సిరిసిల్లలో రాజకీయ సమరం మొదలైంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ సొంత నియోజకవర్గాన్నే తొలి టార్గెట్‌గా ఎంచుకున్న కాంగ్రెస్.. ఈ నెల 30న భారీ సభకు సిద్ధమవుతోంది. సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా రంగంలోకి దిగుతుండటంతో.. సిరిసిల్ల సభ తెలంగాణ రాజకీయాల్లో చర్చంశనీయంగా మారింది.
కేటీఆర్‌ను ఆయన సొంత నియోజకవర్గంలోనే రాజకీయంగా టార్గెట్ చేయడం ద్వారా బీఆర్ఎస్‌పై ఒత్తిడి పెంచాలన్నది కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తోంది. సిరిసిల్ల తర్వాత సిద్దిపేటలో కూడా సభ నిర్వహించే ఆలోచన ఉండటంతో.. బీఆర్ఎస్‌కు బలమైన రాజకీయ కేంద్రాలుగా ఉన్న నియోజకవర్గాలనే కాంగ్రెస్ సభలకు వేదికలుగా ఎంచుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరు మరో దశకు చేరుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి.
ఇక హైదరాబాద్‌లో విమర్శలు చేయడం వేరు.. ప్రత్యర్థి నేత సొంత గడ్డపైకి వెళ్లి ప్రజల మధ్య నిలబడి రాజకీయ సవాల్ విసరడం వేరు. అందుకే సిరిసిల్ల సభపై ఇప్పుడు ఆసక్తి పెరుగుతోంది. అయితే కేటీఆర్ సిరిసిల్ల నుంచి వరుస విజయాలు సాధిస్తూ వచ్చారు. 2018లో ఆయన మెజార్టీ ఏకంగా 89 వేలకుపైగా ఉండగా.. 2023లో అది 29,687 ఓట్లకు తగ్గింది. అంటే కేటీఆర్ గెలుపు కొనసాగినా.. మెజార్టీలో మాత్రం భారీ మార్పు వచ్చింది.
మరోవైపు సిరిసిల్ల భూముల వ్యవహారం ఇప్పటికే అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధానికి కేంద్రంగా మారింది. సీఎం రేవంత్‌రెడ్డి అసెంబ్లీలో సిరిసిల్లలో వేల ఎకరాల భూములపై ఆరోపణలు చేయగా.. కేటీఆర్ వాటిని ఖండిస్తూ, 8 వేల ఎకరాలపై పూర్తి వివరాలతో శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ఈ నేపథ్యంలో రాజకీయంగా ఈ భూముల అంశం రెండు పార్టీలకూ కీలక ఆయుధంగా మారింది..
కాంగ్రెస్‌కు ఇది.. గత ప్రభుత్వ హయాంలో జరిగినట్లు తాము ఆరోపిస్తున్న భూవ్యవహారాలను ప్రజల ముందుకు తీసుకెళ్లే అవకాశం. బీఆర్ఎస్‌కు మాత్రం.. ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలకు ఆధారాలు చూపించాలంటూ ఎదురుదాడి చేసే అవకాశం లభించింది. ఈ పరిస్థితుల్లో సెప్టెంబర్ 30 సిరిసిల్ల సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. అభివృద్ధి, ప్రభుత్వ పథకాలతో పాటు.. భూముల ఆరోపణలు, గత పాలన, బీఆర్ఎస్ నాయకత్వం.. ఇవన్నీ ప్రసంగంలో ప్రధాన రాజకీయ అంశాలుగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.
మరోవైపు బీఆర్ఎస్ కూడా సైలెంట్‌గా ఉండే పరిస్థితి కనిపించడం లేదు. కేటీఆర్ ఇప్పటికే రేవంత్‌రెడ్డి, కేసీఆర్ కుటుంబ ఆస్తులపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలంటూ సవాల్ చేశారు. అంటే సిరిసిల్లలో కాంగ్రెస్ సభ జరిగితే.. దానికి బీఆర్ఎస్ నుంచి కూడా కౌంటర్ రాజకీయంగా మరింత పదునెక్కే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే.. సిరిసిల్ల సభ కాంగ్రెస్, బీఆర్ఎస్ బలాబలాలను నిరూపించుకునే సభాగా మారే అవకాశముందనే సంకేతాలు వెలువడుతున్నాయి. ప్రస్తుతం ఈ అంశం తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది..











