Eatala Rajendar: జూరాల ప్రాజెక్టులో నీళ్లు ఉన్నా సాగు కోసం రైతులకు నీరు ఇవ్వడం లేదని సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ద్వేషం, కోపం ఉంటే కేసీఆర్ పై తీర్చుకోవాలని రైతులపై కాదని హితవు పలికారు. రేవంత్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందని ఈటల విమర్శించారు. తెలంగాణలో కరెంటు కోతలు పెరిగిపోయాయని చెప్పారు. రాష్ట్రంలో 8, 9 గంటలు కూడా విద్యుత్ ఉండటం లేదన్నారు. కరెంట్ ట్రిప్ అవ్వడం వల్ల మోటార్లు కాలిపోయి రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఈటల వాపోయారు.
నీటి సరఫరాపై రేవంత్ రెడ్డికి అవగాహన లేదా.. లేకుంటే రైతులపై ద్వేషం ఉందా? అని ప్రశ్నించారు. పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఎలాంటి హక్కు లేని రాయలసీమకు మన ప్రాంతం నుంచి కృష్ణా జలాలు వెళ్తున్నాయని ఆయన ఆరోపించారు. పోతిరెడ్డి పాడు ద్వారా ఏపీ ప్రభుత్వం ప్రాజెక్టులు నింపుకుంటోందన్నారు. పోతిరెడ్డిపాడు ద్వారా రోజుకు 8 టీఎంసీల చొప్పున తరలిస్తున్నారని పేర్కొన్నారు.
సుమారు 300 టీఎంసీల నీటిని ఏపీ తరలించుకుపోతోందన్న ఈటల.. రేవంత్ రెడ్డి ఆంధ్రా సర్కార్ తో కలిసిపోయి తెలంగాణలో పంటలు ఎండబెడుతున్నారని ఆరోపించారు. ఎల్ నినో ప్రభావంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, సెప్టెంబర్ నెలలోనే పంటలు ఎండిపోతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.









