TG: తెలంగాణలోని నిరుపేదలకు, ఆసరా కోసం ఎదురుచూస్తున్న అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం శుభవార్త చెప్పింది. రాష్ట్రంలో ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సరికొత్త పింఛన్ల పంపిణీకి కీలక ముహూర్తం ఫిక్స్ అయ్యింది. రాబోయే దసరా పండుగ వేళ పేదల ఇళ్లలో పండుగ వెలుగులు నింపేలా, అక్టోబర్ నెలలోనే కొత్త పెన్షన్లను నేరుగా లబ్ధిదారుల చేతుల్లో పెట్టేందుకు సర్కార్ సన్నాహాలు చేస్తుంది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క ఉన్నతాధికారులకు అత్యంత ఆదేశాలు జారీ చేశారు.
దసరా నాటికి ఖాతాల్లోకి డబ్బులు..
దసరా సందర్భంగా పండుగకు ముందే అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త పెన్షన్ సొమ్ము అందేలా ఏర్పాట్లు పూర్తి చేయాలని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. పెన్షన్ దరఖాస్తుల గ్రౌండ్ వెరిఫికేషన్ ప్రక్రియను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు. ఈ ప్రక్రియలో ఎలాంటి జాప్యానికి తావులేకుండా, అవసరమైతే అదనపు సిబ్బందిని సైతం రంగంలోకి దించాలని సెర్ప్ సీఈవో దివ్యా దేవరాజన్‌కు మంత్రి ఆదేశాలు ఇచ్చారు.
వితంతువులు, ఒంటరి మహిళలకు మొదటి ప్రాధాన్యం
సమాజంలో ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్న వితంతువులు, ఒంటరి మహిళల సమస్యలను ప్రభుత్వం ప్రత్యేకంగా పరిగణనలోకి తీసుకుంది. ఈ కేటగిరీల కింద దరఖాస్తు చేసుకున్న వారిలో ఒక్క అర్హురాలిని కూడా వదలకుండా వంద శాతం పింఛన్లను ఇవ్వాలని మంత్రి తేల్చిచెప్పారు. ప్రజాపాలనలో భాగంగా పింఛన్ల కోసం అప్లై చేసుకున్న అర్హులందరికీ న్యాయం చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. సాంకేతిక కారణాలు, సిబ్బంది కొరత పేరుతో లబ్ధిదారులను కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా, వెరిఫికేషన్ పనులను వేగవంతం చేసి పండుగ కానుకగా కొత్త పెన్షన్లు అందించేందుకు ప్రభుత్వం పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టింది.









