Telangana Politics: హైదరాబాద్ శివార్లలో ఇప్పుడు ఏ మూల చూసినా కూల్చివేతలు, ఆక్రమణల రచ్చే కనిపిస్తోంది. చెరువులు, బఫర్ జోన్లు, ఎఫ్‌టీఎల్ పరిధులను కాపాడాలంటూ సామాన్యుల నిర్మాణాలపై దూసుకెళ్తున్న అధికారులు.. రాజకీయ పలుకుబడి ఉన్న బడా నేతల విలాస భవంతుల వద్దకు వచ్చేసరికి చేతులెత్తేస్తున్నారనే విమర్శలు తీవ్రస్థాయికి చేరాయి.
మొన్నటిదాకా గత పాలకుల ఫామ్‌హౌస్‌లను లక్ష్యంగా చేసుకుని గళమెత్తిన కాంగ్రెస్ శ్రేణులు, ఇప్పుడు తమ పార్టీ నేతలే చెరువులను ఆక్రమించి కట్టిన నిర్మాణాలపై బీఆర్‌ఎస్ బయటపెడుతున్న ఆధారాలతో డిఫెన్స్‌లో పడ్డాయి. నిన్న మీరు.. నేడు మేము అంటూ ఇరు పార్టీలు సాగిస్తున్న ఈ 'ఫాంహౌస్ యుద్ధం' వెనుక పచ్చని ప్రకృతి వనరులు బలైపోతున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
డ్రోన్ కెమెరాల సాక్షిగా బట్టబయలైన లీలలు
గత ప్రభుత్వ హయాంలో జీవో 111ను తుంగలో తొక్కి నిర్మించారంటూ జన్వాడ ఫాంహౌస్ మొదలుకొని పలు గులాబీ నేతల ఎస్టేట్లపై తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తాయి. అయితే పాలన మారినా తీరు మారలేదన్న రీతిలో, ప్రస్తుతం అధికార కాంగ్రెస్ కీలక నేతలు, మంత్రుల పరిధిలోని విలాసవంతమైన ఫాంహౌస్‌లు చెరువుల ఎఫ్‌టీఎల్, బఫర్ జోన్లను మింగేసి నిర్మించినవేనంటూ బీఆర్‌ఎస్ శ్రేణులు సరికొత్త డ్రోన్ విజువల్స్, వీడియోలతో విరుచుకుపడుతున్నాయి. చట్టం సామాన్యుడికో న్యాయం, పాలక వర్గానికో న్యాయం చెబుతోందా అంటూ ప్రశ్నిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో కఠిన చర్యలు ఎక్కడ
అధికారం ఎవరి చేతిలో ఉంటే వారు తమ ప్రత్యర్థుల అవినీతిని, అక్రమ నిర్మాణాలను బయటపెట్టి రాజకీయ మైలేజ్ పొందడానికే పరిమితమవుతున్నారు తప్ప, ప్రకృతి సంపదను కాపాడే చిత్తశుద్ధి ఎక్కడా కనిపించడం లేదు. సామాన్యుడు కష్టపడి వేసుకున్న చిన్న గూడును కూడా నోటీసులిచ్చి నేలమట్టం చేస్తున్న యంత్రాంగం.. వేల కోట్ల విలువైన ప్రకృతి వనరులను ఆక్రమించి విలాసవంతమైన భవనాలుగా మలచుకున్న రాజకీయ నేతల ఫాంహౌస్‌లపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ ప్రజలు, నెటిజన్లు నిలదీస్తున్నారు. పరస్పర విమర్శలతో కాలం గడపడం మానేసి, జన్వాడ అయినా సరే.. ప్రస్తుత మంత్రుల ఫాంహౌస్‌లైనా సరే, ఆక్రమణలను నిర్దాక్షిణ్యంగా తొలగించినప్పుడే ప్రజాపాలనపై నమ్మకం కుదురుతుందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి.








