MGM Hospital: వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో వరుస ప్రమాదాలు పేషంట్లను, వారి సహాయకులను, అక్కడ పని చేసే సిబ్బందిని తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి. ఇటీవల ఆరోగ్యశ్రీ వార్డులో సీలింగ్ స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డ ఘటన మరువక ముందే మరో ప్రమాదం చోటు చేసుకంది. RICU, ఫిజియోథెరపీ విభాగాల్లో శ్లాబ్ పైకప్పు పెచ్చులు ఒక్కసారిగా ఊడిపడ్డాయి. దీంతో కలకలం రేగింది. ఈ ఘటనలో పలువురు రోగులు, వారి వెంట ఉన్న సహాయకులకు గాయాలైనట్లు తెలుస్తోంది. ఆసుపత్రి సిబ్బంది వెంటనే వారిని మరో వార్డుకు తరలించి చికిత్స అందిస్తున్నట్లు సమాచారం.
ఆందోళనకు గురి చేస్తున్న వరుస ప్రమాదాలు
కాగా తరచూ పెచ్చులు ఊడిపడి ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని పేషంట్లు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు. ఆసుపత్రిలో శిథిలావస్థకు చేరిన ప్రాంతాలను గుర్తించి వెంటనే మరమ్మత్తులు చేపట్టాలని రోగులు, వారి బంధువులు అధికార యంత్రాంగాన్ని డిమాండ్ చేస్తున్నారు.
మీడియాకు నో ఎంట్రీ
మరోవైపు మీడియాను ఆసుపత్రిలోకి అనుమతించడం లేదు. మెయిన్ గేటు దగ్గర భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆసుపత్రి వద్ద మీడియాపై ఆంక్షలు కొనసాగుతున్నాయి. మెయిన్ గేటు వద్దే తనిఖీలు చేస్తున్నారు. ఓపీ స్లిప్పులు, ఇతర డాక్యుమెంట్లు చూపిస్తేనే రోగులు, వారి సాయం కోసం వచ్చిన వ్యక్తులను లోనికి అనుమతిస్తున్నారు. ఇతరులకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు.
వైద్యం కోసం వస్తే ప్రాణాల మీదికొస్తోందని ఆవేదన
వరంగల్ ఎంజీఎం హాస్పిటల్‌లో ఆదివారం ఆరోగ్యశ్రీ వార్డులో స్లాబ్ పెచ్చులు ఊడిపడ్డాయి. ఈ ఘటనలో పలువురికి గాయలయ్యాయి. గాయపడిన వారిలో అక్కడ చికిత్స పొందుతున్న రోగులు, వారి సహాయకులు ఉన్నారు. ఇది మర్చిపోకముందే మరోసారి పైకప్పు పెచ్చులు ఊడిపడటం ఆందోళనకు గురి చేస్తోంది. ఈ వరుస ప్రమాదాలు ఎంజీఎం ఆసుపత్రిలోని రోగులకు నిద్ర లేకుండా చేస్తున్నాయి.
వైద్యం కోసం ఎంజీఎంకు వస్తే తమ ప్రాణాల మీదకు వస్తోందని రోగులు వాపోతున్నారు. ఎప్పుడు ఎలాంటి ప్రమాదం జరుగుతుందోనని, ఏ పెచ్చు ఊడి తమ మీద పడుతుందోనని కంగారు పడుతున్నారు. తమ భద్రతపై తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎన్ని ప్రమాదాలు జరుగుతున్నా అధికారుల్లో మార్పు లేదని, వారు తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పేషంట్లు మండిపడుతున్నారు.
శిథిలావస్థకు చేరిన భవనం, వసతుల లేమి
నిరుపేద రోగులకు ఆరోగ్య ప్రదాయినిగా గుర్తింపు పొందిన వరంగల్ ఎంజీఎం ఆసుపత్రి ప్రస్తుతం సమస్యలకు నిలయంగా మారింది. ఆసుపత్రిలో సరైన వసతులు లేవు. నిత్యం అనేక సమస్యలతో అస్తవ్యస్తంగా మారింది. ఆసుపత్రి భవనం నిర్వహణపై అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాగా, పాత భవనం కావడం, పైకప్పు నుంచి నీరు లీక్ అవ్వడం వల్లే స్లాబ్ పెచ్చులు ఊడిపడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. శిథిలావస్థకు చేరిన భవనం, భద్రతా లోపాలు, కనీస వసతుల లేమితో రోగులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా అధికార యంత్రాంగం స్పందించి సమస్యలను పరిష్కరించాలని వేడుకుంటున్నారు.









