ఆదిలాబాద్ జిల్లా రిమ్స్ ఆస్పత్రిలోని పీడియాట్రిక్ వార్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా చోటుచేసుకున్న అగ్నిప్రమాదంలో ముగ్గురు పసిపాపలు ప్రాణాలు కోల్పోవడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర దిగ్భ్రాంతి, విచారం వ్యక్తం చేశారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన, అస్వస్థతకు గురైన మరో 23 మంది పసిపిల్లలకు ప్రభుత్వం తక్షణమే అత్యుత్తమ వైద్య సేవలుందించి వారి ప్రాణాలను కాపాడాలని సామాజిక మాధ్యమం ద్వారా విజ్ఞప్తి చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, ఘోర వైఫల్యం వల్లే ఈ దుర్ఘటన జరిగి అభంశుభం తెలియని పసికందులు అన్యాయంగా బలయ్యారని కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రేవంత్ రెడ్డి ప్రభుత్వ వైద్య రంగాన్ని పూర్తిగా విస్మరించి విధ్వంసం చేశారని మండిపడ్డారు. ప్రభుత్వ ఆస్పత్రుల పర్యవేక్షణను గాలికి వదిలేయడం వల్లే ఇలాంటి వరుస ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయన్నారు. ఈ దారుణ సంఘటనకు సీఎం రేవంత్ రెడ్డే పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
రిమ్స్ ఆస్పత్రిలో కనీస నిర్వహణ లోపించిందని, అత్యవసర విభాగాల్లో కనీస సదుపాయాలు లేవని బీఆర్‌ఎస్ జిల్లా నాయకులు గతంలోనే అనేకసార్లు హెచ్చరించినప్పటికీ రేవంత్ సర్కారు మొద్దునిద్రలో ఉందని కేటీఆర్ విమర్శించారు. అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పకడ్బందీ భద్రతా చర్యలు తీసుకోవాల్సిన చిన్నపిల్లల ఐసీయూ వార్డులో ప్రభుత్వ పర్యవేక్షణ పూర్తిగా కొరవడటం వల్లే ఈ విషాదం జరిగిందని పేర్కొన్నారు.
తక్షణమే ఆదిలాబాద్ రిమ్స్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లోని పీడియాట్రిక్ వార్డులు, ఐసీయూలను నిపుణులతో తనిఖీ చేయించి ఫైర్ అండ్ ఎలక్ట్రికల్ సేఫ్టీ చర్యలు చేపట్టాలని సూచించారు. కాంగ్రెస్ సర్కారు చేతకానితనం వల్ల తమ పసిపిల్లలను కోల్పోయిన బాధిత కుటుంబాలకు బీఆర్‌ఎస్ పక్షాన రూ.25లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించి తక్షణమే ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.








