భూమి అంటే ఒక కుటుంబానికి భరోసా.. ఒక రైతుకు జీవనాధారం.. ఒక దేవస్థానానికి భక్తుల విశ్వాసంతో ముడిపడిన ఆస్తి. కానీ భూమిపై ఆశ పెరిగినప్పుడు.. ఆ హక్కులు, ఆ విలువలు, చివరికి వ్యవస్థలే ప్రశ్నార్థకంగా మారుతున్నాయి. ప్రస్తుతం సమాజంలో ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి..
కోరుకొండ దేవస్థానానికి సంబంధించిన సుమారు 100.08 ఎకరాల భూమి ఏళ్లుగా పరాయి వ్యక్తుల చేతుల్లో ఉండటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. నాలుగు మండలాల పరిధిలోని 11 గ్రామాల్లో సుమారు 40 మంది పేర్లపై ఈ భూములు ఉన్నట్లు అధికారులు గతంలోనే గుర్తించినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2012, 2013 ప్రాంతంలోనే ఈ వ్యవహారంపై పరిశీలనలు జరిగి.. భూముల వివరాలు సేకరించి ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లినప్పటికీ.. పూర్తి స్థాయిలో పరిష్కారం ఎందుకు కాలేదన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
సుమారు ఐదు దశాబ్దాల క్రితం స్వామివారి పేరుతో ఉన్న భూములు ఎలాంటి ఆధారాలతో ఇతరుల పేర్లకు మారాయి? రిజిస్ట్రేషన్ రికార్డులు, రెవెన్యూ దస్త్రాలు, దేవాదాయశాఖ పత్రాలు ఏం చెబుతున్నాయి? ఒకరి నుంచి మరొకరికి చేతులు మారిన ఈ భూముల విషయంలో అసలు హక్కుదారుడు ఎవరు? ఇవన్నీ సమగ్రంగా తేలాల్సిన అంశాలు.
అలాగే మొదట భూమి ఎవరి పేరుపైకి వెళ్లిందన్నదే కాకుండా.. ఆ తర్వాత కొనుగోలు చేసిన వారు ఎవరన్నది పరిశీలించాల్సిందే. పాత లావాదేవీలను ఆధారంగా చేసుకుని భూములు కొనుగోలు చేసిన వారు ఇప్పుడు న్యాయపరమైన చిక్కుల్లో పడే అవకాశం ఉంది. అందుకే ఇలాంటి వ్యవహారాల్లో రికార్డుల పరిశీలన, హక్కుల నిర్ధారణ, పారదర్శకమైన చర్యలు అత్యంత కీలకం అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
దేవస్థాన భూములు ప్రజా విశ్వాసానికి సంబంధించిన ఆస్తులు. అవి ఒకసారి చేతులు మారితే కేవలం భూమి మాత్రమే పోదు.. దానిపై వచ్చే ఆదాయం కూడా దేవస్థానానికి దూరమవుతుంది. ఆ ఆదాయం భక్తుల సేవలకు, ఆలయ నిర్వహణకు ఉపయోగపడే అవకాశం కూడా కోల్పోతుంది. సెక్షన్ 85 వంటి చట్టపరమైన నిబంధనల ప్రకారం దేవస్థాన భూముల పరిరక్షణ, అవసరమైనప్పుడు స్వాధీనం వంటి చర్యలకు అధికారులు వ్యవస్థాగతంగా ముందుకు వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. అయితే గతంలో గుర్తించిన అంశాలు ఏళ్ల తరబడి పరిష్కారం కాకుండా ఉండటం మాత్రం పరిపాలనా వ్యవస్థపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.
ఇక సామాన్యుడి భూమైనా.. ఆలయ భూమైనా.. రికార్డులు బలహీనపడితే, బాధ్యత వహించాల్సిన వ్యవస్థలు మౌనంగా ఉంటే.. భూమిపై అత్యాశకు అడ్డుకట్ట వేయడం కష్టమవుతుంది. మనిషి జీవించడానికి అవసరమైన భూమి పరిమితం.. కానీ భూమిని దక్కించుకోవాలన్న ఆశకు మాత్రం హద్దులు లేకుండా పోతే.. చట్టబద్ధమైన హక్కులు, ప్రజా ఆస్తులు, చివరికి భక్తుల విశ్వాసం కూడా ప్రమాదంలో పడతాయి. అందుకే కోరుకొండ భూముల వ్యవహారంలో అసలు నిజాలు వెలుగులోకి రావాలంటే పాత రికార్డుల సమగ్ర పరిశీలనతో పాటు.. బాధ్యత వహించిన వ్యవస్థలపై పారదర్శకమైన విచారణ, భూముల ప్రస్తుత స్థితిపై స్పష్టమైన నిర్ణయం అవసరం అని అంటున్నారు..









