుంచి గెలిచారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మంత్రివర్గంలో దానం మంత్రిగా పనిచేశారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత 2014లో కాంగ్రెస్ నుంచి ఓడిపోయిన ఆయన.. 2018, 2023లో బీఆర్ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి గెలిచారు.

కానీ 2023 తర్వాతే ఆయన రాజకీయ ప్రయాణం మరో మలుపు తిరిగింది. బీఆర్ఎస్ నుంచి గెలిచిన దానం కాంగ్రెస్‌లో చేరి.. 2024లో సికింద్రాబాద్ లోక్‌సభకు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేశారు. అక్కడ ఓడిపోయారు. అనంతరం పార్టీ ఫిరాయింపు చట్టం కింద దాఖలైన పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడిగా ప్రకటించి, ఖైరతాబాద్ స్థానాన్ని ఖాళీగా ప్రకటించింది. ఇప్పుడు ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై సెప్టెంబర్ 23న విచారణ జరగనుంది.

ఇక ఉపఎన్నిక జరిగే పరిస్థితి వస్తే.. అసలు కాంగ్రెస్ ఎవరిని బరిలోకి దింపుతుంది అనేది ఉత్కంఠంగా మారింది. దానం నాగేందర్‌కే మళ్లీ టికెట్ ఇస్తారా? లేక ఆయనకు ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చి మంత్రివర్గంలోకి తీసుకుంటారా? అనే చర్చ కాంగ్రెస్‌లోనే కాదు.. ఖైరతాబాద్ రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. ఒకవేళ దానం కాకుండా మరో అభ్యర్థిని కాంగ్రెస్ ఎంపిక చేస్తే.. వారిలో రోహిన్‌రెడ్డి పేరు, పీజేఆర్ కుమార్తె విజయారెడ్డి పేరు, మాజీ మేయర్ విజయలక్ష్మి పేరు వంటి పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి.

అంటే కాంగ్రెస్‌కు ఈ ఉపఎన్నిక చాలా టఫ్ గా మారనుందని తెలుస్తుంది. అలాగే బీఆర్ఎస్ వైపు చూస్తే మన్నె గోవర్ధన్‌రెడ్డి పేరు మరోసారి వినిపిస్తోంది. అదే సమయంలో ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్‌రెడ్డి వంటి పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ కుమారుడి పేరు కూడా టికెట్ రేసులో వినిపిస్తోంది. బీజేపీ నుంచి మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డికి అవకాశం దక్కే అంశం చర్చలో ఉన్నా.. నియోజకవర్గంలోని పార్టీ బలాబలాలు కూడా ఈ పోరులో కీలకం కానున్నాయి.

అయితే ఖైరతాబాద్ ఫలితాన్ని కేవలం ఒకే సామాజిక వర్గం లెక్కలతో అంచనా వేయడం అంత సులభం కాదు. బస్తీల వారీగా ఉన్న స్థానిక పరిచయాలు, అభ్యర్థుల వ్యక్తిగత నెట్‌వర్క్, పార్టీకి ఉన్న సంస్థాగత బలం, స్థానిక సమస్యలు.. ఇవన్నీ కలిసి ఓటింగ్‌ను ప్రభావితం చేసే అంశాలుగా కనిపిస్తున్నాయి.. అన్నింటికంటే ముఖ్యంగా.. ఖైరతాబాద్‌లో పీజేఆర్ పేరు ఇప్పటికీ చేదిరిపోని గుర్తుగా ఉంది. బస్తీల్లో ఆయనతో ఉన్న పాత అనుబంధం, కుటుంబానికి ఉన్న పరిచయాలు.. ఉపఎన్నికలో ఏ మేరకు ప్రభావం చూపుతాయనేది కూడా ఆసక్తికరంగా మారింది.

అందుకే ఖైరతాబాద్ ఉపఎన్నికను జూబ్లీహిల్స్ ఉపఎన్నికతో పోల్చడం కంటే.. ఖైరతాబాద్‌కు ఉన్న ప్రత్యేక రాజకీయ చరిత్రను అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. దానం నాగేందర్‌కు ఇది కొత్త ఎన్నిక కాదు.. కానీ ఈసారి పరిస్థితులు మాత్రం కొత్తవి. ఒకవైపు అనర్హత వేటు, మరోవైపు సుప్రీంకోర్టు పరిణామం, ఇంకోవైపు కాంగ్రెస్ టికెట్‌పై అనిశ్చితి.. ఈ మూడు అంశాల మధ్య ఖైరతాబాద్ రాజకీయం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు ఖైరతాబాద్ నియోజకవర్గంలో బీజేపీ బలం తక్కువ. దాదాపు 60 వేల ముస్లిం ఓటర్లు ఉన్నారు కానీ MIM ప్రభావం కూడా తక్కువనే చెప్పాలి.. మొత్తానికి చరిత్రలో ఎన్నో మలుపులు చూసిన దానం నాగేందర్ రాజకీయ ప్రయాణానికి.. ఖైరతాబాద్ ఉపఎన్నిక మరో అధ్యాయంగా మారే పరిస్థితులు కనిపిస్తున్నాయి..

#Telangana#Hyderabad#Khairatabad#by-election#Danam Nagendar#congress#brs#bjp
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి