Rain Alert : బంగాళాఖాతంలో బలపడిన వాయుగుండం తెలంగాణ వైపు వేగంగా దూసుకొస్తుండటంతో రాష్ట్రవ్యాప్తంగా వర్ష బీభత్సం మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఇప్పటికే ముసురు పట్టిన వాతావరణం రానున్న 48 గంటల్లో మరింత ఉగ్రరూపం దాల్చనుందని చెబుతున్నారు. ముఖ్యంగా రాబోయే 12 గంటల వ్యవధి అత్యంత కీలకమని, ఇది తీవ్ర వాయుగుండంగా మారి నేలపై తీవ్ర ప్రభావం చూపనుందని తెలుస్తోంది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
ఆ 8 జిల్లాల్లో హై అలర్ట్
ఈ వాతావరణ మార్పులతో ప్రధానంగా 8 జిల్లాల ప్రజల గుండెల్లో గుబులు మొదలైంది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్‌తో పాటు ఉమ్మడి వరంగల్ పరిధిలోని ప్రాంతాల్లో కుండపోత వర్షాలు ముంచెత్తే ప్రమాదం పొంచి ఉందని వాతావరణ అధికారులు చెబుతున్నారు. పరిస్థితి తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు, వాగులు - వంకల పరిసరాల్లో ఉండేవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలని స్పష్టం చేస్తున్నారు.
మొత్తం 20 జిల్లాలపై వర్ష ప్రభావం..
ఒక్క ఆరెంజ్ అలర్ట్ జిల్లాలే కాకుండా, రాష్ట్రంలోని మరో 20 జిల్లాల్లోనూ వర్షాలు దంచికొట్టే సూచనలున్నాయని అన్నారు. మంగళ, బుధవారాల్లో మొదలయ్యే ఈ వానల ఉధృతి బుధ, గురువారాల్లో పీక్స్‌కు చేరనుందని అంచనా వేస్తున్నారు. పలుచోట్ల అత్యంత భారీ వర్షపాతం నమోదై జనజీవనం స్తంభించిపోయే ముప్పు కూడా ఉందని చెబుతున్నారు. ఈ సమయాల్లో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకు రావద్దని, ప్రయాణాలను వాయిదా వేసుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు.











