Jupalli Krishna Rao: జూరాల ప్రాజెక్టు నుంచి నీటి విడుదల విషయంలో కొంతమంది చేస్తున్న హంగామా చూస్తుంటే రైతుల ప్రయోజనాల కంటే రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమన్నట్లుగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు మండిపడ్డారు. ఒక టీఎంసీ నీటిలో ఎంత ఆవిరి అవుతుంది? ప్రాజెక్టులో ఎంత నీరు అందుబాటులో ఉంది? ఇన్‌ఫ్లో ఎంత వస్తోంది? ఔట్‌ఫ్లో ఎంత ఉంది? కర్ణాటకలో వర్షపాతం, అక్కడి ప్రాజెక్టుల పరిస్థితి ఏమిటి? అనే వాస్తవాలను పరిశీలించకుండా మాట్లాడటం సరికాదని బీఆర్ఎస్ నాయకులకు ఆయన హితవు పలికారు.
రైతులను తప్పుదోవ పట్టించొద్దు
రైతులను కాపాడుకోవడమే తమ ప్రభుత్వ లక్ష్యం అని స్పష్టం చేశారు. కావాలంటే జూరాల నీటి లెక్కలను అధికారులతో కలిసి పరిశీలించి, వాస్తవాలు తెలుసుకోవాలని బీఆర్ఎస్ నాయకులకు సూచించారు. రైతులను తప్పుదోవ పట్టించేలా రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ఒక్క చుక్క నీరు కూడా పెరగదన్నారు. కర్ణాటక నుంచి వచ్చే నీటిపైనా వాస్తవ పరిస్థితులను ప్రజలకు చెప్పాలన్నారు.
రైతాంగానికి అన్యాయం చేయం
వర్షాలు, ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు, ఇన్‌ఫ్లో, విడుదల వంటి అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని నీటి నిర్వహణ చేయాల్సి ఉంటుందని వివరించారు. తెలంగాణ ప్రభుత్వం రైతాంగానికి అన్యాయం చేయడం లేదని మంత్రి జూపల్లి తేల్చి చెప్పారు. రైతుల పంటలను కాపాడేందుకు అందుబాటులో ఉన్న నీటిని ప్రణాళికాబద్ధంగా వినియోగించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు. రైతుల సమస్యలపై మాట్లాడటానికి ఎవరికీ అభ్యంతరం లేదన్న మంత్రి జూపల్లి.. నీటి లభ్యతపై వాస్తవాలు చెప్పకుండా హడావుడి చేయడం, రైతుల్లో ఆందోళన కలిగించడం బాధ్యతారాహిత్యం అని ధ్వజమెత్తారు.
రాజకీయాలు కాదు.. వాస్తవాలు ముఖ్యం
నీటి విషయంలో రాజకీయాలు కాదు.. వాస్తవాలు, లెక్కలు, శాస్త్రీయ విధానం ముఖ్యం అని స్పష్టం చేశారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని మంత్రి జూపల్లి సూచించారు. అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకుంటూ పంటలను కాపాడుకునేలా ప్రభుత్వం అవసరమైన సూచనలు, చర్యలు తీసుకుంటుందని తెలిపారు. రైతుల ప్రయోజనాల విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గదని, పంటలను కాపాడేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.










