Cm Revanth: ఉమ్మడి పాలమూరు జిల్లాలో సాగునీటి సమస్య పరిష్కారంపై సీఎం రేవంత్‌రెడ్డి దృష్టి సారించారు. ఇందులో భాగంగా కర్ణాటక సీఎం డీకే శివకుమార్ తో రేవంత్ రెడ్డి ఫోన్ లో మాట్లాడారు. జూరాల ప్రాజెక్టుకు 5 టీఎంసీల నీటిని విడుదల చేయాలని కర్ణాటక సీఎంను కోరారు. జిల్లాలో నెలకొన్న వర్షాభావ పరిస్థితులను ఆయనకు వివరించారు. జూరాల నుంచి సాగునీరు అందక ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి ఉందని తెలిపారు. రైతుల పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని 5 టీఎంసీల నీటిని జూరాలకు విడుదల చేయాలని రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేయగా.. కర్ణాటక సీఎం శివకుమార్ సానుకూలంగా స్పందించినట్లు సమాచారం.
మరోవైపు సీఎం రేవంత్ ఆదేశాలతో మంత్రులు జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేగా రెడ్డి, మధుసూదన్‌రెడ్డి బెంగళూరు వెళ్లారు. జూరాలకు నీరు ఇచ్చేందుకు సానుకూలంగా స్పందించినందుకు కర్ణాటక సీఎంకు వారు కృతజ్ఞతలు చెప్పనున్నారు. ఇక, 5 టీఎంసీల నీటిని ఒకేసారి కాకుండా విడతల వారీగా విడుదల చేయాలని కోరనున్నారు. బెంగళూరు వెళ్లడానికి ముందు సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని కలిసిన మంత్రులు, ఎమ్మెల్యేలు.. కర్ణాటక సీఎంతో చర్చించాల్సిన అంశాలపై మాట్లాడారు.








