TG: పేద ప్రజల ప్రాణాలు నిలిపే ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) అడ్డాగా ఓ ఉన్నతాధికారి సాగించిన అక్రమార్జన పర్వం తాజాగా బట్టబయలైంది. పేదల సేవ ముసుగులో అందినకాడికి దండుకుంటూ రూ.80 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులను కూడబెట్టిన నిమ్స్ అదనపు మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ నోరి లక్ష్మీ భాస్కర్‌పై ఏసీబీ అధికారులు ఉక్కుపాదం మోపారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు ఏకకాలంలో నిర్వహించిన మెరుపు దాడుల్లో బయటపడ్డ ఆస్తుల చిట్టా చూసి విచారణ అధికారులే అవాక్కయ్యారు.
లగ్జరీ కార్లు, గేటెడ్ కమ్యూనిటీలలో ఫ్లాట్లు
ఎర్రగడ్డలోని కల్పతరు అపార్ట్‌మెంట్‌లో ఉన్న లక్ష్మీ భాస్కర్ నివాసంతో పాటు ఆయన బంధువులు, బినామీలు, స్నేహితులకు చెందిన ఎనిమిది కీలక ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు జరిగాయి. ఈ తనిఖీల్లో విలాసవంతమైన హైరైజ్ గేటెడ్ కమ్యూనిటీలో ఒక 4-BHK ఫ్లాట్, కూకట్‌పల్లిలోని గేటెడ్ కమ్యూనిటీలో రెండు 3-BHK ఫ్లాట్లు, వీటితో పాటు మణికొండ, పేటబషీరాబాద్, కూకట్‌పల్లి పరిసరాల్లో మరో ఐదు 2-BHK ఫ్లాట్లకు సంబంధించిన డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అంటే హైదరాబాద్ నగరంలోనే ఏకంగా 8 లగ్జరీ ఫ్లాట్లను ఆయన కొనుగోలు చేసినట్లు గుర్తించారు.
భారీగా నగదు, బంగారం
ఫ్లాట్లే కాకుండా యాదాద్రి, నందిగామ, షామీర్‌పేట ప్రాంతాల్లో నాలుగు ఖాళీ ప్లాట్లతో పాటు విశాఖపట్నంలో అత్యంత ఖరీదైన ప్రాంతంలో 800 చదరపు గజాల స్థలాన్ని కొనుగోలు చేసినట్లు పత్రాలు లభ్యమయ్యాయి. సోదాల్లో రూ.35 లక్షల నగదు, సుమారు 518 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.41 లక్షల బ్యాంక్ బ్యాలెన్స్, పోస్టాఫీసులో రూ.12 లక్షలు, మ్యూచువల్ ఫండ్స్‌లో మరో రూ.29.5 లక్షల పెట్టుబడులు బయటపడ్డాయి. డాక్టర్ గ్యారేజీలో విలాసవంతమైన జాగ్వార్, ఆడి కార్లతో పాటు టాటా నెక్సాన్, రాయల్ ఎన్‌ఫీల్డ్, వెస్పా, యమహా వంటి లగ్జరీ వాహనాలు దర్శనమిచ్చాయి. ఇంట్లో రూ.5 లక్షల విలువైన ఎలక్ట్రానిక్ గాడ్జెట్లను సైతం అధికారులు గుర్తించారు. మొత్తం తనిఖీల్లో సుమారు రూ.80 కోట్లకు పైగా విలువైన స్థిర, చరాస్తులను గుర్తించి ఏసీబీ అధికారులే విస్తుపోయారని సమాచారం.
బయటపడ్డ అసలు బండారం
కేవలం స్థిరాస్తులే కాకుండా లక్ష్మీ భాస్కర్ అక్రమ డబ్బుతో ప్రైవేట్ ఫైనాన్స్ నడిపినట్లు అధికారులు ఆధారాలు సేకరించారు. డెబ్ట్ రికవరీ ట్రిబ్యునల్ వివాదంలో ఉన్న ఓ ఫ్లాట్ కొనుగోలు కోసం ఏకంగా రూ.1.30 కోట్లు పెట్టుబడి పెట్టడమే కాకుండా, పలువురు వ్యక్తులకు అధిక వడ్డీలకు దాదాపు రూ.1.33 కోట్లను చేతిబదులుగా ఇచ్చినట్లు గుర్తించారు. ప్రస్తుతం నిందితుడిపై కేసు నమోదు చేసి విచారణ ముమ్మరం చేశారు. ఇంకా బినామీల పేర్లతో మరిన్ని ఆస్తులు దాచినట్లు అనుమానిస్తున్న అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.







