Jagadish Reddy: బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ భూములు చూసేందుకు వెళ్లిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందంపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ నేతల తీరుని ఆయన తీవ్రంగా తప్పుపట్టారు. అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్తిలోకి, ప్రైవేటు భూముల్లోకి వెళ్లకూడదనే విషయం మీకు తెలియదా? అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందాన్ని ఆయన ప్రశ్నించారు. చట్టాల ప్రకారం ప్రైవేటు వ్యక్తుల భూముల గురించో, ఆస్తుల గురించో విచారించే హక్కు మీకు ఉంటుందా? అని నిలదీశారు.
భూముల విషయంలో ఏవైనా తేడాలు ఉంటే అధికారులు నివేదిక ఇస్తారని తెలిపారు. విచారణ చేయాల్సిన బాధ్యత అధికారులది మీది కాదు అని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం 5 రోజులు డ్రామాలు చేసిందని విమర్శించారు. ఇంతా చేసి మీరు సాధించింది ఏంటి? అని జగదీశ్ రెడ్డి ప్రశ్నించారు.
''సీఎం రేవంత్ రెడ్డి నిబంధనలకు తూట్లు పొడిచారు. అసెంబ్లీ సాక్షిగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించారు. కృష్ణా, గోదావరి జలాలను రైతాంగానికి అందించడంలో ప్రభుత్వం విఫలమైంది. పక్కా పథకం ప్రకారం కుట్రపూరితంగా పంటలు పండకుండా చేస్తున్నారు. దీని నుంచి ప్రజలను పక్కదారి పట్టించేందుకు పూర్తి చట్ట వ్యతిరేకమైన కార్యక్రమాలకు ప్రభుత్వం తెరలేపింది.
మా ఆస్తుల వివరాలు శాసనసభకు ఇచ్చాము. ఎన్నికల అఫిడవిట్లలో ఉన్నాయి. కేసీఆర్, కేటీఆర్, హరీశ్ రావు, నా ఆస్తుల వివరాలు ముందే వెల్లడించాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఎక్కువ హడావిడి చేస్తున్నారు. నేరస్తులు ఏ విధంగా ప్లాన్ చేసుకుని పథకం ప్రకారం దాడులు చేస్తారో అచ్చం అలాగే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ లపై దాడి చేశారు.
అనుమతి లేకుండా ప్రైవేటు ఆస్తిలోకి వెళ్లకూడదనే విషయం మీకు తెలియదా? అనుమతి లేకుండా ఒకరి ఇంటికి వెళ్లకూడదనే సంగతి మీకు తెలియదా? మీ ఇళ్లలోకి కూడా ఎవరైనా అలానే వస్తే మీరు అనుమతి ఇస్తారా? మీ అందరికీ రవాణ ఖర్చులు భరించింది ఎవరు? ప్రభుత్వమా? పార్టీయా? భట్టి విక్రమార్క ఏర్పాటు చేశారా? మీ వెనకాల సీఎం ఉన్నారా? ఎవరి ప్రోద్బలంతో బీఆర్ఎస్ నేతల ఫాంహౌస్ ల దగ్గరికి వెళ్లారు? ఇందులో ప్రభుత్వ ఖర్చు ఎంత? ప్రజలకు ఇవన్నీ చెప్పాలి'' అని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందాన్ని జగదీశ్ రెడ్డి డిమాండ్ చేశారు.












