మోకాళ్ళ నొప్పి.. చాలామందిని తరచూ ఇబ్బంది పెట్టే సమస్య. కొన్నిసార్లు ఎక్కువసేపు నిలబడటం లేదా నడవడం వల్ల వస్తే.. మరికొన్ని సందర్భాల్లో శరీరంలో జరుగుతున్న ఇతర మార్పులకు ఇది సంకేతంగా ఉండొచ్చని వైద్యులు చెబుతున్నారు. నొప్పి తీవ్రత, వచ్చే సమయం, నొప్పితో పాటు కనిపించే ఇతర లక్షణాలను బట్టి కారణాన్ని గుర్తించవచ్చని చెబుతున్నారు.
సాధారణంగా ఎక్కువసేపు నడవడం, నిలబడటం, వ్యాయామం చేయడం లేదా ఒక్కసారిగా శారీరక శ్రమ పెంచడం వల్ల కాలి కండరాలపై ఒత్తిడి పెరిగి నొప్పి రావచ్చు. కండరాలు పట్టేయడం కూడా మరో కారణం. శరీరంలో నీరు తగ్గడం, ఎక్కువగా చెమట పట్టడం, ఎలక్ట్రోలైట్లలో మార్పులు, కండరాలపై అధిక శ్రమ వంటి కారణాలతో ముఖ్యంగా రాత్రివేళ కాలి పిక్కల్లో క్రాంప్స్ రావచ్చు.
అయితే తరచూ మోకాళ్ల నొప్పి వస్తుంటే నిర్లక్ష్యం చేయకూడదు. మధుమేహం, థైరాయిడ్ సమస్యలు, నరాలకు సంబంధించిన సమస్యలు, కీళ్ల సమస్యలు లేదా కొన్ని మందుల ప్రభావం కూడా నొప్పికి కారణం కావచ్చు. నడుము నుంచి కాలు వరకు నొప్పి, మంట, తిమ్మిరి లేదా సూదులు గుచ్చినట్టుగా అనిపిస్తే నరాలపై ఒత్తిడి లేదా సయాటికా వంటి సమస్యలను కూడా వైద్యులు పరిశీలిస్తారు.
నడిచేటప్పుడు లేదా మెట్లు ఎక్కేటప్పుడు మోకాళ్లలో నొప్పి వచ్చి.. కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్న తర్వాత తగ్గిపోతుంటే మాత్రం ప్రత్యేకంగా గమనించాలి. కాళ్లకు రక్తప్రసరణ తగ్గే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్‌లో ఇలాంటి లక్షణాలు కనిపించవచ్చు. ముఖ్యంగా మధుమేహం, అధిక రక్తపోటు, అధిక కొలెస్ట్రాల్ లేదా ధూమపానం అలవాటు ఉన్నవారు వైద్యులను సంప్రదించడం మంచిది.
సాధారణ కండరాల నొప్పి అయితే తగినంత నీరు తాగడం, రోజూ తేలికపాటి వ్యాయామం చేయడం, వ్యాయామానికి ముందు తర్వాత స్ట్రెచింగ్ చేయడం ఉపయోగపడవచ్చు. కండరాలు పట్టేసినప్పుడు మెల్లగా స్ట్రెచ్ చేసి సున్నితంగా మసాజ్ చేయడం కూడా ఉపశమనం ఇవ్వొచ్చు. అయితే తరచూ క్రాంప్స్ వస్తున్నాయని కారణం తెలియకుండా కాల్షియం, మెగ్నీషియం లేదా ఇతర సప్లిమెంట్లను స్వయంగా తీసుకోవడం సరికాదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ముఖ్యంగా ఒకే కాలులో అకస్మాత్తుగా వాపు, ఎర్రదనం, వేడి, తీవ్రమైన నొప్పి కనిపిస్తే రక్తనాళంలో రక్తం గడ్డకట్టే డీప్ వీన్ థ్రాంబోసిస్ వంటి సమస్యగా పరిగణించాలి. ఇలాంటి లక్షణాలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా ఛాతిలో నొప్పి ఉంటే అత్యవసర వైద్య సహాయం అవసరంఅని వైద్యులు అంటున్నారు.
కాబట్టి కాళ్ల నొప్పిని కేవలం అలసటగా భావించి నిర్లక్ష్యం చేయకుండా.. నొప్పి ఎప్పుడు వస్తోంది, ఎంతసేపు ఉంటుంది, వాపు, తిమ్మిరి లేదా మంట వంటి లక్షణాలు ఉన్నాయా అనేది గమనించాలి. నొప్పి పదేపదే వస్తుంటే కారణాన్ని గుర్తించేందుకు వైద్యులను సంప్రదించడం.. సమస్యను సకాలంలో గుర్తించడానికి, సరైన చికిత్స పొందడానికి కీలకమని పేర్కొంటున్నారు..
ముఖ్య గమనిక: ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే. ఇది నిపుణుల లేదా వైద్యుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన ఎలాంటి నిర్ణయాలైనా తీసుకునే ముందు ఖచ్చితంగా మీ డాక్టర్‌ను సంప్రదించాల్సిందిగా మనవి!..








