సాగునీటి కోసం రైతులు రోడ్డెక్కారు.. చేతికొచ్చే దశలో ఉన్న వరి పంటను కాపాడుకునేందుకు గద్వాల నియోజకవర్గ రైతులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. జూరాల–నెట్టెంపాడు ఆయకట్టు కింద సాగు చేసిన వరి పంటకు నీరు అందక ఎండిపోయే పరిస్థితి ఏర్పడిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు.
సోమవారం జమ్మిచేడు సమీపంలో గద్వాల–కర్నూలు ప్రధాన రహదారిపై రైతులు ధర్నాకు దిగారు. జూరాల ప్రాజెక్టు నుంచి కాలువలకు వెంటనే నీటిని విడుదల చేసి పంటలను కాపాడాలని డిమాండ్ చేశారు. దాదాపు ఐదు గంటల పాటు కొనసాగిన ఈ నిరసనతో రహదారిపై భారీగా ట్రాఫిక్ స్తంభించింది.
రైతుల ఆందోళనకు బీజేపీ, బీఆర్ఎస్ నాయకులు మద్దతు తెలిపారు. బీజేపీ జిల్లా యువ నాయకురాలు డీకే స్నిగ్ధారెడ్డి రైతులకు సంఘీభావం ప్రకటించారు. వర్షాలు సరిగా లేక పంటలు నీటి కోసం ఎదురుచూస్తున్నాయని, ప్రభుత్వం వెంటనే కాలువలకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. వారంలో కనీసం మూడు రోజుల పాటు నీరు అందిస్తే వరి పంటను కాపాడుకునే అవకాశం ఉంటుందని ఆమె పేర్కొన్నారు.
రైతుల ఆందోళన నేపథ్యంలో జిల్లా అదనపు కలెక్టర్ మదన్ మోహన్ అక్కడికి చేరుకుని పరిస్థితిని వివరించే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పలువురు మహిళా రైతులు తమ పంటలను కాపాడేందుకు సాగునీటిని విడుదల చేయాలని అధికారులను వేడుకున్నారు.
మరోవైపు బీఆర్ఎస్ నాయకులు రైతుల ధర్నాకు మద్దతు తెలిపారు. మాజీ జడ్పీటీసీ బాసు శ్యామల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు రైతులకు సంఘీభావం ప్రకటించాయి. సాగు చేసిన పంటలకు నీరు అందించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొన్నారు.
ఐదు గంటల పాటు ధర్నా కొనసాగడంతో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు రైతులు, నాయకులతో చర్చలు జరిపారు. 24 గంటల్లో కాలువలకు నీటిని విడుదల చేస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో రైతులు ఆందోళనను విరమించారు.
అయితే ఇచ్చిన గడువులోగా నీరు విడుదల చేయకపోతే జిల్లా వ్యాప్తంగా మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని రైతులు, నాయకులు హెచ్చరించారు. ఇప్పుడు అధికారుల హామీ మేరకు కాలువలకు నీరు ఎప్పుడు చేరుతుందన్నదే ఉత్కంఠ రైతుల్లో నెలకొంది.









