అమెరికా ప్రభుత్వం ఇరాన్‌పై తన ఆర్థిక ఒత్తిడిని తీవ్ర స్థాయికి చేర్చింది. సెప్టెంబర్ 23 నుంచి ప్రపంచవ్యాప్తంగా ఇరాన్‌కు చెందిన అన్ని విమానయాన సంస్థల సర్వీసులను నిలిపివేయనున్నట్లు యూఎస్ ట్రెజరీ ప్రకటించింది. ఇరాన్ విమానాలకు ఏ దేశంలోనైనా ఏ విమానాశ్రయం అయినా ఇంధనం నింపినా, ల్యాండింగ్ సేవలు అందించినా, లేదా టికెట్లు విక్రయించినా ఆయా సంస్థలను అమెరికా డాలర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ నుంచి శాశ్వతంగా తొలగిస్తామని 'సెకండరీ ఆంక్షల' రూపంలో కఠిన హెచ్చరికలు జారీ చేసింది.
యూఎస్ ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బెసెంట్ సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ, ఇరాన్‌ను అంతర్జాతీయ సమాజంలో పూర్తి ఒంటరి చేయడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ఆంక్షలు నేరుగా ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పైనే కాకుండా, వారికి సహకరించే విదేశీ విమానాశ్రయాలు మరియు ఏజెన్సీలపై పడనున్నాయి. యూఎస్ డాలర్ లావాదేవీల సేవలు నిలిచిపోతే తీవ్ర ఆర్థిక నష్టం జరుగుతుందనే భయంతో పలు దేశాలు ఇప్పటికే ఇరాన్ విమానాలకు తమ ద్వారాలను మూసివేస్తున్నాయి.
2026 ఆగస్టు 24న అమెరికా ప్రభుత్వం ప్రారంభించిన 'ఆపరేషన్ ఎకనామిక్ అవుట్‌కాస్ట్' (Operation Economic Outcast) చర్యల్లో భాగంగానే ఈ కొత్త ఆంక్షలను విధించారు. ఇరాన్ తన వాణిజ్య విమానాలను సైనిక దళాల చేరవేతకు, ఆయుధాలు, అక్రమ వస్తువుల రవాణాకు ఉపయోగిస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. ఇప్పటికే మహాన్ ఎయిర్ సహా 27 ఇరాన్ విమానయాన సంస్థలపై ట్రెజరీ డిపార్ట్‌మెంట్ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే.
ఈ ఆంక్షల ప్రభావంతో ఇరాన్ వాణిజ్య విమానయాన రంగం ముందెన్నడూ లేని విధంగా సంక్షోభంలో కూరుకుపోనుంది. ఇప్పటికే టర్కీ, ఒమన్, ఇరాక్, జార్జియా వంటి దేశాలకు వెళ్లే ఇరాన్ విమాన సర్వీసులు దాదాపుగా రద్దయ్యాయి. కాగా, ఆంక్షల అమలు విషయంలో చైనా ఆర్థిక అధికారులతో కూడా మాట్లాడామని, వారు సానుకూలంగా స్పందించారని బెసెంట్ పేర్కొన్నారు. ఈ తీవ్ర ఆంక్షల నిర్ణయంపై ఇరాన్ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ప్రపంచ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.










