స్వేచ్ఛ ఛైర్మన్ డెస్క్

OutdoorMediaMafia: ఔట్ డోర్ మీడియా.. అదో పెద్ద మాఫియా?

రచన: Swechaanews Chairman16 నిమిషాల పఠనం

మిథున యాడ్ ఏజెన్సీకి చెందిన మహిళను కాంగ్రెస్ నేత లైగింక వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించారు. నిజానికి ఆమెకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. కానీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్, ఆ తర్వాత విడుదలైన వీడియోతో కన్ఫ్యూజన్ చేసింది. అందరూ మంచి వాళ్లే అంటూ ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చింది. ఆమె మనోభావాలను దెబ్బతీసిన, వేధింపులకు గురి చేసిన వారికి శిక్ష పడాలి.

  • ప్రభుత్వానికి దమ్మిడి ఆదాయం రాదు?

  • వందల కోట్ల ట్యాక్స్ ఎగ్గొట్టి వేల కోట్లు సంపాదించిన ఏజెన్సీలు?

  • ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలను కాకా పట్టడమే వీళ్ల పని?

  • అసోసియేషన్ పేరుతో దందాలు.. అసెంబ్లీ ముట్టడికి 2 కోట్ల వసూళ్ల పర్వం

  • అందరూ దొంగలే.. ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకున్నట్లు నటన?

  • కొత్త పాలసీ వచ్చినా అమలుకు నోచుకొని వైనం?

  • అందినకాడికి దోచుకునేందుకు కక్కుర్తిలో పొలిటీషన్స్?

  • లీడ్ స్పేస్ బినామీ నవీన్ కుమార్‌కు ట్రాఫిక్ అంబరిల్లాపై రూ.60 కోట్ల ట్యాక్స్ పెండింగ్?

  • 56 వేలు ఇచ్చేందుకు టెండర్స్‌లో రెడీ అయినా.. 26 వేలకే దక్కించుకున్న తీరు?

  • 600 అంబరిల్లాలకు అనుమతి 2,700 వేసినట్లు గుర్తింపు?

  • 3 ఏండ్లలో కట్టాల్సిన ట్యాక్స్ అధికారికంగా రూ.60 కోట్లకు పైనే?

  • ఎల్ అండ్ టీ మాటున లీడ్ స్పేస్ రూ.150 కోట్ల టోకరా?

  • వాళ్లు ఇవ్వరు.. ఎల్ అండ్ టీ ప్రభుత్వానికి చెల్లించదు.. అదో పెద్ద డ్రామా?

  • ట్యాక్స్ కట్టినట్లు యాక్ట్ చేస్తున్న ప్రకాశ్ ఆర్ట్స్, మెట్రో ట్రాకులకే హోల్స్ వేసి బోర్డుల దందా?

  • కొత్తగా మల్టీ పార్కింగ్ పేరుతో ఎల్ఈడీలు వేసిన నవ నిర్మాణ్?

  • యాడ్స్ ఏవైనా ట్యాక్స్‌లు చెల్లించరు?.. వాళ్లు తీసుకోరు

  • లేడీ ఎంటర్ ప్రెన్యూర్‌పై లైంగిక వేధింపులతో అసలు దందా ఏంటో స్వేచ్ఛ న్యూస్ ఇన్వెస్టిగేషన్ కథనం

దేవేందర్ రెడ్డి చింతకుంట్ల,

9848070809,

స్వేచ్చ న్యూస్ చైర్మన్.

వేలల్లో ఉండే ఇంటి ట్యాక్స్ కట్టకుంటే ఇజ్జత్ తీసే జీహెచ్ఎంసీ.. వందల కోట్లు ఎగ్గొట్టినా గప్‌చుప్

మిథున యాడ్ ఏజెన్సీకి చెందిన మహిళను కాంగ్రెస్ నేత లైగింక వేధింపులకు గురి చేశారని బాధితురాలు ఆరోపించారు. నిజానికి ఆమెకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి. కానీ ట్విట్టర్ వేదికగా పెట్టిన పోస్ట్, ఆ తర్వాత విడుదలైన వీడియోతో కన్ఫ్యూజన్ చేసింది. అందరూ మంచి వాళ్లే అంటూ ప్రతిపక్షాలకు ఆయుధం ఇచ్చింది. ఆమె మనోభావాలను దెబ్బతీసిన, వేధింపులకు గురి చేసిన వారికి శిక్ష పడాలి. కానీ, ఆ పేరుతో సోషల్ మీడియాలో బ్లేమ్ చేయడం ఎవరికీ మంచిది కాదు. అలా అని పేరు చెప్పకపోవడంతో అనేక మంది ఎన్నో రకాలుగా ఊహించుకుంటున్నారు. అసలు ఈ మాఫియా ఎందుకు ఇలా తయారైందో స్వేచ్ఛ న్యూస్ చైర్మన్ దేవేందర్ రెడ్డి గత 4 ఏండ్లుగా వార్తలు రాస్తూనే ఉన్నారు.

బీఆర్ఎస్ హయాంలో లీడ్ స్పేస్, ప్రకాశ్ ఆర్ట్స్ వందల కోట్లు లాభపడ్డాయి, జీవో నంబర్ 68ని తీసుకొచ్చి 150కి పైగా ఉన్న చిన్న చిన్న మీడియాలకు దెబ్బ వేశారు. దీంతో అక్రమంగా హోర్డింగ్స్ వెలిశాయి. ఎల్ అండ్ టీతో ఒప్పందం చేసుకుని మొత్తం మెట్రోనే కైవసం చేసుకున్న లీడ్ స్పేస్ రూ.1,500 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. ప్రభుత్వం నుంచి అడ్వటైజింగ్‌లు తీసుకుని ఆనాటి మంత్రికి రూ.2కోట్ల కారు కొనిచ్చింది. బోర్డులు వేయకుండానే పెద్ద ఎత్తున ఐ అండ్ పీఆర్ యాడ్స్‌ని కొట్టేసింది. దీనిపై ఆనాడే వార్తలు ఇచ్చాం. ప్రకాశ్ ఆర్ట్స్ , యాడ్ వేస్ ఎక్కడెక్కడ ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేసి వాటిపై నెలకు ఎంత సంపాదిస్తున్నారు. ట్యాక్స్ ఎంత కడుతున్నారో ఆర్టీఐల ద్వారా సమాచారం సేకరించి వార్తలు ఇచ్చాం.

చెల్లించాల్సిన ట్యాక్స్ ని తీసుకోకుండా, ఎల్ అండ్ టీ నుంచి రాబట్టలేకుండా, జీవో ఉల్లంఘన పేరుతో చిన్న , పెద్ద ఏజెన్సీలకు వందల కోట్ల ఫైన్ జీహెచ్ఎంసీ విధించింది. దీనిపై కోర్టుకు కొంతమంది వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇలాంటి దోపిడీకి అలవాటు పడ్డ ఏజెన్సీలు ఔట్ డోర్ మీడియాపై ప్రభుత్వం మారగానే మరో దందాకు తెరలేపారు. కొత్త పాలసీ తీసుకొస్తే వద్దని కొన్ని రోజులు, కోర్టులో కేసులు వేసి అడ్డుకున్నారు. నగర శివార్లలో, కొత్త రోడ్డు వేసినా, లేదా ఎక్కడ బోర్డు పెట్టేందుకు అవకాశం దొరికినా ఎలాంటి అనుమతులు లేకుండానే, ఎజెన్సీల అసోసియేషన్ ముసుగులో నాయకులను కలిసి ఒకరిపై ఒకరు చాడీలు చెప్పుకుని పబ్బం గడుపుకుంటూ ప్రభుత్వాన్ని ఎలాంటి నిర్ణయం తీసుకోనివ్వకుండా అడ్డుకున్నారు.

తెలంగాణ ఔట్ డోర్ మీడియా అసోసియేషన్ తీరు ఇదే?

టోమో అనే అసోసియేషన్‌లో మధు, రమేష్ అనే వ్యక్తులు అసెంబ్లీ ముట్టడికి రూ.2 కోట్లు వసూలు చేశారంటే కేసుల పేర్లతో ఎన్ని వసూళ్లు చేసి అక్రమ దందాలకు తెరలేపారో అర్ధమవుతోంది. నెలకు ఇల్లీగల్ బోర్డులు పెట్టి లక్షలాది రూపాయలు సంపాదిస్తారు. బయట ఏమీ లేదని బీద ఏడుపులు ఏడుస్తూ నాటకాలు ఆడటం వీరి ప్రత్యేకత. ఇందులో సభ్యత్వం లేని పెద్ద ఏజెన్సీల వద్ద డబ్బులు తీసుకుని ఎలా డ్రామాలు ఆడితే వాళ్లకు కలిసి వస్తుందో అలా ప్రభుత్వంపై లేదా సాటి ఏజెన్సీలపై వార్తలు రాయించి కాలం వెల్లదీసేలా ఉంటుంది వీరి వ్యవహారం.

ఆ నేతకు ఈ బోర్డులు, ఈ నేతే మొత్తం చక్రం తిప్పి వందల కోట్లు అంటూ పేపర్స్‌లో వార్తలు రాయించడం వీళ్లకు అలవాటు. కానీ, వాళ్లకు ఎన్ని బోర్డులు ఎక్కెడెక్కడ అక్రమంగా ఉన్నాయి. పాలసీ వస్తే ఎంత మందికి న్యాయం జరగుతుందో అర్ధం చేసుకోలేరు. పెద్ద ఎజెన్సీల కోసం అలా ఫైటింగ్ డ్రామాలే ఎక్కువ. వీరి వ్యవహారంపై ఇంటెలిజెన్స్ వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. అదే ఒక మహిళా ఎంటర్ ప్రెన్యూర్‌కి అన్యాయం, లైగింక వేధింపులు జరిగి సోషల్ మీడియా కోడై కూస్తుంటే ఈ అసోసియేషన్ ఇప్పటికీ స్పందించలేదు.

లీడ్ స్పేస్ దందా మాములుగా ఉండదు?

నాగేశ్వర్ రావు, లక్ష్మణ్ చౌదరీల ఆధ్వర్యంలో 9 ఏండ్ల క్రితం విజయవాడలో 4 బోర్డులతో ప్రారంభమై, ఈనాడు ఏటా రూ.350 కోట్ల బిజినెస్ చేస్తున్నారు. నిజాయితీగా చేస్తే ఎవరూ వీరిపై వార్తలు రాయరు. కానీ, చెప్పేది ఒక్కటి చేసేది మరొకటి. గతంలోనే ఆనాటి హైడ్రాలా భావించే సంస్థలో ఐపీఎస్ విశ్వజిత్‌ని పెట్టుకుని అనేక దందాలు చేశారు. పోలీస్ అంబరిల్లా టెండర్స్‌లో బెదిరంపులకు పాల్పడి 25 నుంచి 30 వేలు ఒక్కొక్క బోర్డుకు నష్టం వచ్చేలా టెండర్ వేసిన వారికి కట్టబెట్టారు. అదే లీడ్ స్పేస్ బినామి సంస్థలకు, ట్యాక్స్ లు చెల్లించకుండా మరో రూ.150 కోట్లు ఎల్ అండ్ టీకి మెలిక పెట్టి మరిచిపోయారు. అగ్రిమెంట్‌లో జీహెచ్ఎంసీ ట్యాక్స్ లు మీటర్‌కి 3,500 అని రాసుకున్నా, ఎల్ అండ్ టీ జీహెచ్ఎంసీకి చెల్లించాలని వారి మధ్యలో ఒప్పందం ఉన్నా, వీళ్లు వాళ్లకు చెల్లించరు.

ప్రభుత్వానికి చెల్లించకుండా ఇప్పటి వరకు రూ.150 కోట్ల ట్యాక్స్ కేవలం ఎల్ అండ్ టీ యాడ్స్ నుంచే పెండింగ్ ఉన్నాయి. వాళ్లు ఇవ్వడం లేదని వీళ్లు ఇవ్వడం మానేశారు. ఈ డబ్బులు ఇచ్చేది లేదని లీడ్ స్పేస్ యజమానులు లాబీయింగ్ చేసుకుంటున్నారు. అందులో సగం అయినా పొలిటీషన్స్ మింగేసి ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టేందుకు రెడీ అయినట్లు సమాచారం. గతంలో ఎన్నో దర్యాప్తుల్లో, ఆర్టీఐలో వీళ్ల ఐ అండ్ పీఆర్ దందా, ట్యాక్స్ ఎగ్గొట్టిన వ్యవహారం బయటపడ్డాయి. కానీ, ఎవరూ రికవరీ చేయలేకపోయారు. కూకట్ పల్లి గల్ఫ్ ఆయిల్ భూముల్లో 9 ఎకరాలు తీసుకుని ఇదే సంస్థ ఎంత బ్లాక్ అమౌంట్ ఇచ్చిందో చాలామంది రియల్ ఎస్టేట్ వ్యాపారులకు తెలుసు. వీరి బినామీ కంపెనీలే 6 ఉన్నట్లు గుర్తించారు.

ప్రకాశ్ ఆర్ట్స్ కథే వేరు?

పురాతనం అని చెప్పుకుంటునే కాలం చెల్లిన పుట్ ఓవర్ బ్రిడ్జిలపై డబ్బులు దండుకుంటారు. టెండర్స్‌లో తక్కువ ధరకు తీసుకుని నెలకు ఒక్కొక్క ఎల్ ఈడీ లైట్ కి నెలకు 25 నుంచి 30 లక్షలు సంపాదించే బోర్డులు ఉన్నాయి. ఏడాది మొత్తం జీహెచ్ఎంసీకి వీళ్లు చెల్లించేది రూ.10 లక్షలు కూడా ఉండదు. కానీ, ఒక్క బోర్డుకు నెలకు 40 లక్షలు సంపాదించి పెట్టే ఏరియాలో దందాలు చేస్తున్నారు. ఇవన్నీ కొత్త పాలసీ వస్తే పోతాయని వీళ్లు అడ్డుకుంటున్నారు. ఏటా 300 కోట్లు ఆదాయం వచ్చే ఈ ఔట్ డోర్ మీడియాని అసలు డబ్బులే తీసుకోకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. పైగా చర్యలు తీసుకుంటుందా అంటే అదీ లేదు. ట్యాక్స్ వసూలు చేస్తుందా అంటే అది లేకుండా ఈ దందాలు కొనసాగుతున్నాయి.

నవ నిర్మాణ్‌ సంగతి చూస్తే..

ఇటీవల దీనిపై నమస్తే తెలంగాణలో వార్తలు వచ్చాయి. సాయి గౌడ్ కేబీఆర్ పార్క్ వద్ద మల్టీ లెవల్ పార్కింగ్ ఫీజులు వసూలు చేయడం, బోర్డ్స్ పెట్టుకోవడంపై ఆరోపణలు ఉన్నాయి. ప్రత్యేక జీవోల ద్వారా అనుమతులు ఇవ్వడంపై అనేక ఆరోపణలు ఉన్నాయి. మెయింటనెన్స్ ఖర్చులు, నిర్మాణ వ్యయం భారీగా ఉందని అంటున్నారు. నాంపల్లిలో ఇలాంటి ప్రాజెక్ట్ మెట్రో నిర్వహించలేకపోయింది. చార్మినార్ వద్ద వేరే వాళ్లకు టెండర్స్ ఇచ్చేశారు. వీళ్ల పాత మీడియా అంటూ యాడ్ వేస్ పై అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో 68 జీవోకి విరుద్ధంగా రూ.200 కోట్ల పైన్ విధించిన తీరుపై హైకోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు. ఇలా ఒకరిపై ఒకరు కేసులు వేసుకుని ఈ మీడియాను ఓ మాఫియా లాగా మార్చారని అంటున్నారు.

ఔట్ స్పేస్ మీడియా?

నవీన్ కుమార్ దందా మూడు పుప్పులు 14 కాయలుగా ఉంటుంది. తెలంగాణలో ఉన్నా ట్రాఫిక్ అంబరిల్లాల్లో 90 శాతం ఏదో ఒక పేరుతో ఈయన చేతులోనే ఉంటాయి. ట్రాఫిక్ డీసీపీల లెటర్స్‌తో అన్ని దందాలు చేస్తారు. జీహెచ్ఎంసీ టెండర్స్‌తో 600 పిలిస్తే, వీళ్లు 2 వేలకు పైగా వేసుకున్నారని ప్రభుత్వం వద్ద నివేదికలు ఉన్నాయి. ప్రభుత్వానికి ట్యాక్స్ 60 కోట్ల వరకు చెల్లించాలి. సైబరాబాద్‌లో అవసరం లేకుండానే 5 ఏండ్ల పాటు తమకు ఏదో హక్కు ఉన్నట్లు 50 అంబరిల్లాల నిర్మాణం చేసి నెలకు 30 నుంచి 50 వేల యాడ్స్ కలెక్ట్ చేస్తారు.

ఇలా పోలీసుల పేర్లు చెప్పి తెలంగాణ మొత్తం విస్తరించారు. ట్రాఫిక్ పోలీసులు అందులో కూర్చోలేరు. కానీ, అక్కడ యాడ్ వస్తుందని నిర్మాణం చేశారు. ఒక్కొక్క ప్రాంతం నుంచి ఎలాంటి అనుమతులతో ఎలా తన అక్రమ హోర్డింగ్స్ సామ్రాజ్యాన్ని విస్తరించారో, ఎవరు బినామీలుగా ఉన్నారో ప్రభుత్వం వద్ద నివేదికలు ఉన్నాయి. నిజాంపేట్ మున్సిపాలిటీలో ఎక్కడా ట్యాక్స్ కట్టకుండానే ఫేక్ బిల్లులతో మొత్తం యూనిపోల్స్ నిర్మాణం చేసుకున్నారు. ఇలా అనేక మున్సిపాలిటీల్లో అక్రమ, ఫేక్, నకిలీ పేపర్స్‌తో దందాలు చేయడం ఈ ఏజెన్సీకి అలవాటని ఆ మీడియాలో ఉండే వాళ్లే ఆరోపిస్తున్నారు.

పాలసీ ఎందుకు రావడం లేదు? దీని జొలికి పోవద్దని ఎందుకు భయపడుతున్నారు?

అడ్వటైజింగ్ పాలసీని పెద్ద రొంపిగా తయారు చేశారు. వాళ్లకు వాళ్లే డబ్బులు ఇచ్చుకుని కోర్టుల్లో కేసులు వేసుకుని దందాను నడిపిస్తారు. ఎవరైతే ప్రభుత్వానికి ఆదాయం రావాలని ఆలోచిస్తారో వాళ్లపై మీడియాలో దాడికి ప్రయత్నిస్తారు. వీళ్లు వెళ్లాలంటే భయపడే పరిస్థితి. అలాంటి నేపథ్యంలో ఇప్పుడు కాంగ్రెస్ నేత, ముఖ్యమంత్రికి సన్నిహితుడు అని చెబుతున్న వ్యక్తం చేసిన ఘనకార్యంతో మరింత దూమారం చెలరేగింది. సోషల్ మీడియా వేదికగా కాకుండా పోలీసులకు బాధితురాలు ఫిర్యాదు చేసి ఆ సన్నిహితులపై ఎఫ్‌ఐఆర్ చేసేలా కృషి చేస్తే ఎంతో బాగుండు.

గతంలో లాగానే మళ్లీ రచ్చ లేపుకున్నారని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పాలసీ అమలు చేసే క్రమంలో ఇలాంటి వ్యవహారం జరగడంతో ఏం చేయాలో ఏం చేస్తే ఎలాంటి మరకలు అంటగడతారోనని కొంతమంది ఈ శాఖ వ్యవహారాలు చేసే వాళ్లు భయపడుతున్నారు. మొత్తంగా ఏటా సుమారు రూ.300 కోట్ల ఆదాయాన్ని ప్రభుత్వం లాస్ అవుతోంది. అలాగే, బాధితురాలికి న్యాయం చేయాల్సిన అవసరం కూడా ప్రభుత్వం వద్ద ఉంది.

#OutdoorMediaMafia#GHMCAdvertisingTaxes#SwechaNewsInvestigation#DevenderReddyChintakuntla#LeadSpace#PrakashArts#OutdoorAdPolicy#swechaanews
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి