Spirituality

Spirituality: మానవుడు మట్టి కుండతో సమానం అంటారు ఎందుకు?..

రచన: Venu4 నిమిషాల పఠనం

మట్టిని నీటితో కలిపి, ఆకారం ఇచ్చి, అగ్నిలో కాల్చితే కుండ తయారవుతుంది. మనిషి శరీరం కూడా ప్రకృతి అనే మహాశక్తి చేతిలో అలా రూపుదిద్దుకున్నదేనని మన సనాతన ధర్మం చెబుతుంది.

మనిషి జీవితం నీటిలో బుడగ వంటిది. శరీరం మట్టి కుండతో సమానం అని పోల్చుతారు.. వేదాంతపరమైన ఈ వ్యాఖ్యలు అంతసులువుగా అందరికీ అర్థం కావు. కానీ ఆథ్యాత్మిక పరంగా ఎంతో లోతైన అర్థాన్ని కలిగి ఉంటాయని మన పండితులు చెబుతారు. ఇక మట్టిని నీటితో కలిపి, ఆకారం ఇచ్చి, అగ్నిలో కాల్చితే కుండ తయారవుతుంది. మనిషి శరీరం కూడా ప్రకృతి అనే మహాశక్తి చేతిలో అలా రూపుదిద్దుకున్నదేనని మన సనాతన ధర్మం చెబుతుంది.

ఉపనిషత్తులలో మానవ శరీరాన్ని పంచభూతాల సమాహారంగా వివరించారు. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం... ఈ ఐదు తత్త్వాలే శరీర నిర్మాణానికి ఆధారమని గర్భోపనిషత్ వివరిస్తుంది. శరీరంలో గట్టిగా ఉన్నది భూమి తత్త్వం, ద్రవంగా ఉన్నది జల తత్త్వం, వేడిమి అగ్ని తత్త్వం, కదలిక వాయు తత్త్వం, ఖాళీ ప్రదేశాలు ఆకాశ తత్త్వానికి ప్రతిరూపాలని చెప్పబడింది.

ఛాందోగ్య ఉపనిషత్ లో ఈ భూమే మానవ శరీరంలో శరీరరూపంగా ఉంది అనే భావాన్ని వ్యక్తం చేస్తుంది. అంటే మనిషి ప్రకృతికి వేరైనవాడు కాదు... ప్రకృతిలోని అదే తత్త్వాలతో తయారైనవాడని అర్థం.. అందుకే మట్టి కుండ ఉపమానం అంత గొప్పది.. ఇక కుండకు రూపం ఉంది.. కానీ ఆ రూపం శాశ్వతం కాదు. ఒకరోజు అది పగిలిపోతుంది. మళ్లీ మట్టిలోనే కలిసిపోతుంది. మానవ శరీరం కూడా అంతే. పుట్టుకతో ఒక రూపం వస్తుంది.. బాల్యం, యవ్వనం, వృద్ధాప్యం దాటుతూ చివరకు అదే పంచభూతాల్లో లీనమవుతుంది.

భగవద్గీతలో శ్రీకృష్ణుడు తన ప్రకృతిని భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనస్సు, బుద్ధి, అహంకారం అనే ఎనిమిది విభాగాలుగా వివరిస్తాడు.. కుండ మట్టి కాదు అని అనుకుంటే అది అజ్ఞానం... కుండే తన అసలు స్వరూపమని అనుకోవడం కూడా అంతే అజ్ఞానం.. అలాగే మనిషి నేనే ఈ శరీరం అని భావించడం కూడా అహంకారానికి మూలం. శరీరం ఒక పాత్ర... దానిలో నివసించే చైతన్యమే జీవుడి అసలు ప్రయాణానికి ఆధారం..

కుండ పగిలితే మట్టి నశించదు. అలాగే శరీరం నశించినా ఆత్మ నశించదని గీతా తత్త్వం బోధిస్తుంది. అందుకే ఈ మానవ జన్మను శాశ్వతమని భావించకుండా... ఈ మట్టి కుండ ఉన్నంతకాలం ధర్మం, దయ, భక్తి, జ్ఞానం అనే సుగుణాలను నింపుకోవాలి. ఎందుకంటే... కుండ ఎప్పుడు పగులుతుందో తెలియదు. కానీ అది పగిలేలోపు దానిలో ఏమి నింపామన్నదే మన జీవితానికి అసలైన అర్థాన్ని ఇస్తుంది.

గమనిక: ఇక్కడ అందించిన వివరాలు కేవలం సాంప్రదాయ పురాణ విశ్వాసాలు మరియు ఆధ్యాత్మిక భావనల ఆధారంగా ఇవ్వబడ్డాయి. వీటిని కేవలం మతపరమైన విశ్వాసాల కోణంలోనే చూడాలి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత రంగ నిపుణులను సంప్రదించడం మంచిది..

#Spirituality#Bhagavad Gita#Sri Krishna#Nature#Earth#Water#Fire#Air#Ether#Mind#Intellect#Ego
వాట్సాప్ ఛానెల్‌లో చేరండి

తెలుగు వాట్సాప్ చానల్‌లో చేరడానికి ఇక్కడ క్లిక్ చేయండి

గూగుల్‌లో స్వేచ్ఛను మీ ప్రాధాన్య వార్తా వనరుగా ఎంచుకోండి

తర్వాత చదవండి