Cm Revanth: దళితులు, ఆదివాసీ, గిరిజనుల అభివృద్ధి లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సొంత తల్లిలా ప్రేమ చూపించిన ఇందిరమ్మను వారు ఇప్పటికీ మరిచిపోలేదని అన్నారు. 25 లక్షల ఎకరాలకు అసైన్డ్ పట్టాలు అందించిన ఘనత ఇందిరా గాంధీది అని తెలిపారు. ఇందిరా గాంధీ స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు రేవంత్ రెడ్డి. జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ కేటాయిస్తున్నామని వెల్లడించారు. ఈ వర్గాల కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తోందన్నారు.
ఇందిరమ్మ ఇండ్లల్లో 31 శాతం లబ్ధిదారులు దళితులే అని ముఖ్యమంత్రి రేవంత్ తెలిపారు. ఎస్టీలకు 17 శాతం ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేశామన్నారు. రాష్ట్రంలో 27.5 లక్షల మంది విద్యార్థులకు నర్సరీ నుంచి పన్నెండో తరగతి వరకు బ్రేక్ ఫాస్ట్ అందిస్తున్నామన్నారు. రాష్ట్రంలో 3 కోట్ల 48 లక్షల మందికి తెలంగాణలో సన్న బియ్యం అందిస్తున్నామని చెప్పారు. సన్న బియ్యంతో దళిత, గిరిజన వర్గాలకు మంచి భోజనం అందించగలుగుతున్నామని సీఎం అన్నారు.
దళితులు, గిరిజనులు, ఆదివాసీలను దృష్టిలో ఉంచుకుని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని రేవంత్ రెడ్డి వివరించారు. అత్యాచార ఘటనలపై ప్రభుత్వం మానవీయ కోణంలో స్పందిస్తోందన్నారు. బాధితుల నష్టపరిహారాన్ని బడ్జెట్ తో ముడిపెట్టకుండా గ్రీన్ ఛానెల్ లో విడుదల చేయాలని అధికారులను ఆదేశించారు సీఎం రేవంత్. చదువొక్కటే జీవితాలను మారుస్తుందని ఆయన స్పష్టం చేశారు. అట్టడుగు వర్గాలను చదువువైపు నడిపించకపోతే సమస్య పరిష్కారం కాదన్నారు. పిల్లల్ని చదువు వైపు, క్రీడలవైపు ప్రోత్సహించాలని సీఎం రేవంత్ సూచించారు. రాజకీయాలకి అతీతంగా ఈ వర్గాల అభివృద్ధి చేసుకుందామని పిలుపునిచ్చారు. ఈ ప్రభుత్వం మీది.. మీ కోసం పని చేస్తుంది అని ముఖ్యమంత్రి రేవంత్ అన్నారు.
సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన ఎస్సీ ఎస్టీ అట్రాసిటీస్ నిరోధక చట్టం 1989 అమలుపై ఉన్నత స్థాయి నిఘా, పర్యవేక్షణ కమిటీ సమావేశం జరిగింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2013 ఫిబ్రవరి 11న అప్పటి ముఖ్యమంత్రి అధ్యక్షతన చట్టం అమలుపై స్టేట్ లెవల్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం నిర్వమించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం రేవంత్ అధ్యక్షతన స్టేట్ లెవల్ హైపవర్ విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సమావేశం జరగడం ఇదే తొలిసారి. రాష్ట్రంలో చట్టం అమలు, నమోదైన కేసులు, దర్యాప్తు, విచారణ, కేసుల పరిష్కారం, బాధితులకు అందుతున్న సహాయం, పునరావాసంపై సమీక్షలో చర్చ జరిగింది. చట్టంపై అవగాహన కార్యక్రమాలు, కేసుల విచారణకు ఏర్పాటు చేసిన ప్రత్యేక కోర్టులు, మొబైల్ కోర్టుల పనితీరుపైనా చర్చించారు.








