DJ Sound: పండుగలు, ఊరేగింపులు, పెళ్లిళ్లు.. సందర్భం ఏదైనా వినోదం హద్దులు దాటి ప్రాణాంతకంగా మారుతోంది. భక్తి, ఉత్సాహం ముసుగులో రోడ్లపైకి వస్తున్న భారీ డీజే బాక్సుల చప్పుళ్లు మనుషుల ప్రాణాలను నిలువునా బలితీసుకుంటున్నాయి. చెవులు చిల్లులు పడే శబ్దాలు, భూమి కంపించే బేస్ దరువుల తీవ్రతకు గుండెలు ఝల్లుమంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ మహానగరంతో పాటు తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన వేడుకలు, శోభాయాత్రల్లో డీజేల మోతలకు క్షణాల వ్యవధిలోనే కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన ఘటనలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి.
క్షణాల్లో రాలిపోతున్న ప్రాణాలు..
డీజేల ధాటికి సరదాగా గడపాల్సిన వేడుకల్లో తీవ్ర విషాదం అలుముకుంటోంది. ఇటీవలి కాలంలో చోటుచేసుకున్న ఘటనలే ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. హైదరాబాద్ రాంనగర్ క్రాస్ రోడ్స్ సమీపంలో ఊరేగింపులో భారీ డీజే మోతకు డ్యాన్స్ చేస్తూ 19 ఏళ్ల బీటెక్ విద్యార్థి అకస్మాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయాడు. పెద్ద శబ్దాల తీవ్రత వల్లే కార్డియాక్ అరెస్ట్ వచ్చిందని కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. అలాగే ఘట్‌కేసర్ ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న ఒక కానిస్టేబుల్ నిమజ్జన ఊరేగింపులో తీవ్రమైన శబ్దాల నడుమ డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో నేలకొరిగి ప్రాణాలు విడిచారు. మణికొండ - అల్కాపూర్ టౌన్‌షిప్‌లో నిమజ్జన వేడుకల్లో భారీ డీజే సౌండ్స్‌కు ఉత్సాహంగా డ్యాన్స్ చేస్తూ ఒక సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ గుండె ఆగి మృతిచెందాడు.
‘యాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో!’..
ఈ వరుస విషాదాల నేపథ్యంలో అధికార యంత్రాంగం ప్రజల్లో మార్పు తెచ్చేందుకు సరికొత్త పంథా ఎంచుకుంది. డీజేల వికృత మోతపై అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసులు వినూత్న ప్రయత్నం చేశారు. ‘ఇరుముడి’లోని ఓ పాపులర్ పాట శైలిలో ‘యాలాలో.. యాలాలో.. డీజేలు మనకొద్దురో...’ అంటూ రూపొందించిన ప్రత్యేక గీతం ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ఆకట్టుకుంటోంది. డీజేల భారీ శబ్దాలు రోగులు, వృద్ధులు, చిన్నారులపై చూపే ప్రభావంతో పాటు సడన్ కార్డియాక్ అరెస్టులకు ఎలా దారితీస్తున్నాయో ఈ పాట ద్వారా హృద్యంగా ఆలోచింపజేసేలా వివరించారు. కేవలం చట్టాలతోనే కాకుండా కళారూపాల ద్వారా ప్రజల్లో చైతన్యం తేవాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
హైదరాబాద్‌లో ఎందుకింత ముప్పు?
హైదరాబాద్‌లోని ఇరుకైన వీధులు, ఎత్తైన కాంక్రీట్ భవనాల మధ్య భారీ సౌండ్ బాక్సులను మోహరించినప్పుడు ఆ శబ్ద తరంగాలు గోడలకు తాకి ప్రతిధ్వనించి తీవ్రత రెట్టింపు అవుతుంది. సాధారణంగా మానవ వినికిడి సామర్థ్యం 60 నుంచి 70 డెసిబుల్స్ లోపే సురక్షితం. కానీ నగర వీధుల్లో ఏర్పాటు చేస్తున్న డీజేలు ఏకంగా 110 నుంచి 130 డెసిబుల్స్ దాటుతున్నాయి. దీంతో గుండె తీవ్ర ఒత్తిడికి గురై ‘సడన్ కార్డియాక్ అరెస్ట్’కు దారితీస్తుంది.
డీజేల విషయంలో పాటించాల్సిన కీలక జాగ్రత్తలు ఇవే..
నివాస ప్రాంతాల్లో రాత్రి వేళల్లో 45 డెసిబుల్స్, పగటి వేళల్లో 55 డెసిబుల్స్ మించకూడదు. ఈవెంట్లలోనూ శబ్దం 75 డెసిబుల్స్ లోపే ఉండాలి. భారీ స్పీకర్లు, బాస్ బాక్సులకు కనీసం 15 నుంచి 20 మీటర్ల దూరం పాటించాలి. బాక్సులకు అతుక్కుని ఎగరడం అత్యంత ప్రమాదకరం. అలాగే గుండె సమస్యలు, రక్తపోటు ఉన్నవారు, గర్భిణీలు, పసిపిల్లలు, వృద్ధులను డీజే ప్రాంతాలకు పూర్తిగా దూరంగా ఉంచాలి. సౌండ్ సిస్టమ్స్ ఆపరేటర్లు, ఊరేగింపుల్లో తప్పనిసరిగా ఉండాల్సిన వారు నాణ్యమైన ఇయర్‌ప్లగ్స్ ధరించడం అత్యంత సురక్షితం.
రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు బహిరంగ ప్రదేశాలలో లౌడ్ స్పీకర్లు, డీజేలను పూర్తిగా నిలిపివేయాలి. నిబంధనలు అతిక్రమించి డెసిబుల్ పరిమితులు దాటే ఆపరేటర్లపై కఠిన చట్టపరమైన కేసులు నమోదు చేసి, పరికరాలను తక్షణమే సీజ్ చేస్తామని పోలీసు అధికారులు చెబుతున్నారు. ఇప్పటికైనా ప్రజలు డీజేలతో వస్తున్న ముప్పును గుర్తించి సంతోష సమయాన్ని విషాదంగా మార్చుకోవద్దని అధికారులు పిలుపునిస్తున్నారు.










