తెలంగాణ

Telangana: కాళేశ్వరం అవినీతిలో కొత్త ట్విస్ట్.. నిధుల మళ్లింపు వారి ఖాతాల్లోకే!?..

రచన: Venu9 నిమిషాల పఠనం

కాళేశ్వరం కథలో నీటి కంటే అవినీతి గురించి ఎక్కువగా ఆరోపణలు వినిపించాయి. అప్పులు, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టులు, దర్యాప్తులు, రాజకీయ విమర్శలు ఎక్కువగా మూటగట్టుకుంది.

కాళేశ్వరం.. ఒకప్పుడు తెలంగాణ అభివృద్ధికి ప్రతీకగా కనిపించిన ప్రాజెక్టు. వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, భారీ పంప్‌హౌస్‌లు, బ్యారేజీలు, లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలన్న లక్ష్యం.. ఇవన్నీ కలిపి దేశంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టుల్లో కాళేశ్వరంను ఒకటిగా నిలబెట్టాయి. కానీ కాలం గడిచేకొద్దీ కాళేశ్వరం కథలో నీటి కంటే అవినీతి గురించి ఎక్కువగా ఆరోపణలు వినిపించాయి. అప్పులు, నిర్మాణ లోపాలు, కాంట్రాక్టులు, దర్యాప్తులు, రాజకీయ విమర్శలు ఎక్కువగా మూటగట్టుకుంది.

ఇక కాగ్ తన పనితీరు ఆడిట్‌లో కాళేశ్వరం ప్రాజెక్టు ప్రణాళిక, పనుల అమలు, కాంట్రాక్ట్ మేనేజ్‌మెంట్‌పై పలు అంశాలను ప్రస్తావించింది. ప్రాజెక్టు డీపీఆర్‌కు ముందే కొన్ని పనులు అప్పగించడం, ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచడం వల్ల అదనపు వ్యయం రావడం వంటి అంశాలను ఆడిట్ నివేదిక నమోదు చేసింది. అలాగే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత.. కాళేశ్వరం నిర్మాణంలో జరిగిన నిర్ణయాలు, ఆర్థిక వ్యవహారాలు, సాంకేతిక లోపాలపై గత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శిస్తోంది.

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా కాళేశ్వరం వ్యవహారాన్ని ప్రస్తావిస్తూ బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేశారు. 2026లో ఈ అంశంపై అసెంబ్లీ ఉభయ సభల్లో చర్చకు కూడా ఆయన సవాల్ చేశారు. అయితే బీఆర్ఎస్ వాదన పూర్తిగా భిన్నంగా ఉంది. కాళేశ్వరం నిర్ణయాలు ఒక్క వ్యక్తి తీసుకున్నవి కావని.. కేబినెట్, అసెంబ్లీ, కేంద్ర స్థాయి అనుమతులు, నిపుణుల నివేదికల ఆధారంగానే ప్రాజెక్టు రూపకల్పన జరిగిందని ఆ పార్టీ చెబుతోంది.

జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ నివేదికను కూడా బీఆర్ఎస్ ఏకపక్షంగా, రాజకీయ ప్రేరేపితంగా అభివర్ణించింది. అంటే.. ఒకవైపు కాంగ్రెస్ దృష్టిలో కాళేశ్వరం వ్యవస్థలో నిర్ణయ ప్రక్రియ, నిర్మాణ నాణ్యత, ఆర్థిక నిర్వహణలో తీవ్రమైన వైఫల్యాలు జరిగాయి. మరోవైపు బీఆర్ఎస్ మాత్రం ఇవన్నీ రాజకీయ ఆరోపణలేనని, అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే ప్రాజెక్టు ముందుకు వెళ్లిందని వాదిస్తోంది.

ఒక భారీ ప్రాజెక్టులో వేల కోట్ల రూపాయలు ఖర్చవుతున్నప్పుడు.. కేవలం ప్రాజెక్టు నిర్మాణమే కాదు, దానితో అనుసంధానమైన ప్రతి ఆర్థిక వ్యవస్థకు పారదర్శకత అవసరం. అధికారులు, కాంట్రాక్టర్లు, సంస్థలు, ఉద్యోగుల సంఘాలు, అసోసియేషన్లు.. వీటి మధ్య జరిగే ఆర్థిక లావాదేవీలపై కూడా అవసరమైనప్పుడు చట్టబద్ధమైన దర్యాప్తు జరగాల్సి ఉంటుంది.

అయితే ఈ ప్రాజెక్టుపై అవినీతి ఆరోపణలు ఉన్న నేపథ్యంలో.. ప్రత్యక్షంగా, పరోక్షంగా సంబంధం ఉన్న ఉద్యోగులు, సిబ్బంది, వివిధ స్థాయిల్లో పనిచేసిన వర్గాలతో సంబంధం ఉన్న వారిలో కొంత మంది ఏసీబీ దాడుల్లో పట్టుబడినప్పటికీ.. చాలా మంది తప్పించుకుని తిరుగుతున్నారన్న వాదన ఉన్నది. వారు పట్టుబడకపోవడానికి ప్రధాన కారణాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. కాళేశ్వరంలో పనిచేసి దోచుకున్న వారు పలు అసోసియేషన్లకు లీడర్లుగా ఉన్నారు.

దానిని ఆసరాగా చేసుకొని దోచుకున్న డబ్బునంతా అసోసియేషన్ల బ్యాంకు ఖాతాలకు మళ్లించినట్టు తెలిసింది. ఇప్పటికీ అసోసియేషన్ల ఖాతాల్లో కోట్లాది రూపాయల డబ్బు నిల్వలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇదంతా అవినీతిపరులు సేఫ్‌సైడ్‌లో ఉండటానికి వేసిన భారీ స్కెచ్ అనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో అసోసియేషన్ల బ్యాంకు ఖాతాలు బయటకు వస్తేనే అసలు గుట్టు రట్టయ్యే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతున్నది.

మరోవైపు ఈ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారే ప్రస్తుతం ఆ ఏరియాల్లోనే పనిచేస్తున్నారని తెలిసింది. ముఖ్యంగా రామగుండం సర్కిల్ పరిధిలో డిప్యూటీ ఈఈ, ఈఈ, సీఈల స్థాయిలో ఉండి ఈ అక్రమాలకు పాల్పడినట్టుగా సమాచారం. వీరే ఇప్పుడు ఆయా అసోసియేషన్లలో ప్రధాన పోస్టుల్లో ఉన్నారని తెలిసింది. పంప్‌హౌస్‌లలోనూ పనిచేయడంతో మోటార్ల కొనుగోలు, బిగింపులో అవినీతి, అక్రమాలకు పాల్పడ్డారనే టాక్ ఉన్నది. ప్రస్తుతం రామగుండం సర్కిల్ పరిధిలో పనిచేస్తున్న ఓ డిప్యూటీ ఈఈకి ఇందులో ప్రధాన హస్తం ఉన్నట్టుగా సమాచారం.

ఇక కాగ్ నివేదికలో కేఐపీసీఎల్ ద్వారా భారీగా రుణాలు సమీకరించినట్టు, 2022 మార్చి నాటికి రూ.87,449.15 కోట్ల రుణ ఒప్పందాలు ఉండగా రూ.64,283.40 కోట్లను డ్రా చేసినట్టు నమోదు చేసింది. ఇంతటి భారీ ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ ఖాతాలు మాత్రమే కాదు.. సంబంధిత వ్యక్తులు, సంస్థలు, సంఘాలు, అనుబంధ ఖాతాల మధ్య జరిగిన లావాదేవీలను కూడా పరిశీలించాల్సిన అవసరం ఉందన్న వాదన వినిపిస్తోంది.

అలాగే కాళేశ్వరం పనులు అత్యంత వేగంగా సాగిన కాలంలో సంబంధిత సంఘాల ఆర్థిక లావాదేవీలు కూడా ఇదే దృష్టితో పరిశీలించాల్సిన అవసరం ఉందనే వాదన ఇప్పుడు వినిపిస్తోంది. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం గత పాలనలో జరిగిన తప్పిదాలకు బాధ్యత వహించాల్సిందేనని చెబుతోంది. బీఆర్ఎస్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టును పునరుద్ధరించడంపై కంటే రాజకీయ ఆరోపణలపైనే ఎక్కువ దృష్టి పెడుతోందని ఎదురుదాడి చేస్తోంది. బీఆర్ఎస్ నేతలు మెడిగడ్డను వెంటనే పునరుద్ధరించి రైతులకు నీరు అందించాలని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం బ్యారేజీలను శాస్త్రీయంగా పునరుద్ధరించి, అవసరమైన భద్రతా అనుమతులు వచ్చిన తర్వాతే నీటిని ఎత్తిపోసే ప్రక్రియ చేపట్టాలని చెబుతోంది. అందుకే కాళేశ్వరం కథను కేవలం కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ రాజకీయ పోరుగా చూడటం కంటే దీనిపై ఏసీబీతోపాటు ప్రభుత్వం కూడా సీరియస్‌గా తీసుకొని దృష్టి సారిస్తేనే అసలు కథ బయటకు వస్తుందన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అలాగే ప్రజాధనం ఎలా ఖర్చయిందో, పర్యవేక్షణ ఎక్కడ బలహీనపడిందో తేల్చాలనే డిమాండ్ కూడా వినిపిస్తుంది.

#Telangana#Kaleshwaram corruption#funds diverted#KIPCL#new twist#Ramagundam
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి