తెలంగాణ

TG: అరెస్టులతో ప్రశ్నించే గొంతులను అణచలేరు : రాంచందర్‌ రావు

రచన: Mahesh4 నిమిషాల పఠనం

TG: "అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను రేవంత్ సర్కార్ ఎంతమాత్రం అణచివేయలేదు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయంటూ రోడ్డెక్కిన ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం ఆయన బయలుదేరగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పోలీసులు కాన్వాయ్‌ను అడ్డగించి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.

TG: "అరెస్టులు, పోలీసు నిర్బంధాలతో ప్రజా సమస్యలపై ప్రశ్నించే గొంతులను రేవంత్ సర్కార్ ఎంతమాత్రం అణచివేయలేదు" అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్‌రావు అన్నారు. జూరాల ప్రాజెక్టు కింద పంటలు ఎండిపోతున్నాయంటూ రోడ్డెక్కిన ఆయకట్టు రైతులకు సంఘీభావం తెలిపేందుకు మంగళవారం ఆయన బయలుదేరగా.. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల సమీపంలో పోలీసులు కాన్వాయ్‌ను అడ్డగించి ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు. ఈ పరిణామంతో జడ్చర్ల జాతీయ రహదారిపై ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది.

పోలీసులతో తోపులాట..

రాంచందర్‌రావును అదుపులోకి తీసుకుని పోలీస్ వాహనంలోకి ఎక్కిస్తుండగా పెద్ద సంఖ్యలో వచ్చిన బీజేపీ నాయకులు, కార్యకర్తలు అడ్డుకున్నారు. వాహనాలకు అడ్డంగా పడుకుని, ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. ఈ సందర్భంగా పోలీసులకు, కాషాయ పార్టీ నాయకుల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. నాయకులను వాహనాల్లో తరలించడంతో ఆగ్రహించిన కార్యకర్తలు హైదరాబాద్-బెంగళూరు 44వ నంబర్ జాతీయ రహదారిపై బైఠాయించి భారీ రాస్తారోకోకు దిగారు. దీంతో కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ పూర్తిగా స్తంభించింది.

రైతుల కన్నీళ్లు కనిపించడం లేదా: రాంచందర్‌రావు

ఈ సందర్భంగా రాంచందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. "జూరాల ప్రాజెక్టులో పుష్కలంగా నీరు ఉన్నప్పటికీ పాలకులు సాగునీరు విడుదల చేయకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారు. నీరందక వరి పొలాలు కళ్లముందే ఎండిపోతుంటే అన్నదాతలు కన్నీళ్లు పెడుతున్నారు. వారి కన్నీళ్లు తుడిచేందుకు వెళ్తుంటే ప్రతిపక్షాలపై పోలీసులను ఉసిగొల్పి అక్రమ నిర్బంధాలకు పాల్పడటం రేవంత్ రెడ్డి నిరంకుశ, అప్రజాస్వామిక పాలనకు పరాకాష్ట. సమస్యలను పరిష్కరించడం చేతగాక పోలీసుల మాటున దాక్కుంటున్నారు. ఎన్ని అక్రమ అరెస్టులు చేసినా రైతుల తరఫున బీజేపీ పోరాటం ఆగదు. పంటలు ఎండిపోకముందే జూరాల నుంచి వెంటనే సాగునీరు విడుదల చేయాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

#Telangana#TG Politics#N Ramchander Rao#BJP Telangana#Revanth Reddy#Telangana Government#swechaa news
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి