Spirituality

Spirituality: పరివర్తిని ఏకాదశి విశిష్టత గురించి తెలుసా?..

రచన: Venu6 నిమిషాల పఠనం

క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ తిథిన తన శయన స్థితిలో పరివర్తనం చెందుతాడని పురాణ సంప్రదాయంలో విశ్వాసం. అందుకే దీనికి పరివర్తిని ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు.

సనాతన ధర్మంలో ఏకాదశి తిథికి ఎంతో విశిష్టమైన స్థానం ఉంది. ప్రతి నెలలో శుక్ల, కృష్ణ పక్షాల్లో ఒక్కో ఏకాదశి చొప్పున సంవత్సరానికి మొత్తం 24 ఏకాదశులు వస్తాయి. ఒక్కో ఏకాదశి ఒక్కో ఆధ్యాత్మిక సందేశాన్ని, ప్రత్యేకమైన వ్రత విధానాన్ని, విశిష్టమైన ఫలితాన్ని కలిగి ఉంటుంది.

అలాంటి పవిత్రమైన ఏకాదశుల్లో భాద్రపద శుక్లపక్ష ఏకాదశిని పరివర్తిని ఏకాదశి అంటారు. దీనినే పద్మ ఏకాదశి, పార్శ్వ ఏకాదశి, జలఝూలని ఏకాదశి అనే పేర్లతో కూడా పిలుస్తారు. ఇక చాతుర్మాస కాలంలో క్షీరసాగరంలో యోగనిద్రలో ఉన్న శ్రీమహావిష్ణువు ఈ తిథిన తన శయన స్థితిలో పరివర్తనం చెందుతాడని పురాణ సంప్రదాయంలో విశ్వాసం. అందుకే దీనికి పరివర్తిని ఏకాదశి అనే పేరు వచ్చిందని చెబుతారు.

స్వామివారి ఈ పరివర్తనం కేవలం శయనంలో మార్పుగా మాత్రమే కాకుండా.. భక్తుడి జీవితంలోనూ అంతర్ముఖమైన మార్పునకు సంకేతంగా భావిస్తారు. ఈ పవిత్రమైన రోజున సూర్యోదయానికి ముందే మేల్కొని శుచిగా స్నానం చేసి, పరిశుభ్రమైన వస్త్రాలను ధరించాలి. నదీస్నానం సాధ్యమైతే చేయవచ్చు. అది సాధ్యం కానివారు స్నానం చేసే సమయంలో పవిత్ర నదులను స్మరించుకుంటూ సంకల్పం చేసుకొని స్నానాన్ని ఆచరించవచ్చని పండితులు చెబుతున్నారు.

అనంతరం పూజా మందిరాన్ని శుభ్రపరిచి, శ్రీలక్ష్మీనారాయణులను భక్తిశ్రద్ధలతో పూజించాలి. ఆవు నెయ్యితో దీపారాధన చేసి, ఏకాదశి వ్రతాన్ని శక్తికి తగిన విధంగా ఆచరిస్తానని సంకల్పం చేసుకోవాలి. ఇక శ్రీమహావిష్ణువుకు తులసి దళాలు అత్యంత ప్రీతికరమైనవిగా భావిస్తారు. అందుకే తులసి దళాలతో స్వామివారిని అర్చిస్తూ, ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని జపించవచ్చు. విష్ణు సహస్రనామ పారాయణం, భగవన్నామ స్మరణ, వ్రతకథ శ్రవణం లేదా పఠనం ఈ రోజున చేయడం విశేషంగా చెబుతారు.

అలాగే పంచామృతాలతో అభిషేకం చేయడం, పుష్పాలతో అలంకరించడం, సాత్విక నైవేద్యాన్ని సమర్పించడం, కర్పూర హారతి ఇవ్వడం వంటి పూజా విధానాలను ఆచరించవచ్చు. మరోవైపు ఏకాదశి వ్రతంలో ఉపవాసానికి కూడా ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. అయితే ప్రతి ఒక్కరి ఆరోగ్య పరిస్థితి ఒకేలా ఉండదు. కాబట్టి శక్తికి మించిన కఠిన ఉపవాసం చేయకుండా, ఆరోగ్య పరిస్థితికి అనుగుణంగా ఉపవాస విధానాన్ని ఎంచుకోవడం మంచిదని పేర్కొంటున్నారు.

ఈ రోజు కేవలం ఆహార నియమాలకే పరిమితం కాకుండా.. మనసును కూడా నియంత్రించుకోవాలి. కోపం, అసూయ, ద్వేషం, అహంకారం వంటి భావాలను దూరం చేసుకుని, భగవంతుని స్మరణలో గడపడం ఏకాదశి వ్రతానికి అసలైన ఆధ్యాత్మిక అర్థం అని పండితులు చెబుతున్నారు. అలాగే సాయంత్రం విష్ణు ఆలయానికి వెళ్లి శ్రీహరిని దర్శించుకోవచ్చు. తులసీమాలను లేదా తులసి దళాలను సమర్పించి భక్తితో ప్రార్థించవచ్చు.

మరోవైపు ఈ రోజున అన్నదానం, వస్త్రదానం వంటి సేవా కార్యక్రమాలు చేయడం శ్రేష్ఠమని ధార్మిక సంప్రదాయాలు చెబుతున్నాయి. మనకు చేతనైనంతలో ఆకలితో ఉన్నవారికి ఆహారం అందించడం, అవసరమైన వారికి సహాయం చేయడం.. భక్తిని సేవగా మార్చే మార్గం. ఏకాదశి మరుసటి రోజు ద్వాదశి తిథిన ఉదయం స్నానాదులు, పూజ పూర్తి చేసి, శ్రీలక్ష్మీనారాయణులకు నైవేద్యం సమర్పించిన అనంతరం సంప్రదాయం ప్రకారం భోజనం చేసి ఉపవాసాన్ని విరమిస్తారు.

పరివర్తిని ఏకాదశి వ్రతం గురించి పురాణ సంప్రదాయాల్లో శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించినట్లు కథనాలు ఉన్నాయి. ఈ వ్రతాన్ని భక్తిశ్రద్ధలతో ఆచరించడం వల్ల పాపక్షయం, సుఖసంపదలు, శాంతి, ఆధ్యాత్మిక పురోగతి, మోక్షప్రాప్తికి దారితీసే పుణ్యఫలం లభిస్తుందని విశ్వాసం. అయితే ఏకాదశి వ్రతం యొక్క అంతరార్థం శారీరక కోరికలు నియంత్రించడంతో పాటు మనసును పవిత్రం చేసుకోవడం.. భగవంతుని స్మరిస్తూ అహంకారాన్ని విడిచిపెట్టడం.. మనకు చేతనైనంతలో ధర్మాన్ని ఆచరించడం.. ఇదే ఏకాదశి వ్రతానికి నిజమైన స్ఫూర్తి.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది.

#Spirituality#Parivartini Ekadashi#Lord Sri Lakshmi Narayana#devotion#reverence
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి