Telangana BJP: రాష్ట్రంలో అధికారం మాదేనంటూ గల్లీ నుంచి ఢిల్లీ దాకా ప్రచారం చేసుకుంటున్న బీజేపీ పార్టీ పరిస్థితి మెదక్ జిల్లాలో మాత్రం విడ్డూరంగా మారింది. రెండు నియోజకవర్గాలు.. పది గ్రూపులు అన్న చందంగా మారిన కాషాయ దళంలో ఆధిపత్య పోరు పరాకాష్టకు చేరినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది.
ఒకే నియోజకవర్గంలో, అదీ ఒకే ఊళ్లో ఒకే పార్టీకి ఏకంగా రెండు ఆఫీస్‌లు వెలవడం ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. నర్సాపూర్ కేంద్రంగా జరుగుతున్న ఈ వర్గ పోరు పార్టీ కేడర్‌ను నవ్వులపాలు చేస్తుండగా, అధిష్ఠానం మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఒకరి మొహం ఒకరు చూసుకోలేక.. పోటీ ఆఫీసులు
మెదక్ జిల్లా బీజేపీ అధ్యక్షుడిగా నర్సాపూర్ నియోజకవర్గానికి చెందిన వాల్దాస్ మల్లేష్ గౌడ్‌ను నియమించిన నాటి నుంచే అసలు వివాదం స్టార్ట్ అయ్యిందని అంటున్నారు. ఆయన నియామకాన్ని స్థానిక సీనియర్ నేత మురళీ యాదవ్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు సమాచారం. మల్లేష్ గౌడ్ నాయకత్వంలో పనిచేయడం ఇష్టం లేక పార్టీ కార్యక్రమాలకు మురళీ యాదవ్ దూరంగా ఉంటూ వచ్చారు. జిల్లా అధ్యక్షుడైన మల్లేష్ గౌడ్ సైతం "వస్తే రండి.. లేకపోతే పొండి" అన్న రీతిలో వ్యవహరించడంతో ఇద్దరి మధ్య కోల్డ్ వార్ మరింత ముదిరిందని చెబుతున్నారు.
అసెంబ్లీ ఆఫీస్ వర్సెస్ మున్సిపల్ ఆఫీస్
జిల్లా అధ్యక్షుడు మల్లేష్ గౌడ్ ఇప్పటికే నర్సాపూర్‌లో నియోజకవర్గ స్థాయి పార్టీ కార్యాలయాన్ని నడుపుతున్నారు. అయితే, అందులోకి అడుగుపెట్టడం ఇష్టం లేని మురళీ యాదవ్.. దానికి పోటీగా అదే నర్సాపూర్ పట్టణంలో ‘బీజేపీ మున్సిపల్ కార్యాలయం’ పేరుతో సరికొత్త ఆఫీసును స్టార్ట్ చేశారు. ఒకే ఊళ్లో రెండు ఆఫీసులు వెలవడంతో స్థానిక ప్రజలు, ప్రత్యర్థి పార్టీల నాయకులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఎటు వెళ్లాలో తెలియక కార్యకర్తల అయోమయం
నేతల వ్యక్తిగత ఈగోల మధ్య సామాన్య కార్యకర్తలు నలిగిపోతున్నారు. ఒక నేత పిలిచిన కార్యక్రమానికి వెళ్తే రెండో నేత ఆగ్రహానికి గురికావాల్సి వస్తోందని స్థానిక కేడర్ భయపడుతోంది. చివరకు ఎవరి గ్రూపులోనూ ఇరుక్కోవడం ఇష్టం లేక పలువురు క్రియాశీల కార్యకర్తలు అసలు పార్టీ కార్యక్రమాలకే రావడం మానేస్తున్నారని తెలుస్తుంది.
ఇక్కడ గమనార్హం ఏమిటంటే.. నియోజకవర్గంలో పార్టీని నడిపిస్తున్నామని చెప్పుకుంటున్న ఈ ఇద్దరు ముఖ్య నాయకులూ గతంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీలోకి వచ్చినవారే కావడం గమనార్హం. పాత అలవాట్లతో ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించుకోవడానికే ప్రాధాన్యమిస్తున్నారు తప్ప, పార్టీ బలోపేతాన్ని గాలికొదిలేశారన్న ఆగ్రహం క్షేత్రస్థాయిలో సామాన్య కార్యకర్తల నుంచి వ్యక్తమవుతోంది.
మున్సిపల్ ఎన్నికల ఊరటైనా నిలబడేనా
గత మున్సిపల్, పంచాయతీ ఎన్నికల్లో జిల్లా వ్యాప్తంగా బీజేపీ ఘోరంగా డీలా పడింది. మెదక్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. కేవలం నర్సాపూర్ మున్సిపాలిటీలో హంగ్ ఏర్పడటంతో విచిత్రంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి వైస్ ఛైర్మన్ పదవిని దక్కించుకుంది.
జిల్లాలో పార్టీకి దక్కిన ఏకైక ఊరట ఇదే అయినప్పటికీ, ఆ గెలుపును కొనసాగించడంలో నాయకత్వం ఘోరంగా ఫెయిల్ అయ్యిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి .
దాదాపు ఇదే తరహా అంతర్గత కుమ్ములాటలు మెదక్ అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. నియోజకవర్గ స్థాయిలో పార్టీ కార్యాలయాలనే పంచుకునే స్థాయికి గ్రూపు రాజకీయాలు దిగజారడంపై కేడర్ తీవ్ర అసంతృప్తితో ఉంది.
అధిష్ఠానం తక్షణమే జోక్యం చేసుకుని ఈ వర్గపోరుకు అడ్డుకట్ట వేయకపోతే, మెదక్ జిల్లాలో పార్టీ మరింత నామరూపాలు లేకుండా పోయే ప్రమాదం పొంచి ఉందని రాజకీయ విశ్లేషకులు











