హైదరాబాద్‌లో ఇటీవల జరిగిన గణేశ్ నిమజ్జన శోభాయాత్రలో ఓ డ్యాన్స్ గ్రూప్ చేసిన విన్యాసం తీవ్ర వివాదాస్పదమైంది. విశాఖపట్నానికి చెందిన ఒక డ్యాన్స్ బృందం నిమజ్జన వేడుకల్లో భాగంగా ప్రదర్శన ఇచ్చింది. అయితే, తమ పెర్ఫార్మెన్స్‌లో ప్రత్యేకత ఉండాలని భావించిన సదరు గ్రూప్‌లోని ఒక యువతి, ప్రాణాపాయాన్ని సైతం లెక్కచేయకుండా నిజమైన కొండచిలువతో డ్యాన్స్ చేసి అందరినీ విస్మయానికి గురిచేసింది.
మహిళా డ్యాన్సర్ తన మెడలో భారీ ఇండియన్ రాక్ పైథాన్ (కొండచిలువ) వేసుకుని రోడ్డుపై స్టెప్పులు వేసింది. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వ్యాపించడంతో పాటు వన్యప్రాణి సంరక్షణ అధికారుల దృష్టికి వెళ్లాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టాల ఉల్లంఘనగా పరిగణించిన జీహెచ్‌ఎస్‌పీసీఏ(GHSPCA) బృందం ఈ ఘటనపై తక్షణమే స్పందించింది. డ్యాన్స్ గ్రూప్ ఉనికిని కనిపెట్టేందుకు అధికారులు ఐదు రోజుల పాటు నిరంతరం వారి కదలికలను ట్రాక్ చేశారు. చివరకు మధురానగర్ పోలీసుల సహకారంతో సదరు డ్యాన్స్ బృందాన్ని విజయవంతంగా అదుపులోకి తీసుకున్నారు.
వారి వద్ద ఉన్న ప్రమాదకర ఇండియన్ రాక్ పైథాన్‌ను సురక్షితంగా రక్షించి స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, కొండచిలువకు ఆహారంగా ఇచ్చేందుకు ఆ బృందం తెచ్చుకున్న ఒక కోడిని కూడా అధికారులు రక్షించారు. వన్యప్రాణులను వినోదం కోసం దుర్వినియోగం చేయడం, ప్రజల ప్రాణాలను ప్రమాదంలో పడేయడంపై మధురానగర్ పోలీసులు కేసు నమోదు చేసి తదుపరి చట్టపరమైన దర్యాప్తు జరుపుతున్నారు.

వన్యప్రాణి సంరక్షణ చట్టం-1972 (Wildlife Protection Act, 1972) ప్రకారం ఇండియన్ రాక్ పైథాన్ (కొండచిలువ) షెడ్యూల్-1 కింద అత్యంత రక్షణ పొందిన జాతికి చెందినది. ఈ చట్టం ప్రకారం కొండచిలువ వంటి సంరక్షిత వన్యప్రాణులను బంధించడం, చంపడం, వినోదం కోసం ఉపయోగించడం లేదా ప్రదర్శించడం తీవ్రమైన చట్టరీత్యా నేరంగా పరిగణిస్తారు. అనుమతి లేకుండా వన్యప్రాణులను అక్రమంగా వద్ద ఉంచుకోవడం లేదా ప్రదర్శనల కోసం వాడటం వల్ల 3 నుంచి 7 సంవత్సరాల వరకు జైలు శిక్షతో పాటు రూ.10వేల కంటే ఎక్కువ జరిమానా పడే అవకాశం ఉంది.








