ప్రజా సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగుల బుద్ధి దారి తప్పుతుంది. ప్రభుత్వ ఆఫీసుల్లో పైసల వేట సాగుతోంది.. లంచం ఇవ్వకపోతే కాగితం కదలదు.. చేయి తడపకపోతే పని జరగదు.. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాల్లో నెలకొన్న పరిస్థితి ఇదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు పౌర సేవాలయాలో.. లేక లంచాల నిలయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంటుంది.
రోజూ ఏదో ఒక మూల ఏసీబీ దాడులు జరుగుతూనే ఉన్నాయి.. లంచగొండి అధికారులు బుక్కవుతూనే ఉన్నారు. అయినా సరే, అధికారుల ఆకలి తీరడం లేదు.. ప్రజా ధనం పై ఆశ చావడం లేదు.. వ్యవస్థ అంతటా లంచాల వ్యాధి పాకిపోయిందనే దానికి రోజువారీగా దొరుకుతున్న ఈ లంచావతారులే ప్రత్యక్ష నిదర్శనం.. తాజాగా మంచిర్యాల జిల్లా భీమిని మండల తహసీల్దార్ కార్యాలయంలో జీపీవోగా పనిచేస్తున్న దుర్గాప్రసాద్ అనే అధికారి.. తన వద్దకు వచ్చిన ఒక పేద రైతును ఏ రకంగా వేధించాడో తెలిస్తే ముక్కున వేలేసుకోవాల్సిందే.
పెద్దంపేటకు చెందిన రైతు మహమ్మద్ ఫకీర్ తన పని కోసం అధికారుల చుట్టూ తిరిగాడు. కానీ, లంచం ఇస్తేనే పని జరుగుతుందని సదరు జీపీవో తెగేసి చెప్పాడు. ఒక కేసుకు సంబంధించి ఏకంగా 80 వేల రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. చెమటోడ్చి పండించే రైతు దగ్గర అంత పెద్ద మొత్తాన్ని నొక్కేసేందుకు వెనకాడలేదు. విసిగిపోయిన సదరు బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో.. లంచం డబ్బులు తీసుకుంటున్న జీపీవో దుర్గాప్రసాద్‌ను ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
ఇది ఒక్క జిల్లాకో.. లేక ఒక్క అధికారికో పరిమితమైన విషయం కాదు. రెవెన్యూ, రిజిస్ట్రేషన్, పంచాయతీరాజ్, మున్సిపాలిటీ.. ఇలా శాఖ ఏదైనా సరే, సామాన్యుడి రక్తాన్ని పిండేసే యంత్రాంగం తయారైంది. ఏసీబీ అధికారులు ప్రణాళికాబద్ధంగా దాడులు చేస్తూ, రోజుకో అధికారి భరతం పడుతున్నప్పటికీ కొందరిలో మార్పు రాకపోవడం శోచనీయం... కటకటాల వెనక్కి వెళ్తామనే భయం కూడా లేనంతగా అవినీతి వేళ్ళు ఊనుకుపోయింది.
ఏసీబీకి దొరికితే కొద్దిరోజులు సస్పెన్షన్, ఆ తర్వాత మళ్ళీ మామూలే అనే ధీమా కొందరు అధికారుల్లో బలంగా పాతుకుపోవడం వల్లే ఈ అవినీతి సామ్రాజ్యం విస్తరిస్తోందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చట్టాలు ఎంత కఠినంగా ఉన్నా.. అధికారుల్లో జవాబుదారీతనం, నైతిక విలువలు లోపించినంత కాలం ఈ లంచాలకు అడ్డుకట్ట పడదు.
అయితే లంచం డిమాండ్ చేసే అధికారులను ఎదిరించి, ఏసీబీని ఆశ్రయిస్తున్న బాధితుల ధైర్యమైన లంచగొండి వ్యవస్థకు భయం పుట్టిస్తుందనే ఆశ కొందరిలో పుడుతుంది. మరోవైపు ఇలాంటి వారి మీద ఇంకా కఠినమైన చట్టాలు చేయవలసిన అవసరం ఉందనే వాదన సైతం వినిపిస్తుంది.










